సాధించాలనే కల… నువ్వు పడుకున్నప్పుడు కనేది కాదు… నిన్ను పడుకోకుండా తపించేలా చేసేదంటాడు.. దివంగత గ్రేట్ అబ్దుల్ కలామ్. అందుకు సరిగ్గా సరిపోయే క్యారెక్టర్ శ్రీకాంత్ బొల్లా. మన తెలుగింటి కుర్రాడు సాధించిన ఘనత.. ఇప్పుడు బాలీవుడ్ కు బయోపికైంది.
బాలీవుడ్ ప్రతిభావంతులైన యాక్టర్స్ లో రాజ్ కుమార్ రావు పేరు తప్పకుండా చెప్పుకోవాల్సిందే. ఆ రాజ్ కుమార్ రావే.. ఇప్పుడు మన తెలుగుంటి బిడ్డడైన శ్రీకాంత్ బొల్లా పాత్ర పోషించిన… శ్రీకాంత్ విడుదలై NETFLIX ఓటీటీలో కూడా వచ్చేసింది. కచ్చితంగా ఆ క్యారెక్టర్ కు సూటైన సరైన ఎంపిక.. రాజ్ కుమార్ రావు.

ఇక శ్రీకాంత్ బొల్లా గురించి కాస్త చెప్పుకోవాల్సిందే ఈ సమయంలో. పుట్టు గుడ్డైన శ్రీకాంత్ ను వదిలేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించినవారి సంఖ్యే ఎక్కువ. కుక్కలు ఇంట్లోకి వెళ్లితే కూడా తాను కాపలాకు పనికిరానని.. చిన్నప్పుడు మెత్త ముఖంపై పెట్టి చిదిమేయాలన్న దుర్మార్గపు సలహాలు కూడా నా తల్లిదండ్రులకు సమాజంలో కొందరి నుంచి వచ్చాయంటాడు శ్రీకాంత్. కానీ, కన్నపేగు బంధాన్ని కాదనలేకున్న పేరెంట్స్.. శ్రీకాంత్ ను ఎంత కష్టమైనా పెంచడంతో పాటు.. బాగా చదివించారు. ఆ శ్రీకాంత్ బొల్లానే ఇప్పుడు పేరుగాంచిన పారిశ్రామికవేత్తగా ఎదిగి.. తన బొల్లాంట్ పరిశ్రమలో తనలాంటి ఫిజికల్లీ, విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎందరికో ఉద్యోగాలిచ్చి ఒక ఇన్సిపిరేషన్ అయ్యాడు.
శ్రీకాంత్ బొల్లాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం. 1991లో పుట్టిన శ్రీకాంత్… ఆరేళ్ల వయస్సులో కిలోమీటర్ పైగా నడిచి స్కూల్ కు వెళ్లేవాడు. అదృష్టవశాత్తూ 8వ తరగతిలో బ్లైండ్ స్టూడెంట్స్ చదివే బోర్డింగ్ స్కూల్ లో సీటు లభించింది. అలా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు శ్రీకాంత్. ఇంజనీర్ కావాలన్నది శ్రీకాంత్ కల. కానీ, సైన్స్, మ్యాథమేటిక్స్ సబ్జెక్ట్స్ చదవడానికి శ్రీకాంత్ కు అర్హత లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు శ్రీకాంత్ మీమాంసలో పడ్డాడు. అంత మంచి స్కూల్ లో సీటు లభించింది సరే.. కానీ, తన లక్ష్యానికనుగుణంగా చదువుకోకపోతే… మచిలీపట్నం నుంచి హైదరాబాద్ దాకా ఈ ప్రయాణమెందుకనుకున్నాడో, ఏమో… స్కూల్ యాజమాన్యం తీరుపై ఏకంగా కోర్టుకెక్కాడు.
ఆర్నెల్లు విచారణకు తిరుగుతున్న క్రమంలో.. ఎంత కష్టమైనా నిరాశను దరి చేరనీయని శ్రీకాంత్ కు… మ్యాథమేటిక్స్ సైన్స్ చదివేందుకు కోర్టు అనుమతిచ్చింది. అలా తాననుకున్న మార్గంలోనే తనను కాదన్న స్కూల్ ను కోర్ట్ తీర్పనంతరం.. తానే వద్దనుకున్నాడు. అదే సమయంలో, చిన్మయ విద్యాసంస్థలో అంధ విద్యార్థులకు సైన్స్ అండ్ మ్యాథ్స్ లో అవకాశముందని తెలిసి.. అక్కడికెళ్లి.. ఏకంగా ఇంటర్మీడియట్ లో 98 శాతంతో టాపర్ గా ఔరా అనిపించాడు. ఆ క్రమంలో తోటి విద్యార్థుల ఎగతాళి కూడా భరించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేయాలనుకున్న శ్రీకాంత్ కు అక్కడా తన అంధత్వమే అడ్డుపడింది. అయితేనేం.. సమాజంలో ఇలాంటి నిరాశా, నిస్పృహలకు లోనయ్యే సవాళ్లెలాగూ ఉండనే ఉంటాయి.. వాటిని మనమెంతవరకూ ఫేస్ చేస్తామనే దృక్పథంతో ముందుకు సాగే వ్యక్తి శ్రీకాంత్. అందుకే, విదేశీ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నాడు. మన ఐఐటీ రిజెక్ట్ చేసిన శ్రీకాంత్ కు.. విదేశాల్లోని ఐదు యూనివర్సిటీల్లో సీటు లభించింది. అందులో మసాచుసెట్స్ లోని ఎంఐటీని ఎంచుకున్న శ్రీకాంత్ పేరు.. విదేశాల్లోని పేరుగాంచిన విశ్వవిద్యాలయంలో చదివిన మొట్టమొదటి విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్ గా కూడా రికార్డుకెక్కింది.
ఎంఐటీలో మేనేజ్ మెంట్ సైన్స్ లో శ్రీకాంత్.. తన చదువు పూర్తయ్యాక తనకు విదేశీ సంస్థల్లో మంచి ఉద్యోగాలొచ్చాయి. తనకు లభించిన అద్భుతమైన ఉద్యోగావకాశాలతో చిన్నప్పట్నుంచీ సమాజంలో ఎదుర్కొన్న ఈతి బాధలన్నీ మర్చిపోయేలా బతుకొచ్చు. కానీ, శ్రీకాంత్ అలా చేయలేదు. చాలా మంది సగటు భారతీయుడి కంటే కాస్త ఎక్కువ కనుకే శ్రీకాంత్ పేరును మనం చెప్పుకుంటున్నాం.. అలాగే, బాలీవుడ్ వంటి ఇండస్ట్రీలు.. ట్యాలెంటెడ్ ఆర్టిస్టైన రాజ్ కుమార్ రావు వంటివారితో ఏకంగా శ్రీకాంత్ స్పూర్తిని తెరకెక్కించాయి. ఓ భరతమాత ముద్దుబిడ్డడిగా.. తన చదువు పూర్తయ్యాక తన దేశంలోనే తాను ఉద్యోగమైనా, వ్యాపారమైనా చేయాలన్న పట్టుదలతో ఇండియా తిరిగివచ్చాడు శ్రీకాంత్. 2012లో భారత్ కు తిరిగి వచ్చిన శ్రీకాంత్ బొల్లా… రతన్ టాటా వంటి మరో స్ఫూర్తిదాయకుడి సహకారంతో.. హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీని ప్రారంభించాడు.
ప్యాకేజింగ్ మెటీరియల్స్ తయారుచేసే బొల్లాంట్ కంపెనీలో మరో ప్రత్యేకతేంటంటే.. ఇక్కడ తాటి ఆకుల వంటి పూర్తి పర్యావరణ అనుకూల వస్తువులనే తమ ఉత్పత్తులకు వాడటం విశేషం. అంతేకాదు, తన బొల్లాంట్ కంపెనీలో.. తనలాంటి ఫిజికల్లీ, విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎందరికో ఉద్యోగాలిచ్చి.. ఉపాధి కల్పించిన ఓ స్ఫూర్తిప్రదాత శ్రీకాంత్ బొల్లా. 2017లో ఫోర్బ్స్ జాబితాలోని 30 ఏళ్ల ప్రభావశీల వ్యక్తులు 30 మందిలోనూ శ్రీకాంత్ ఒకడు. ఇప్పుడు శ్రీకాంత్ బొల్లా వ్యాపార సామ్రాజ్యం విలువ.. సుమారు 450 కోట్లకు పైనే. ఈమధ్యే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన శ్రీకాంత్… ఇప్పుడు ఓ సినిమా ఇండస్ట్రీకే ఇన్స్పిరేషన్ అయి.. ఓ బయోపిక్ గా మన ముందుకొచ్చాడు. పైగా చూసి తీరాల్సిన సినిమా ఇది.
మచిలీపట్నంలో కిలోమీటర్ల నడకదారిన బడికెళ్లినప్పుడుగానీ.. తనకు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో చోటు లభించనప్పుడుగానీ.. ఐఐటీకి అప్లై చేస్తే సీటు రానప్పుడుగానీ… శ్రీకాంత్ బొల్లా ఊహించి ఉండకపోవచ్చు… ఇవాళ తనదైన సక్సెస్ స్టోరీ.. ఓ బాలీవుడ్ బయోపిక్ అవుతుందని.
అందుకే, మొట్టమొదట చెప్పుకున్నట్టు.. సాధించాలనే కల… నువ్వు పడుకున్నప్పుడు కనేది కాదు… నిన్ను పడుకోకుండా తపించేలా చేసేదన్న కలాం మాట శ్రీకాంత్ విషయంలో నిజమైంది. అలా అబ్దుల్ కలాం మాటలు స్ఫూర్తిని ఓం పట్టించుకున్న శ్రీకాంత్.. అదే కలాంతో కలిసి లీడ్ ఇండియా ప్రాజెక్టులో భాగస్వామయ్యాడు.
ఈమధ్య రిలీజై దేశవ్యాప్తంగా మార్మోగిన విధూ వినోద్ చోప్రా నిర్మించిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా అంత పేరు రాకపోవచ్చుగానీ.. శ్రీకాంత్ బొల్లా జీవితకథ ఆధారంగా తీసిన శ్రీకాంత్ మూవీ కచ్చితంగా అలరిస్తుంది.



