Adventurous hero……………………………………….
ఈ ఫొటోలో కనిపించే పెద్దాయన జపాన్‌కు చెందినవాడు.పేరు కెనెచీ హోరీ. వయసు 83 ఏళ్ళు. ఆ వయసులో కూడా ప్రపంచంలోని సాగరాల్లోనే అత్యంత పెద్దదైన పసిఫిక్ ను ఓ చిన్న పడవలో.. ఎవరి తోడు లేకుండా ఒంటరిగా దాటేసి.. అందరినీ అబ్బుర పరిచాడు. ఈ ఘనత సాధించిన అతి పెద్ద వయస్కుడిగా చరిత్ర కూడా సృష్టించారు. సంకల్పముంటే వయస్సొక జస్ట్ నంబర్ మాత్రమేనని నిరూపించాడు.

మార్చి నెలలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కేవలం ఆరు మీటర్లు పొడవుండే పడవలో బయల్దేరిన హోరీ.. 69 రోజుల పాటు.. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని.. 8 వేల 500 కిలోమీటర్లు ప్రయాణించి మూడు రోజుల క్రితమే జపాన్ లో పశ్చిమ తీరంలోని కీ జలసంధికి చేరుకున్నాడు.
మార్గమధ్యంలో వాతావరణం అనుకూలించలేదు. హోరు గాలితో తుపాను వచ్చింది. అయినా చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు సాగాడు. షెడ్యూల్ కంటే ముందుగా ఏప్రిల్ మధ్యలో హవాయికి చేరుకున్నాడు. అక్కడ నుంచి ప్రయాణం బాగానే సాగింది. ఏదైనా సముద్రం మధ్యలో ఒంటరిగా ప్రయాణమంటే.. ధైర్య, సాహసాలతో కూడిన విషయమది.
ఇదే పసిఫిక్ మహా సముద్రాన్ని సూరి… 1962లో అంటే 23 ఏళ్ల వయసులో దాటాడు. అప్పుడు కూడా జపాన్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ఒంటరి సముద్రయానం చేశాడు. ఆ సమయంలో ఆయన దగ్గర అమెరికా పాస్ పోర్ట్ కూడా లేదు. అక్రమంగా అడుగు పెట్టినా.. హోరీ సాహసాన్ని తెలుసుకొని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రజలు ఘనంగా సన్మానించారు.
ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత.. అదే యాత్రను వ్యతిరేక దిశలో ప్రయాణం చేసి మరోసారి హోరీ రికార్డు సృష్టించాడు. 23 ఏళ్ల వయసులో ఒంటరి ప్రయాణం చేసినపుడు చాలా ఆందోళన పడ్డాడట. ఈసారి తన దగ్గర సాటిలైట్ ఫోన్ ఉంది. ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులతో మాట్లాడేవాడు. మెడికల్ కిట్ తీసుకువెళ్లి సమయానికి మందులు వేసుకునే వాడు.
ఈ జపాన్ సాగర వీరుడికి ఒంటరి యాత్రలు కొత్తేమీ కాదు. 1974లోనైతే సముద్రమార్గంలో ఏకంగా ప్రపంచాన్నే చుట్టి వచ్చాడు. కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని, పేర్లకీ పకీర్లని, పుకార్లకీ నిబద్ధులని శ్రీశ్రీ నేటి తరం యువత నిస్తేజాన్ని పాటలో ఎండగడితే… కెనేచీ హోరీ లాంటివాళ్లు ఇదిగో ఇలాంటి సాహసాలతో వెక్కిరిస్తూనే… మరోవైపు స్ఫూర్తి నింపుతున్నారు.
kn murthy.. ✍️



