సైబర్ స్టేట్ గా ఓ ద్వీపం: బాలాజీ శ్రీనివాసన్ కొత్త బంగారులోకమది!

పేరులోనే నిత్యానందాన్ని నింపుకున్న ఓ స్వామి ఈక్వెడార్ వద్ద కైలాస అనే కొత్త దేశాన్నే సృష్టించామంటే ఒకింత వెటకారంగా నవ్వుకున్నాంగా…? కానీ, ఓ ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్ ఏకంగా టెకీల కోసమే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడన్న వార్తను మరి మీరు నమ్ముతారా..? అవును, అతనే బాలాజీ శ్రీనివాసన్.

సింగపూర్ సమీపంలో ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి.. ఏకంగా సాఫ్ట్వేర్ రంగంలోని టెకీలు, ఇన్నోవేటర్స్, ఫౌండర్స్ కోసం ఏకంగా ఓ దేశాన్నే తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు శ్రీనివాసన్. నేటి సాంకేతిక రంగంలో డీ సెంట్రలైజ్డ్ డిజిటల్ సొసైటీ రూపకల్పన ఆయన కల. కొత్త కొత్త రంగాలు, కొత్త సాంకేతికత, కొత్త స్టార్టప్ లు వెల్లువలా వస్తున్నప్పుడు.. కొత్త దేశాల రూపకల్పన ఎందుకు సాధ్యం కాదన్నది బాలాజీ శ్రీనివాసన్ ప్రశ్న..?

కాయిన్ బేస్ మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పనిచేసిన బాలాజీ శ్రీనివాసన్, కొన్ని సిలికాన్ వ్యాలీ వెంచర్లలో కూడా సహ వ్యవస్థాపకుడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ ఇండస్ట్రీ వేళ్లూనుకున్న నేపథ్యంలో.. గతంలోనే, సాఫ్ట్వేర్, ఐటీ, నేటి ఏఐ వంటి అధునాతన టెక్నాలజీనందించే సంస్థలన్నింటిని ఒకే చోట ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఒక ప్రయోగాత్మక ఆలోచన శ్రీనివాసన్ లో మొదలైంది. ఆ ఆలోచననే ఇప్పుడు సాకారం చేయడానికి సింగపూర్ వద్ద ప్రత్యేక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు శ్రీనివాసన్.

ఈ విషయాన్ని బాలాజీ శ్రీనివాసన్ Xలోనూ షేర్ చేశాడు. నెట్వర్క్ స్టేట్ ను తీర్చిదిద్దే క్రమంలో… నెట్వర్క్ స్కూల్ కు తమ ద్వీపం నిలయమంటూ ఆయన పోస్ట్ కనిపిస్తోంది. టెక్నాలజీ రంగంలో రాణించాలనుకునేవారు, అందులో పనిచేస్తున్నవారికి ఈ ద్వీపపు దేశంలో ఏకంగా కృత్రిమ మేథస్సు, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, స్టార్టప్స్ వంటివాటితో పాటు, ఆరోగ్యంగా చురుకుగా ఉండేందుకు జిమ్ ఫెసిలిటీస్ కూడా కల్పించే విధంగా ప్రయోగాత్మకంగా ఈ మాడల్ దేశాన్ని తయారుచేస్తున్నారు.

తన ఆలోచనను నెట్వర్క్ స్టేట్స్: ఎమర్జింగ్ నేషన్స్ అని చెప్పుకుంటుంటే… చాలామంది నయా వలసవాద ప్రాజెక్టుగా కూడా భావించేవారున్నారు. అలాంటి దేశంలో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు తమతో పనిచేసే కార్పోరేట్ షేర్ హోల్డర్స్ కోసమే పనిచేసే ఒక నియంతృత్వ విధానానికీ తెర లేస్తుందనే ఆందోళన మరోవైపు కనిపిస్తోంది.

శ్రీనివాసన్ ఆలోచనలో ప్రధానంగా కనిపించేది ప్రత్యేక ఆర్థిక మండళ్ల వంటి చార్టెడ్ సిటీస్ ఏర్పాటు. అయితే, ఆ కల్పనంతా కూడా పూర్తిగా సాంకేతికంగా ఉండాలనేదే ఆయన ఆకాంక్ష. మనం మన ఇంటర్నెట్ ప్రొవైడర్ ను ఎంచుకున్నట్టే.. మనకిష్టమైన దేశాలనూ ఎంపిక చేసుకునే సౌలభ్యం భవిష్యత్తులో ఉండాలంటాడు బాలాజీ. అలా సైబర్ కంట్రీస్ పౌరులుగా పౌరసత్వాన్ని సంపాదించే ఒక కొత్త ఆలోచనే నెట్వర్క్ స్టేట్ ఆలోచన.

కొత్త సైబర్ స్టేట్స్ ఏర్పాటు గురించి శ్రీనివాసన్ 2022లోనే తన పుస్తకం ది నెట్వర్క్ స్టేట్ లో వివరించారు. తన కలను బిట్ కాయిన్ శక్తితో ద్వీపాన్ని కొనుగోలు చేసి ఇప్పుడు నిజం చేసుకుంటున్నట్టుగా కూడా శ్రీనివాసన్ తన X పోస్టులో వివరించారు. ఇప్పటికే ఈ ద్వీపంలో ఓ నెట్వర్క్ స్కూల్ ప్రారంభమైంది. ఇక్కడ మూడు నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియన్ ఇంటలిజెన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, వివిధ రంగాల్లో స్టార్టప్స్ పరిణామ క్రమం వంటివాటిపై శిక్షణనిస్తున్నారు. అలాగే, శారీరక, మానసిక దృఢత్వానికి కూడా అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొనసాగుతోంది.

ఇప్పుడు శ్రీనివాసన్ కొత్త తరహా ఆలోచన టెక్నాలజీ వర్గాల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మరోవైపు, విమర్శలకూ తావిస్తోంది. ఇప్పటికే అన్ని దేశాలపైనా కార్పోరేట్ శక్తుల ఆధిపత్య ధోరణులు చర్చనీయాంశమవుతున్న కాలంలో… శ్రీనివాసన్ ఆలోచన నియంతృత్వ పోకడల వైపు తీసుకెళ్లే ప్రమాదముందనేవారూ కొల్లలు.

కొత్త బంగారులోకమే శ్రీనివాసన్ ఆలోచన!

ఎలాంటి సరిహద్దుల్లేకుండా క్రౌడ్ ఫండింగ్ తో ఓ కొత్త సైబర్ ప్రపంచ సృష్టి వెనుక శ్రీనివాస్ ఆలోచనలు భిన్నంగా కనిపిస్తాయి. మొదట ఆన్లైన్ లో తమ అస్తిత్వం కోసం రిజిస్టరై, ఆ తర్వాత సదరు భూభాగంలోకి ఎంటరై, చివరకు ప్రపంచ గుర్తింపు పొందిన దేశంగా తాననుకున్న సైబర్ స్టేట్ ను రూపొందించే వినూత్న, ప్రయోగాత్మక ప్రయత్నంతో ఇప్పుడు శ్రీనివాసన్ అడుగులేస్తున్నాడు.

నిక్ పీటర్సన్ అనే ఓ కంటెంట్ సృష్టికర్త శ్రీనివాసన్ ప్రత్యేక దేశంగా పేర్కొంటున్న ద్వీపం ఎలా ఉండబోతుందో.. ఒక వర్చువల్ టూర్ విజువల్స్ ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. నెట్వర్క్ స్కూల్ లో ఎలాంటి అనుభవాలుండబోతున్నాయి.. కొత్త దేశాన్ని ఎలా సృష్టించబోతున్నాం.. అక్కడేమేం ఉండాలనే అంశాలపై ఒక స్పష్టమైన కంటెంట్ తో ఈ వీడియోను మీరిక్కడ చూడొచ్చు.

https://www.instagram.com/reel/DKtKX35vZ2N/?utm_source=ig_web_copy_link

మొత్తంగా డిజిటల్ యుగంలో అందుకనుగుణమైన సమాజాలను తయారు చేయడం, అలాంటి విధానంలోనే పాలననందించడం, రాబోయే రోజుల్లో తన ప్రయోగం తరహాలోనే కొత్త దేశాల పుట్టుకకు కారణమవ్వడం ఇలాంటి ఎందరికో అంచనాలకు కూడా అందని, ఊహలకు మాత్రమే పరిమితమయ్యే కొత్త బంగారు లోకం సృష్టి కోసం శ్రీనివాసన్ అడుగులు మాత్రం కడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అసలెవరు ఈ బాలాజీ శ్రీనివాసన్.. ?

అమెరికన్ జర్నలిస్ట్ బూన్స్రీ డికిన్సన్ ను వివాహం చేసుకున్న శ్రీనివాసన్.. న్యూయార్క్‌లోని తమిళ సంతతికి చెందిన వ్యక్తి. తల్లిదండ్రులిద్దరూ వైద్యులు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్, కెమికల్ రెండు ఇంజనీరింగ్‌ పట్టాలను పొందిన స్కాలర్. గత రెండు దశాబ్దాల నుంచి కౌన్సిల్, ఎర్న్.కామ్, టెలిపోర్ట్‌తో సహా అనేక ఉన్నత స్థాయి టెక్ వెంచర్లలో సహ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. బిట్‌కాయిన్, ఎథెరియం, ఆల్కెమీ వంటి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వ్యవస్థల్లో ప్రారంభంలో పెట్టుబడులు పెట్టాడు.

సుమారు 45 ఏళ్ల శ్రీనివాసన్ బాలాజీది విలక్షణమైన శైలి. సంప్రదాయవాదులను రెచ్చగొట్టే తీరులో ఆయన పోకడలుంటాయి. 2024లో ఆగ్నేయాసియాలోని ద్వీపంలో ప్రారంభించిన నెట్వర్క్ స్కూల్ ఇప్పుడు ఆయననుకున్నట్టుగా నడుస్తుండటంతో.. భవిష్యత్తులో దుబాయ్, టోక్యో, మయామీ క్యాంపస్ లపైనా శ్రీనివాసన్ ఫోకస్ పడింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles