మెకానికల్ ఇంజనీర్… జర్మనీలో మాస్టర్స్… ఆ తర్వాత యూట్యూబ్ స్టార్!
తొలి వీడియోకు రెండు నెలల సమయం తీసుకున్న ధృవ్ రాఠీ… ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఓ సంచలనం!
బెంగళూర్, ఢిల్లీల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ధృవ్ రాఠీ… నేరుగా స్ట్రీట్ ఫైట్ కు రావడంతో ఇప్పుడు ధృవ్ రాఠీ గురించి భిన్న రకలా చర్చలు కనిపిస్తున్నాయి. తాను ఎక్కడో జర్మనీలో ఉండటమెందుకు..? ఇండియాకు రావొచ్చుగా..? ఇక్కడే ఉండి ప్రభుత్వంతో ఫైట్ చేయొచ్చుగా..? రాజకీయాల్లోకీ ప్రవేశించొచ్చుగా..? ఆయన జర్మన్ సిటిజెన్ షిప్, వీసాపైనా వివాదం చెలరేగింది. విదేశీ పౌరసత్వం కల్గిన వ్యక్తి ఇక్కడ ఇండియాలో నిరసనలేంటి..? భారత్ లో ద్వంద్వ పౌరసత్వానికి అవకాశం లేనప్పుడు తానెలా ఇక్కడ ఆందోళనలో పాల్గొంటున్నాడు..? ఇదిగో ఇలా భిన్నరకాల అభిప్రాయాలతో ఇప్పుడు మళ్లీ రాఠీ పేరు మార్మోగిపోతోంది.
కానీ, మనకు ధృవ్ రాఠీ పేరు చెప్పగానే గుర్తొచ్చేది మాత్రం యూట్యూబ్ వీడియోలే. రాజకీయాలు, చరిత్ర, సామాజిక అంశాలు, పర్యావరణం, హర్రర్ స్టోరీస్, సమకాలీన పరిణామాలపై తను చేసే వివరాణాత్మక వీడియోలకు భారీగా ప్రేక్షకులున్నారు. ధృవ్ కూడా తన ప్రతీ వీడియోలో అంచనాలకు తగ్గకుండా కంటెంట్ పై చేసే ఎక్సర్సైజ్ కనిపిస్తుంది. తను లెఫ్టిస్ట్ అనుకునేవారు.. బీజేపీ వ్యతిరేకి అనుకునేవారు వ్యతిరేకించొచ్చు.. బీజేపీని వ్యతిరేకించేవారు, లెఫ్టిస్టులు అక్కునజేర్చుకోవచ్చు. ఇదంతా ఆయా వ్యక్తుల భావాజాలలకు సంబంధించిన విషయం. కానీ, ధృవ్ రాఠీ ఓ సక్సెస్ ఫుల్ డిజిటల్ ఎక్స్ప్లెయినర్ అన్నది మాత్రం నిజం.
మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి మొదలైన ధృవ్ రాఠీ కెరీర్… ఇప్పుడు రాజకీయాలపై తన వ్యాఖ్యానాలపై జనం మాట్లాడుకునేదాకా చేరింది.

ఇంకా ఆసక్తికరమేంటంటే.. ఇంజనీరింగ్ తర్వాత తను ఎంచుకున్న మార్గం కూడా సాధారణమైందేం కాదు.. జర్మనీలో రెన్యూవబుల్ ఎనర్జీలో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎకనామిక్స్ అండ్ పొల్టికల్ సైన్స్ లో కూడా మరో బ్యాచిలర్ డిగ్రీ కూడా ఉన్నట్టు ఆయన వెబ్సైట్ చెబుతోంది.
అంటే టెక్నాలజీ నుంచి ఎనర్జీ రంగంలోకి ప్రవేశించి… ఆర్థిక, రాజకీయ శాస్త్రాలపై కూడా విద్యాభ్యాసం సాగడం… తను చదివిన చదువును డిజిటల్ మీడియా యుగంలో తన యూట్యూబ్ ఛానల్ తో సమాజానికందించడం.. అందించిన విషయాలపై అనూహ్యమైన స్పందన లభించడంతో ధృవ్ రాఠీ ఇప్పుడు డిజిటల్ యుగానికి తగ్గ ఓ సెలబ్రిటీగా అవతరించాడు.
హర్యానా నుంచి జర్మనీకి!
డిజిటల్ స్టోరీ టెల్లింగ్ లో ఇప్పుడు దేశంలో మార్మోగిపోతున్న పేర్లలో ఒకటైన ధృవ్ రాఠీది హర్యానా స్వస్థలం. 1994, అక్టోబర్ 8న రోహ్ తక్ లో జన్మించాడు. పాఠశాల విద్యంతా భారత్ లోనే సాగింది. తర్వాత ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడే Karlsruhe Institute of Technology అనే జర్మనీలో పేరున్న విద్యాసంస్దలో మెకానికల్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన మాస్టర్స్ పూర్తి చేశాడు.
ఇంజనీరింగ్ నేపథ్యమే ధృవ్ ఆలోచనా విధానంపై ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. సమస్యను విడదీసి చూడటం, సమాచారం ఆధారంగా విశ్లేషణ, ఒక క్రమపద్ధతిలో విషయాన్ని చెప్పడం వంటి విద్యలో తను నేర్చుకున్న అలవాట్లన్నీ తన డిజిటల్ స్టోరీ టెల్లింగ్ లో పెట్టి ఇప్పుడో స్టార్ యూట్యూబ్ స్టోరీ టెల్లర్ అయ్యాడు ధృవ్.
