ఇద్దరు లెజెండ్స్ నుంచి ఓ సూపర్ హిట్ సాంగ్! పాటకు ముందు మాత్రం రచ్చ రేపిన చర్చ!!

ఒక గొంతున ధ్వనించిన పాట.. మరో కంఠం నుంచి ప్రతిధ్వనిస్తే.. రెండు గళాల మధ్యనుండే ప్రకృతి సిద్ధమైన తేడా.. పాటను మరింత భిన్న స్వరంలో అందించి అలరిస్తుంది. అదే సమయంలో ఎవరు బాగా పాడారనే సారూప్యతాపరమైన ఒకింత చర్చకూ తెర లేపుతోంది. ఎందరో గాయకులు.. ఎన్నో పాటలు.. ఎవరి శైలి వారిది.. ఎవరి అభిమాన సంఘాలు వారివి.. సంఘాల మధ్య తమ గాయకుడు గొప్ప అంటే.. లేదు లేదు మావాడే గొప్ప అనే వాగ్యుద్ధాలు సర్వసాధారణం. అలా ఒకటే పాటను ఇద్దరు మేల్ లెజెండ్ సింగర్స్ పాడినప్పుడు జరిగిన చర్చే.. ఇదిగో ఈ ముచ్చట!

ఒక పాటను హ్యాపీ మూమెంట్ లో.. స్యాడ్ మూమెంట్ లో.. లేదా అదే పాటను అందరూ జత కలిసిన బృందగానంగానో మల్చిన సంఘటనలు మన సినిమాల్లో కొల్లలు. అలాగే, ఒక మేల్ గాయకుడో, ఫీమేల్ గాయనో.. ఒకే పాటను అటు విషాద గీతంగా.. ఇటు ఆనంద సంగీతంగా పల్లవించిన సినిమాలూ బోలెడు. ఒకే పాటను మేల్, ఫిమేల్ సింగర్సిద్దరూ వేర్వేరుగా సోలోగా ఆలపించినప్పుడూ కొంత పాడిన తీరుపై ఎవరు బెస్టనే చర్చ జరిగినా.. సందర్భాన్ని బట్టి.. అదీ మేల్, ఫీమేల్ కావడంతో అంత పోటీ చర్చకు ఆస్కారముండదు!

కానీ ఒకే పాటను ఇద్దరూ ఒకరికొకరు తీసిపోని అసమాన ప్రతిభావంతులైన గాయకులు పాడితే…? అదీ ఒకటే పాటను ఐదు వెర్షన్లుగా పెడితే…? అదే పాటను.. స్యాడ్ అండ్ హ్యాపీ మూమెంట్స్ లో ఆ ఇద్దరూ లెజెండ్స్ పాడితే..? కచ్చితంగా చర్చే! ఎవరు బాగా పాడారనే దానిపై.. ఇంటర్నెట్ బ్లాగ్స్ వారీగా విడిపోయి అభిమానులు తమ అభిమాన గాయకుడి గొప్పతనంపై ఇప్పటికీ పొగడ్తలు గుప్పిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆ ఇద్దరు లెజెండ్స్ లో ఆ పాటను ఎవరు బాగా పాడారని చర్చా.. ఇప్పటికీ ఎడతెగడం లేదు… అంతకుమించి సంతృప్తికరమైన సమాధానం దొరకడం లేదు. కారణం.. ఎవరికి వారే ఒకరికొకరు పోటీగా పాడిన తీరే ఆ పాట పోలిక విషయంలో ఇప్పటికీ జనంలో మీమాంసను తీర్చలేకపోతోంది.

కానీ ఒక పాట పాడించే విషయంలో ఇద్దరు లెజెండ్ సింగర్స్ లో ఫలానా వాళ్లతో పాడించాలంటే.. లేదు వీళ్లైతేనే కరెక్టనే చర్చ.. అదీ ఓ లెజెండ్రీ కంపోజర్.. ఓ పేరున్న దర్శకుడి మధ్య జరిగితే..? అదే.. “తుమ్ బిన్ జావో కహా.. ఇస్ దునియా మే ఆఖే” అనే ప్యార్ కా మౌసమ్ హిందీ సినిమా పాట!

దర్శకుడు నాజిర్ హుస్సేన్.. సంగీత దర్శకుడు ది వన్ అండ్ ఓన్లీ పంచమ్ దా! ఆ ఇద్దరు గాయకులు.. ది గ్రేట్ మహ్మద్ రఫీ… బాలీవుడ్ పై చెరగని ముద్ర వేసిన కిషోర్ దా!! నాజిర్ హుస్సేన్ స్వతహాగా మహ్మద్ రఫీకి ఓ వీరాభిమాని. ఆర్డీ బర్మన్ కూడా రఫీతో పలు పాటలు పాడించినా.. ఈజ్ ఆఫ్ సింగింగ్ తో పాటు.. తన పాటలకు మాడ్యులేట్ చేసి పాడటంలో కిషోర్ న్యాయం చేస్తాడన్న తెలియని ఓ ఇష్టం. ఈ క్రమంలో దర్శకుడు, సంగీత దర్శకుడి మధ్య వాదోపవాదాలు జరిగి.. ఏకంగా పంచమ్ సినిమా నుంచే తప్పుకునేదాకా వచ్చిందట పరిస్థితి! కానీ చివరాఖరకు.. ఇద్దరితోనూ పాడించాలని నిర్ణయించుకుని.. శశీకపూర్ కు రఫీ వాయిస్ తో.. భరత్ భూషణ్ కు కిషోర్ దా వాయిస్ తో.. ఇద్దరితోనూ ఓ స్యాడ్ సాంగ్.. ఓ హ్యాపీ మూమెంట్ సాంగ్ ని పాడించి సినిమాలో పెట్టారు. అగో అప్పట్నుంచీ.. కిషోర్ బాగా పాడాడా.. రఫీనా.. అనే చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. కొసమెరుపేంటంటే ఆ చర్చతోనే.. ఇప్పటికీ తుమ్ బిన్ జావో కహా అత్యధిక వ్యూస్ సంపాదించుకోవడంతో పాటు.. ఇంకా వింటూనే, చూస్తూనే ఉన్నారు జనాలు. అదండీ సంగతి!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles