నాదస్వరమే.. శెమ్మంగూడి గానస్ఫూర్తి: మరెందరికో ఆయనో మార్గదర్శి!

Sudhakar modumudi.. ✍🏼

జూలై 25 .. “సంగీత కళానిధి” శ్రీ శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ..

మా చిన్నతనంలో..అంటే..40 సంవత్సరాలకు పూర్వం, ఒక సంగీత విద్యార్థి.. వేదికనెక్కి,కచేరీ చేయాలంటే,కనీసం పది సంవత్సరాల పాటు శిక్షణ, గురువుల అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే.


నేను మొట్టమొదటిగా రెండుగంటల కచేరీ చేసింది బెజవాడ సత్యనారాయణపురంలోని ‘యువ కళాకారుల సంగీత సభ’లో.అప్పుడు నా వయసు 18 ఏళ్లు.ఆ రోజు కచేరీకి మా గురువుగారు అన్నవరపు రామస్వామిగారు,మృదంగ విద్వాన్ దండమూడి రామమోహనరావుగారు తదితరులు హాజరయ్యారు.


‘పారుపల్లి రామకృష్ణయ్య పంతులు సంగీత విద్యాలయం’లో,ఆ సంస్థ వ్యవస్థాపకులైన లంకా వేంకటేశ్వర్లుగారుగారి సమక్షంలో జరిగిన ఆనాటి కచేరీ,నా జీవితంలో మరువలేనిది.
అందరూ నా పాట బాగుందని ప్రశంసించారు.ఆ రోజుల్లో INDIAN EXPRESS దినపత్రికలో సంగీత కార్యక్రమాల సమీక్షలు నిష్పక్షపాతంగా వ్రాసేవారు-శివస్వామిగారు,సుందరరాజన్ గారు.వారిరువురూ తమిళులే.నగరంలో జరిగిన ప్రతి కచేరీనీ శ్రద్ధగా ఆసాంతం విని,వారు తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు వ్రాసేవారు.
INDIAN EXPRESS లో నా కచేరీ జరిగిన మరునాడు వచ్చిన సమీక్షను చూసి,ఆశ్చర్యపోయాను నేను.
Sudhakar displayed a wide range of his knowledge.In raga delineation, neraval,kalpana swaras and the rendition of songs, he showed maturity.Kalyani was the main piece of the evening.He gave a detailed alapana and rendered ‘birana brova idi manchi samayamura’ immensively.His neraval ‘nee paada pankajamu neranammi yunna vaada’ showed that he has picked up a few lessons from Semmangudi.
అంతకు మున్నెన్నడూ నేను శమ్మంగుడి గారి గానం కనీసం వినలేదు.వారి శైలిని నేను ఎలా అనుసరించగలను?
అయితే,ఆలోచించగా నాకు తోచినదేమిటంటే..మా గురువుగారు శమ్మంగుడి గారి అసంఖ్యాక కచేరీలకు వైలిన్ పై సహకారం అందించడం,వారి శైలిని ఇష్టపడటంచేత,వాటిని మనసులో ఉంచుకొని, వారు మాకు నేర్పిన పాఠం ద్వారా ఆ ప్రభావం నా పాటలో వినిపించి ఉండచ్చని నాకు తరువాత అనిపించింది.


