హిజ్ ఎక్స్లెన్సీ అని పెట్టుకుని.. ఎక్స్లెంట్ గా బురిడీ కొట్టించాడు: ఇదో ఫేక్ రాయబారి క్రైంథ్రిల్లర్!

హిజ్ ఎక్స్లెన్సీ… ఇదెవరికి వాడతాం..? ఏ రాష్ట్రపతిని సంబోధిస్తూ రాస్తున్నప్పుడో.. లేక, ఏ చీఫ్ జస్టిస్ ను కోట్ చేస్తున్నప్పుడో వాళ్ల వాళ్ల అత్యున్నత స్థాయిని బట్టి రాయడం తెలిసిందే. ఎవరికి వారే ఎక్స్లెన్సీని ఆపాదించుకున్నా… లేక, నేను రావుగారిని మాట్లాడుతున్నానండి అంటూ వారికి వారే గౌరవాన్ని ఆపాదించుకుంటూ గారని సంబోధించుకున్నా.. ఇదేం ఆత్మగౌరవ పిచ్చిరా బాబు అని నవ్వుకుని కాస్సేపు ఎంజాయ్ చేసి ఊరుకుంటాం. కానీ, హిజ్ ఎక్స్లెన్సీ అని తన పేరుకు ముందు తగిలించుకుని జనాల్ని, వ్యవస్థల్నే పిచ్చోళ్లను చేసిన ఒకడి కథ నేను మీకు చెబుతాను వినండి.

ఇదంతా జరిగింది దేశ రాజధాని ఢిల్లీకి దగ్గర్లో. పేరు హర్షవర్ధన్ జైన్. ఇతనో నకిలీ రాయబారిగా చలామణి అవుతూ వ్యవస్థలకే చిక్కడు దొరకడన్నట్టుగా తిరిగిన మోసగాడు. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతగాణ్ని అరెస్ట్ చేయడంతో హర్షవర్ధన్ కథ విస్తుగొలుపుతోంది. ఇంతకాలం అతను అంత పెద్ద వ్యవస్థను దేశ రాజధానికి సమీపంలో నడిపిస్తూ ఎలా దొరక్కుండా తప్పించుకున్నాడన్నది ఓ విశేషమైతే.. మన వ్యవస్థలు ఇంకా ఎంత విశేషంగా పనిచేస్తున్నాయో కూడా చెబుతుంది ఈ కథ.

ఉనికిలోనే లేని దేశాలకు దౌత్యవేత్తగా హర్షవర్ధన్!

అప్పుడెప్పుడో స్వామి నిత్యానంద కైలాస దేశం పేరు చెబితే అదో దేశముందా…? దానికి దేశ అర్హత ఎవరు ఇచ్చారు..? అసలదంతా నిజమేనా…? అనే రకరకాల అనుమానాలతో ప్రశ్నలుద్భవించాయి… వాటితో పాటే కాస్త ఫన్ కూడా పుట్టుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే!

ఇప్పుడు హర్షవర్ధన్ దీ అలాంటి ఓ వింత బాగోతమే. వెస్టార్కిటికా, సబోర్గా, లోడోనియా, లండనియా.. ఇదిగో ఇలాంటి దేశాలకు మీరెప్పుడైనా వెళ్లారా..? పోనీ కనీసం ఆ పేర్లైనా విన్నారా..? కానీ, అసలు ఉనికిలోనే లేని ఇలాంటి దేశాలన్నింటికీ జైన్ ఓ రాయబారి. కాన్సుల్ జనరల్ గా తనను తాను ఎలివేట్ చేసుకున్న నయావంచకుడు.

ఘజియాబాద్ లోని కవినగర్ జైన్ అడ్డా. అక్కడో ఓ భారీ బంగ్లాను అద్దెకు తీసుకుని.. దాన్ని రాయబార కార్యాలయంగా మార్చేశాడు. ఎన్ని ఫేక్ కంట్రీసైతే ఉన్నాయో.. అన్ని నకిలీ దేశాల జెండాలను రూపొందించి.. వాటిని తన నకిలీ రాయబార కార్యాలయంపైన రెపరెపలాడించాడు. పైగా లోపలికెళ్లినా… కార్లపైన స్టిక్కర్స్ ను గమనించినా… హిజ్ ఎక్స్లెన్సీ కంపల్సరీగా కనిపించాల్సిందే మరి. వాస్తవానికి అంబాసిడర్స్ కార్లకు నీలిరంగు ప్లేట్లుంటాయి. అలాగే.. విలాసవంతమైన కార్లు.. వాటిపై బ్లూకలర్ ప్లేట్ల అమరికతో జైన్ దర్పం అంతాఇంతా కాదు.

నమ్మకాన్ని కల్గించేందుకు జైన్ చేసిన ప్రయత్నాలు!

నకిలీ దేశాల అంబాసిడర్ అన్నప్పుడు నిత్యానంద ఎలాగైతే గుర్తొచ్చాడో.. తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి జైన్ చేసిన ప్రయత్నాలు చూస్తుంటే మన కే.ఏ. పాల్ జ్ఞప్తికి రావాల్సిందే. ప్రధానమంత్రితో ఫోటోలు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో ఫోటోలు.. ఇతర ప్రముఖులెందరితోనో దిగిన ఫోటోలను సర్క్యులేట్ చేసేవాడు. అవన్నీ మార్ఫింగ్ చేసిన నకిలీ ఫోటోలే అయినప్పటికీ.. గుర్తించలేని విధంగా చేయగలన ఘనుడు కాబట్టే మన వ్యవస్థలకే చిక్కకుండా ఇన్నాళ్లూ రాయబారిగా దౌత్యాలు నడిపించాడు.

ప్రముఖులతో దిగిన ఫోటోలతో ఉన్నతవర్గాల వారినీ, కార్పోరేట్ సెక్టార్ వారినీ, వ్యాపార, వాణిజ్యరంగాలకు చెందినవారినీ మచ్చిక చేసుకున్నాడు. దానికి తోడు జైన్ కార్లు, రాయబార కార్యాలయం, నంబర్ ప్లేట్లు, అతడి దర్పం ఇవన్నీ ఇట్టే వారినీ బుట్టలో పడేశాయి. దాంతో తనకు తాను ఓ శక్తివంతమైన వ్యక్తిగా ఇమేజ్ సాధించాడు.

అసలెవరు ఈ జైన్..?

జైన్ తన తండ్రి మరణం తర్వాత కొన్ని ఎదురుదెబ్బలు తిన్నాడు. ఘజియాబాద్ లోని ఓ సంపన్న కుటుంబానికి చెందినవాడు. లండన్ తో పాటు, భారత్ లోనూ ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివినవాడు. అప్పట్లో బాగా వినిపించిన చంద్రస్వామితో పాటు, అంతర్జాతీయ ఆయుధాల వ్యాపారి అద్నాన్ ఖుషోగ్గి వంటి వివాదాస్పద వ్యక్తులతోనూ సంబంధ, బాంధవ్యాలున్నాయి. యూకే, దుబాయ్ వంటి దేశాల్లో డొల్ల కంపెనీలను స్థాపించి మనీ లాండరింగ్ చేయడం, బ్రోకరేజ్ నెట్వర్క్స్ ను బలపర్చడం ఈ హర్షవర్ధన్ జైన్ ప్రధానమైన పని.

మోసాలతో బురిడీ!

విదేశీ ఉద్యోగాలు, వ్యాపార ఒప్పందాలు, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశం కల్పిస్తామని హామీలివ్వడం వంటివాటితో… ఉపాధి కోసం చూస్తున్న యువత నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి విస్తరించాలనుకునే బడా బడా వ్యాపారులను ఆకర్షించడానికి ఏకంగా ఓ ఫేక్ దౌత్య కార్యాలయాన్నే సృష్టించాడు జైన్. అలా ఓ ఫేక్ కాన్సుల్ జనరల్ అవతారమెత్తాడు. విదేశీ బ్యాంక్ ఖాతాలు తెరవడానికీ, విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేయడానికి, వీసాలు, పాస్ పోర్ట్స్ వంటివి దరఖాస్తు చేసుకోవడానికి ఇలా ఏ రూపంలో బాధితులు కనిపించినా వదిలేవాడు కాదు జైన్. కానీ, చాలావరకూ అవేవీ పెద్దగా ఫలించిన దాఖలాలైతే లేనట్టుగానే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ చెప్పే మాట.

అయితే, అదే సమయంలో తాను డొల్ల కంపెనీలను నడిపేవాడు. హవాలా నెట్వర్క్ తో నిధులను విదేశాల బాట పట్టించేవాడు.

మరింతకాలం జైన్ ఎందుకు పట్టుబడలేదు..?

వాస్తవానికి తన మోసపూరిత విధానాలతో విదేశాలపై మోజున్నవారిని లొంగదీసుకుని చేసే కార్యకాలాపాలు ప్రారంభంలోనే పోలీసుల దృష్టికి రాలేదు. మొదట తన సొంత ఇంటినుంచే ఈ కథలన్నీ ప్రారంభించిన జైన్.. ఆ తర్వాత ఘజియాబాద్ కవి నగర్ లో ఏకంగా ఓ పెద్ద బంగ్లా అద్దెకు తీసుకుని ఏకంగా రాయబార కార్యాలయాన్నే సృష్టించాడు. అయితే, ఈ కార్యాలయం కూడా పెద్దగా ఫోకస్ లోకి రాలేదు. కానీ, ఓ అనామకుడి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ జైన్ లీలలు బట్టబయలయ్యాయి.

ఎస్టీఎఫ్ దాడితో బయటకొచ్చిన జైన్ కథలు!

ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జూలై 22న, మూడురోజుల క్రితం హర్షవర్ధన్ జైన్ బంగ్లాపై దాడి చేసింది. జైన్ అరెస్ట్ చేసింది. మోసాలకు గురిచేస్తున్న ఫేక్ డాక్యుమెంట్స్ తో పాటు… 54 లక్షల రూపాయల నగడు, విదేశీ కరెన్సీలు, నకిలీ డిప్లమాటిక్ నేమింగ్ ప్లేట్లతో నాల్గు లగ్జరీ కార్లు, నకిలీ డిప్లమాటిక్ పాస్ పోర్టులు, మరో 18 నకిలీ డిప్లమాటిక్ నంబర్ ప్లేట్లు, ఉనికిలోనే లేని వివిధ దేశాల పేరిట తయారుచేసిన 34 రబ్బర్ స్టాంపులు, నకిలీ ఎంఈడీ సీళ్లు, నకిలీ ప్రెస్ కార్డ్స్, నకిలీ పాన్ కార్డ్స్, లగ్జరీ వాచెస్ వంటి స్వాధీనం చేసుకున్నారు.

జైన్ పై ఎఫ్ఐఆర్!

భారతీయ న్యాయ సంహితలోని మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాల దుర్వినియోగం వంటి పలు విభాగాల కింద.. కవినగర్ పోలీస్ స్టేషన్‌లో జైన్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరియు జైన్ ఇంతకాలం నెరిపిన విస్తృతమైన హవాలా, షెల్ కంపెనీ నెట్‌వర్క్‌స్ పై ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది.

చూశారుగా.. ఓ క్రైమ్ థ్రిల్లర్ ను తలపించేలా లేదూ.. హిజ్ ఎక్స్లెన్సీ ఫేక్ కాన్సూల్ జనరల్ హర్షవర్ధన్ జైన్ కథ..! ఇది జైన్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ డిప్లమాటిక్ ఇమ్యూనిటీ!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles