కొందరితో కొన్ని వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అన్ఫర్గెట్టేబుల్ గా ఉంటాయి. అలాంటి ఓ అనుభవాన్నే పంచుకున్నారు బాలీవుడ్ గీత రచయిత సమీర్. భగత్ సింగ్ సినిమా కోసం రాజ్ కుమార్ సంతోషి ఏ. ఆర్. రెహమాన్ ను స్వరకర్తగా ఎంచుకున్నాడు. అందుకు కావల్సిన మ్యూజిక్ సిట్టింగ్స్ కు రాజ్ కుమార్ సంతోషితో పాటు, సమీర్ కూడా వెళ్లాడు. కానీ, వారికి కల్గిన అనుభవాలు వారిని ఎంతలా ఆశ్చర్యానికి గురిచేశాయో సమీర్ ఓ యూట్యూబ్ ఛానల్ లో పంచుకున్నారు.

రాత్రిళ్లు రెహమాన్ సంగీతం సమకూర్చే విధానం చాలామందికి వైవిధ్యంగానూ.. అందరికంటే ముందు తనకు స్వరకర్తగా అనువైన సమయంగానూ అనిపిస్తే… మరికొందరికి మాత్రం రెహమాన్ స్టైల్ నచ్చనీవాళ్లూ ఉన్నారు. అలాంటివాళ్లల్లో అదే బాలీవుడ్ కు చెందిన సింగర్స్ అభిజిత్, కుమార్ సాను వంటివారినెవ్వరిని కదిపినా ఒంటికాలుపై రెహమాన్ పై లేస్తుంటారు. ఇప్పుడు రెహమాన్ స్టైల్ కొందరు మ్యూజిక్ డైరెక్టర్లకు అనుసరణీయ విధానంగా కూడా మారిపోయింది. అందులో అనిరుధ్ కూడా ఒకరు. ఇప్పుడాయన మ్యూజిక్ సిట్టింగ్స్, రికార్డింగ్స్ కూడా రెహమాన్ శైలిలో రాత్రిళ్లే సాగుతుండటం అందుకో ఉదాహరణ.
అయితే, సమీర్ అండ్ రాజ్ కుమార్ సంతోషి ఎదుర్కొన్న అనుభవమేంటి..?
రాజ్ కుమార్ సంతోషితో కలిసి సమీర్ చెన్నైలోని ఏ. ఆర్. రెహమాన్ పంచతన్ స్టూడియోకి మబ్బున 3 గంటల సమయంలో వెళ్లాడు. అక్కడ రెహమాన్ లేడు. కానీ, అప్పటికే మరో ప్రముఖ దర్శకుడు మన రాంగోపాల్ వర్మ మెట్ల పైనే పడుకుని ఉన్నాడు. సుభాష్ ఘాయ్ అక్కడే పక్కనే ఉన్న మరో ఊయలపైన కూర్కులు తీస్తున్నాడు. లోపల స్టూడియోలో ఉండాల్సిన రెహమాన్ లేకపోగా… ఆశాభోంస్లే పాట పాడుతుంటే ఏ. ఆర్. రెహమాన్ అసిస్టెంట్ ఆ పాటను రికార్డ్ చేస్తున్నాడు. ఇంకోవైపు, మంచి నిద్ర పోవాల్సిన సమయంలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ అక్కడున్నవారితో ఏవో పిచ్చాపాటీ కాలక్షేప కబుర్లు చెప్పుకుంటున్నాడు.
మొత్తంగా ఒక్కసారిగా ఆ సీన్ చూసిన సమీర్ అండ్ సంతోషి అవాక్కయ్యారట. మరి రెహమాన్ ను తామెలా కలిసేదని ఆ అసిస్టెంట్ ను రాజ్ కుమార్ సంతోషి టీం అడిగితే.. ఆయన ఉన్న ప్రదేశమెక్కడో చెప్పి అక్కడికెళ్లాలని చెప్పాడటతను. ఆ ప్రాంతమంతా దట్టమైన అటవీప్రాంతం. అలా రెహమాన్ దగ్గరికి చేరుకుంటే.. ఆయన కారు వెంట తాము కూడా ఫాలో అయినట్టు చెప్పారు చంద్రకాంత్ పండిట్ అనే ఓ జర్నలిస్ట్ తో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సమీర్ అంజాన్. ఒక హైవేలో ఓ పక్కన తమ కారు ఆపుకున్న తర్వాత… ఆ హైవే పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి ప్రయణమయ్యారు రెహమాన్ అండ్ సంతోషి బృందం. ఆ అడవిలో దారి కనిపించేందుకు రెహమాన్ వెంట్ ఓ లాంతర్ కూడా ఉందట. అలా లోపలికి వెళ్లాక ఓ గుడిసె కనిపించందట. అదిగో అదే భగత్ సింగ్ సినిమా మ్యూజికల్ సిట్టింగ్ అడ్డా అయింది.
అసలు దేశభక్తుడైన భగత్ సింగ్ సినిమా సిట్టింగ్స్ కు వెళ్తున్నామా.. లేక ఓ హర్రర్ సినిమా మ్యూజికల్ సిట్టింగ్స్ కు ఏమైనా వెళ్తున్నామా అనే భావన కల్గిందట ఆ మూమెంట్ చూస్తుంటే సమీర్ లో. అదిగో ఆ గుడిసెలో ఆ కాళరాత్రిలా ఓవైపు ఒకింత ఆందోళన రేకెత్తిస్తున్న అడవిలో మధ్యలో ఓ గుడిసెలో కీబోర్డ్ పై కూర్చున్న రెహమాన్ భగత్ సింగ్ కోసం తాను సిద్ధం చేసిన ట్యూన్స్ వినిపించాడట. ఆ అనుభవం తర్వాత ఇక రెహమాన్ తో అర్ధరాత్రుల్లో సిట్టింగ్స్ కు ఎప్పుడూ హాజరుకావద్దని గుండెల్లో మొదలైన గుబులుతో మళ్లీ తిరిగి ఇప్పటివరకూ సమీర్ రెహమాన్ తో పనిచేయలేదట.
2002లో హీరో అజయ్ దేవగణ్ తో భగత్ సింగ్ సినిమాను తెరకెక్కించే క్రమంలో జరిగిన ఘటన ఇది. రాత్రి 11 గంటలకు కలుద్దామనుకున్నది.. మబ్బున మూడింటివరకూ ఎలా ,సాగిందో సమీర్ వాపోయాడు.