శమ్మంగుడిగారి కచేరీ మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో (1989) విన్నాను.అదే వారు బహుశా చివరిసారి అక్కడ చేసిన కచేరీ.ఆరోజు హాలంతా జనంతో కిటకిటలాడింది.ఎక్కడా చోటులేక,టిక్కెట్టు కొనుక్కుని,వేదిక వెనుక నిలబడి,ఆ కచేరీ ఆసాంతం విన్నాను..వినికిడి శక్తి తగ్గి,శ్రుతిలో అక్కడక్కడా చేరకపోయినా,పండిన తమ విద్వత్తుతో, విలక్షణ బాణీతో,శ్రోతల్ని ఆనందాంబుధిలో మునకలేయించారాయన!
రాగాలాపన,స్వరప్రస్థారం,కీర్తన పాఠాంతరం అనే సుమాలను,రక్తి అనే దారంతో బంధించి,వారు ఆనాడు వాగ్దేవికి సమర్పించిన హారం,అతి మనోహరం! ఆనాడు శ్రోతలు పట్టుబట్టి,ఆయనతో మంజరి రాగంలోని ‘పట్టివిడువరాదు..’ త్యాగయ్య కృతిని పాడించుకున్నారు.తొమ్మిది పదులకు చేరువ అవుతున్న ఆ వయసులో అలా పాడారంటే,ఇక ఆయన చిన్నతనంలో ఎలా పాడిఉంటారో ఊహించుకున్నాను నేను.
నేను,(23-10-2016) ముంబై లో ‘గానకళ విద్యానిలయం’ లో కచేరీ చేశాను. ఆ సభవారు,కచేరీ ప్రాంగణంలో ప్రముఖ విద్వాంసుల ఫోటోలను సేకరించి,ఎంతో ఒద్దికగా గోడకు తగిలించారు.శమ్మంగుడిగారి ఫోటోని చూస్తూండగా, నాతో ఆ సభాధ్యక్షులు ఒక విషయం ప్రస్తావించారు.


ఒక సందర్భంలో శమ్మంగుడిగారి కచేరీ, ఒక ఊరి టౌన్ హాలులో ఏర్పాటు అయింది.ఆరోజు దురదృష్టవశాత్తూ పట్టుమని పదిమంది శ్రోతలు కూడా సభలో లేరట! ఒప్పుకున్నాక, తప్పదు కనుక, ఎలాగో కచేరీ పూర్తిచేశారట ఆయన.ఇదే విషయాన్ని, దుఃఖిస్తూ ఆయన, కంచి పరమాచార్యులవారితో..’నా కచేరీ వినే శ్రోతలే కరువయ్యారు.అక్కడ హాలులో ఉన్న స్తంభాల కోసం నేను కచేరీ చేశాను స్వామీ!’ అని బాధపడ్డారట.
పరమాచార్యులవారు నవ్వుతూ,’నాయనా!ఎందుకు బాధ పాడతావు? స్తంభంలో ఎవరు ఉంటారు?సకల భువనాలనూ తన కుక్షిలో ఉంచుకున్న ‘నరహరి’ ఉంటాడు!త్యాగయ్య,తన బహుదారి రాగ కీర్తన-‘బ్రోవ భారమా!’లో..’శ్రీ వాసుదేవ! అండకోట్ల కుక్షిని యుంచుకోలేదా!’అంటూ..ఈ విషయం చెప్పలేదా! స్తంభంలో ఉన్న ఆయన వింటే అందరూ విన్నట్లే కాదూ!’ అన్నారట!


ఆనాటి నుండీ శమ్మంగుడిగారు భగవంతుడి కోసమే పాడారు!
శమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వంటి మహానుభావులు అరుదుగా జన్మిస్తారు.స్వాతితిరునాళ్ మహారాజా రచించిన అసంఖ్యాక రచనలకు బాణీలు కట్టారాయన! అవి అన్నీ జగత్ప్రసిద్ధాలే!


శమ్మంగుడిగారు గాత్రజ్ఞులైనా,నాదస్వర వాద్యాన్ని ఎక్కువగా అనుసరించేవారు.కర్ణాటక సంగీత గమకాలను యధాతథంగా పలికించగల వాద్యం ఒక్క నాదస్వర మేననే అభిప్రాయంతో,టి.ఎన్.రాజరత్నం పిళ్లై గారివంటి మహానుభావుల నాదస్వర వాద్యం విని,ఆ పద్ధతిలో సంగీత సాధన చేసేవారు!రాజీ లేని సుసాంప్రదాయ కర్ణాటక బాణీ వారిది!


‘ఎందరో మహానుభావులు-అందరికీ వందనములు’.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles