కరెంట్ లేని చదువుల నుంచి.. అగ్రరాజ్యమే అబ్బురపడే టెక్ టైటాన్ గా!

సైబర్ సెక్యూరిటీ వ్యాపార రంగంలో తానో శాసనమైతాననిగానీ.. నాయకుడైతాననిగానీ… ఆయనేనాడూ అనుకోలేదు. కానీ, పట్టుదలతో ప్రయత్నించాడు. తాను సంపాదించినదాన్ని ఒకింత ధైర్యంతో పెట్టుబడులుగా మల్చి.. భవిష్యత్ ను సరిగ్గా అంచనా వేసి తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. విజయం సాధించి విస్తరించాడు. అమెరికన్ క్లౌడ్ సెక్యూరిటీ సంస్థైన Zscaler కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో.. మన భారతీయుడైన జయ్ చౌదరీ ఇప్పుడు తాజాగా ఫోర్బ్స్ విదేశీ మిలియనీయర్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. 2025 ఫోర్బ్స్ విదేశీ మిలియనీర్ల లిస్ట్ ప్రకారం.. 17.9 బిలియన్ డాలర్స్.. అంట్ 1790 కోట్ల రూపాయల నెట్ వర్త్ కల్గి ఉన్నారు జయ్ చౌదరి.

అమెరికాలో ఉన్న విదేశీ బిలియనీయర్ల జాబితాలో ఇప్పుడు ఇజ్రాయెల్, తైవాన్ ను మించి ఇండియా 12 మంది బిలియనీర్లతో గతంతో పోలిస్తే 2025లో అగ్రస్థానానికి ఎగబాకింది. ఆ తర్వాత ఇజ్రాయెల్, తైవాన్ 11 మంది బిలియనీర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా అమెరికాలో నివశిస్తున్న 125 మంది బిలియనీర్లలో జయ చౌదరి ఆస్తుల విలువలో 8వ స్థానంలో ఉన్నారు.

2022లో 43 దేశాల నుంచి 92 మంది బిలియనీర్లుగా ఉంటే.. ఆ సంఖ్య ఇప్పుడు ఏకంగా 2025కు 125కు చేరుకుంది. వీళ్లందరి సంపదా కలిపి 1.3 ట్రిలియన్ డాలర్స్. అంటే 1 లక్షా 30 వేల కోట్ల రూపాయలు. ఇది అమెరికా మొత్తం బిలియనీర్ల సంపదంలో 18 శాతం.

2025 జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన ఈలన్ మస్క్, రష్యాకు చెందిన సెర్గీ బ్రిన్, తైవాన్ కు చెందిన జెన్సెన్ హువాంగ్, హంగేరీకి చెందిన థామస్ పీటర్ఫీ వంటివారుండగా.. వారి సరనన నిల్చి జయ్ చౌదరి ఇప్పుడు రికార్డ్ సృష్టించారు.

ఇంతకీ ఎవరీ జయ్ చౌదురి..?

కరెంట్ కూడా లేని గ్రామీణ భారతంలో పుట్టాడు. హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలోని ఓ మారుమూల పల్లె పనోహ్ గ్రామం. ఆ ఊరికి చెందిన సన్నకారు రైతులైన తల్లిదండ్రులు భగత్, సూర్జీత్ దంపతులకు జన్మించిన జయ్ చౌదరీ గ్రామం కరెంట్ కష్టాలతో పాటు, తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంది. అంతేనా, తన హైస్కూల్ చదువులు సాగాలంటే నాల్గు కిలోమీటర్లు దూసరా వరకూ నడవాల్సిందే. విద్యుత్ సౌకర్యం కూడా లేని గ్రామంలో చెట్ల కింద చదివిన ఓ చదువరి.. తానే ఊహించలేనంత స్థాయికెదగడమే క్వైట్ ఇంట్రెస్టింగ్.

కానీ, చదువుల్లో మాత్రం సరస్వతీ పుత్రుడైన జయ్ చౌదరీ… బనారస్ హిందూ యూనివర్సిటీ అఫిలియేటెడ్ గా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నుంచి ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 1980లో తన 22 ఏళ్ల వయస్సులో మాస్టర్స్ కోసం ప్లెయిన్ ఎక్కాడు. అమెరికాలోని సిన్సినాటి యూనివర్సిటీలో ఇండస్ట్రీయల్, కంప్యూటర్, మార్కెటింగ్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ సాధించాడు. ఆ తర్వాత హార్వర్డ్ మేనేజ్ మెంట్ స్కూల్ లో… ఎగ్జిక్యూటివ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రాం కూడా పూర్తి చేశాడు.

ఐబీఎంలో ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. యూనిసిస్, ncr వంటి సంస్థల్లోనూ పనిచేసిన చౌదరీ.. ఐదు సెక్యూరిటీ సాఫ్ట్వేర్ స్టార్టప్ లను స్థాపించిన వ్యవస్థాపకుడిగా వార్తల్లోకెక్కాడు. 1996లో చౌదరీ భార్య జ్యోతితో కలిసి ఇంటర్నెట్ సెక్యూరిటీ సర్వీసెస్.. సెక్యూర్IT అనే సంస్థను ప్రారంభించారు. ఈ పెద్ద సైబర్‌ సెక్యూరిటీ స్టార్టప్‌ని 23 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు Google చర్చలు జరిపింది. అంతేకాదు, ప్రారంభమైన 18 నెలల్లోపే సెక్యూర్ ఐటీ పార్చూన్ 500 కంపెనీల్లో ఒకటిగా నిల్చింది. ఆ తర్వాత ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటు చేసిన టాప్ లెవల్ డొమైన్స్ కు.. బ్యాక్ ఎండ్ సిస్టమ్ లా ఉపయోగపడే ఒక సాఫ్ట్వేర్ నెట్వర్క్ వ్యవస్థైన VERISIGN అనే సంస్థకు తన సెక్యూర్ ITని విక్రయించాడు. అందుకోసం శాన్ ఫ్రాన్సిస్కో పయనమైన చౌదరీ.. 1999లో VERISIGNను వదిలేసి.. ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఈ-కామర్స్ రంగాల్లో వివిధ రకాల వెంచర్స్ ను ప్రారంభించాడు. 2000 సంవత్సరంలో CipherTrust and CoreHarbor పేరుతో ఈ మెయిల్ సెక్యూరిటీ కంపెనీని ప్రారంభించి.. 2006 వరకూ రన్ చేశాడు. ఆ తర్వాత CipherTrust and CoreHarbor పెర్ఫామెన్స్ నచ్చిన Secure Computing Corporation దాన్ని 274 మిలియన్ డాలర్స్ కు కొనుగోలు చేసింది. 2002 నుంచి సైమల్టేనియస్ గా ఆయన నడిపిన AirDefense వైర్ లెస్ సేవలు నచ్చిన మోటరోలా కంపెనీ దాన్నీ 2008లో కొనుగోలు చేసింది. అంటే… చౌదరీ ఏ సైబర్ సెక్యూరిటీ వింగ్ లో ఏ వ్యూహాన్ని రచించినా… ఆయన చిత్తశుద్ధి వాటికి మార్కెట్ ను సృష్టించింది. జయ్ చౌదరి అంటేనే ఓ బ్రాండ్ వ్యాల్యూ క్రియేట్ చేసుకున్నాడు.

2007లో ఆయన ప్రారంభించిన క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ Zscaler ఇప్పుడు క్లౌడ్ మార్కెట్ లో ఓ సంచలనం. మారుతున్న ఆన్ లైన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడ్వాన్స్డ్ గా ఆలోచించే ముందుచూపు, పరిణతి జయ్ చౌదరిని అద్భుతమైన ఎంటర్ ప్రెన్యూర్ గా నిల్పింది. దేశం కాని దేశంలోనూ.. ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల నిపుణులు తనను ఫాలో అయ్యేలా ఓ ట్రెండ్ సృష్టించాడు జయ్ చౌదరి.

అయితే, పేదరికంలో పుట్టి, పెరిగిన్నాట్నుంచీ కష్టాలకోర్చిన అనుభవం.. జయ్ చౌదరీని రాటు తేల్చింది. అందుకు, తన జీవిత భాగస్వామైన జ్యోతి మద్దతు కూడా తోడవ్వడంతో.. కంపెనీల్లో లాభ, నష్టాలను సమస్థాయిలో చూశారు. ఏనాడు కుంగిపోలేదు.. అలా అని పొంగిపోలేదు. తామన్నీ కోల్పోయినా… తిరిగి నిలబడగలమనే ఆత్మవిశ్వాసం ఆ జంటను నడిపించింది.

అయితే, ఇవాళ కోట్లకు పడగలెత్తిన ఆస్తిపరుడిగా ఎదిగినప్పటికీ జయ్ చౌదరీ దంపతులు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడపడం కూడా ఓ విశేషం. సాదాసీదాగా… విలాసాలకు దూరంగా.. పొదుపు, మదుపుపై దృష్టి సారించి వాటిని వ్యాపార విజయాలుగా మార్చుకున్నారు జయ్ చౌదరీ దంపతులు.

సెక్యూర్‌ఐటీతో ప్రారంభమైన విజయంతో పోలిస్తే… ప్రస్తుతమున్న Zscaler గణనీయమైన ఆర్థిక నష్టాలతోనే నడుస్తోంది. అయినప్పటికీ, భవిష్యత్తులో సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లను పరిష్కరించాలనే ఒకే ఒక్క దృఢ నిశ్చయం.. అందుకు తగ్గ సంకల్పంతో చౌదరీ గణనీయమైన వ్యక్తిగత పెట్టుబడులు పెట్టాడు.

కనీసం విద్యుత్ లైట్లు కూడా లేకుండా.. నాల్గేసి కిలోమీటర్లు నడిస్తేనేగానీ చదువుకోలేని ఓ మారుమూల కొండ ప్రాంతం నుంచి.. ఇవాళ అమెరికా వంటి అగ్రరాజ్యమే అబ్బురపడే క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ వ్యవస్థాపకుడిగా.. టెక్నాలజీ టైటాన్ గా… విజయగాధయ్యాడు మన జయ్ చౌదరీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles