HCU deforestation episode మొత్తంలో అత్యంత బాధాకరమైన విషయం – ప్రొఫెసర్ కోదండరామ్ గారి మౌనం.
Aravind Jashua… ✍🏻
తెలంగాణ సాధన ఒక విఫలమైన విజయమా అనిపించేంతగా ఆయన ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. కానీ అది కేవలం కోదండ రామ్ గారికే పరిమితం కాదు. ఉస్మానియా యూనివర్సిటీ లో షూటింగ్ కోసం ప్రయత్నిస్తూ అక్కడి స్టూడెంట్స్ తో మాట్లాడినపుడు కూడా అదేరకం రియాక్షన్ కనిపించింది. కేసీఆర్ గానీ ఇక్కడికి(యూనివర్సిటీ కి) వస్తే చెప్పులు విసిరే వాళ్ళం అన్నారు వాళ్ళు. తెలంగాణ ఉద్యమానికి గాంధీ లాంటివాడు KCR. ఉద్యమం సమయంలో అగ్నిగుండంలా రగులుతూ ఉండేది ఉస్మానియా యూనివర్సిటీ. యూనివర్సిటీ లోకి అడుగుపెట్టిన ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అక్కడినుంచి పారిపోయేలా చేశారు అక్కడి విద్యార్థులు. ఇప్పుడు అదే విద్యార్ధులు కేసీఆర్ మీద రగులుతున్నారు. ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు.

Lermentov రాసిన మన కాలం వీరుడు పుస్తకం చదువుతుంటే – ఆ కథల కథానాయకుడు పెచోరీన్ ఒక విచిత్రమైన మానసిక స్థితిలో ఉంటాడు. గొప్ప శక్తి, ఆలోచన, యౌవనంలో ఉండికూడా ఆ వేడినంతా అమ్మాయిలని ఒక ఆటలా ఆకర్షించి, ప్రేమలో దించి, తీరా ఆ అమ్మాయి ప్రేమించడం మొదలెట్టాక ఆ ప్రేమని అవమానించి ఆమెని మానసికంగా కృంగదీయడంలో, అర్ధం పర్ధం లేని ప్రాణాంతక పోరాటాల్లోకి సరదాగా దూకి తనని తాను గాయపరుచుకోవడంలో తన సమయాన్ని, శక్తిని వృథా చేస్తుంటాడు. నిరాశగా ఉంటాడు. ఏదీ అతనికి ఎక్కువసేపు ఆసక్తినివ్వదు. ప్రతీదీ bore అనిపిస్తుంది. దీని అంతటికీ కారణం అప్పట్లో విఫలమైన అక్టోబర్ విప్లవం అని రాసుకొస్తాడు Lermentov. ఒక గొప్ప విప్లవం, జరుగుతున్న అన్యాయాలకి, అక్రమాలకి వ్యతిరేకంగా రగిలిన అగ్ని లాంటి విప్లవం, ప్రపంచ గతిని మార్చేస్తాం అని ఆశని కల్పించే ఉధృతమైన ఒక విప్లవం – అనుకున్న ఫలితాలని సాధించడంలో విఫలమైతే కలిగే నిస్పృహ, నిరాశ, ఉదాసీనత.
ప్రస్తుతం జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు తెలంగాణ మేధావుల, యువకుల ప్రతిస్పందన చూస్తుంటే నాకు రష్యాలోని అక్టోబర్ విప్లవం తరువాత రోజులు గుర్తొస్తున్నాయి. అంతా నిరాశగా ఉంది.