ట్రావెల్ వీడియోతో కెరీర్ ప్రారంభం!
జర్మనీలో చదువుతున్న సమయంలోనే తనకు వీడియోలు చేయాలన్న ఆసక్తి, తపన మొదలైంది. 2014లో యూట్యూబులో ట్రావెల్ వీడియోలు పెట్టడం ఆరంభించాడు. మొదటి వీడియోను కూడా అత్యాధునిక కెమెరాతో కాకుండా.. తన దగ్గరున్న ఐఫోన్ 5ఎస్ తో చిత్రీకరించాడు. కానీ. ఆ వీడియో ఎడిటింగ్ కే చాలా టైం పట్టింది. రెండు నెలల సమయం తీసుకున్నట్టు ఆల్జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పాడు. అప్పట్లో తానే రీసెర్చ్, స్క్రిప్టింగ్, ఎడిటింగ్ అన్నీ చేసుకునేవాడు.
అంటే, ఈరోజు లక్షలాది మంది వీక్షిస్తున్న ధృవ్ వీడియోల వెనుక ఆరంభంలో.. ఓ ఫోన్ కల్గిన ఓ వ్యక్తి ఎంతో సమయం తీసుకున్న రోజుల నుంచి ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరం.
ఇంజనీరింగ్ నుంటి రాజకీయాలపై కామెంటరీ వరకు!
మొదట్లో ట్రావెల్ వీడియోలతో ఆరంభమైన ధృవ్ జర్నీ.. మెల్లిగా సామాజిక, రాజకీయ అంశాల వైపు మళ్లింది.
2016, సెప్టెంబర్ 16న రాజకీయాలపై కామెంట్ చేస్తూ ధృవ్ తొలి వీడియో యూట్యూబులో విడుదలైంది. అక్కడి నుంచి తన యూట్యూబ్ డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ప్రయాణం పూర్తిగా కొత్త దిశలో సాగుతూ వచ్చింది. అంతే ఆదరణను చూరగొంది. తొలినాళ్లల్లో రీసెర్చ్ నుంచి మొదలు ఎడిటింగ్ వరకూ తానే చూసుకున్న ధృవ్.. 2020 వరకూ కూడా ఒంటరిగానే తన పని చేసుకుంటూ పోయాడు. ఆ తర్వాత తన ఛానల్ విస్తరించడం.. ఆదరణ వస్తుండంటతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ధృవ్ రాఠీని మార్చేసిన థర్డ్ డిగ్రీ!
మెకానికల్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీలో మాస్టర్స్ సరే… కానీ, ధృవ్ ను మార్చేసింది మాత్రం మూడో డిగ్రీ అయిన ఎకనామిక్స్ అండ్ పాలిటిక్సే. తన ప్రస్తుత కంటెంట్ కు ఆసక్తికర నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు తనపై ప్రభావం చూపిన థర్డ్ డిగ్రీ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్సేనన్నది అర్థం చేసుకోవచ్చు.
ఓవైపు ఇంజనీరింగ్, ఇంకోవైపు ఎనర్జీ, మరోవైపు ఆర్థిక, రాజీకీయ శాస్త్రం.. అందుకే ఆయన వీడియోల్లో సైన్స్, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, ప్రజా సమస్యలు, హార్రర్ స్టోరీస్ వంటి భిన్నమైన అంశాలన్నీ కనిపిస్తాయి.
2023లో టైమ్ గుర్తింపు!
యూట్యూబులో ఎందరో డిజిటల్ స్టోరీ టెల్లర్స్ ను చూస్తున్న ఈరోజుల్లో… అందులో నాణ్యమైన కంటెంట్ తో.. అందరినీ ఆకట్టుకునే ప్రెజెంటేషన్ తో.. చెప్పాల్సినదాన్ని సూటిగా సుత్తి లేకుండా చెబుతూ రాణించాడు ధృవ్. డిజిటల్ స్టోరీ టెల్లర్ గా తన ప్రభావం అంతర్జాతీయంగా కూడా దృష్టిని ఆకర్షించింది. అలా 2023లో టైమ్ మ్యాగజైన్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ జాబితాలో ధృవ్ రాఠీకి స్థానం కల్పించింది. ముఖ్యంగా హిందీలో ట్రెండింగ్ అంశాలను వివరిస్తూ, ఫ్యాక్ట్ చెకింగ్ తరహా వీడియోలు రూపొందిస్తున్నట్టు ధృవ్ గురించి టైమ్ ప్రస్తావించింది. అంతకుముందే 2019లో DEATDCUE WELLE వంటి మీడియా సంస్థ ధృవ్ ను ఇంటర్వ్యూ చేసింది.
డిగ్రీ ఒకటి… కెరీర్ మరోటి!
ముందు తన ప్రయాణం మొదలైన తీరు వేరు. కానీ, రాను రాను ట్రావెలాగ్ ఆరంభించాక డిజిటల్ మీడియాపై మక్కువేర్పడింది. తాను చదివిన చదువుల వల్ల వచ్చిన జ్ఞానం.. మరింత పరిశోధనకు ఉపయోగపడింది. ఆ పరిశోధన, వాటిని ప్రేక్షకుడికి చెప్పే తీరు డిజిటల్ మీడియాలో ఆకట్టుకుంది. అలా ట్రావెలాగ్ తో మొదలైన ధృవ్ రాఠీ అనే డిజిటల్ స్టోరీ టెల్లర్ కాస్తా… నేడు భారతదేశ రాజకీయాల్లో కూడా టాప్ టూ బాటమ్ మాట్లాడుకునే స్థాయికెదిగాడు.


