పాములు పగబడతాయా…? అంతా ట్రాష్ అని హేతువాదులంటారు. లేదు లేదు అనుభవంలోకొస్తేనేగానీ భ్రమలు తొలిగిపోవని ఆస్తికులంటారు. ఎప్పుడు మొదలైందో తెలియని ఈ వాదన.. ఎప్పుడంతమవుతుందో కూడా తెలియదు. ఇప్పడప్పుడే అంతమయ్యేదీ కాదు. కానీ, ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తి నెల రోజుల వ్యవధిలో ఆరుసార్లు పాము కాట్లకు గురవ్వడం యాదృచ్ఛికమే అయినా.. తర్కానికందని ఈ ప్రశ్న మళ్లీ ఇప్పుడు చర్చకు తెరలేపుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఆ కథేంటో ఓసారి తెలుసుకుందాం రండి.
పామంటేనే సర్వసాధారణంగా అంతర్లీనంగా ఓ భయముంటుంది. పాము ఎక్కడైనా ఉందటే… ఆ పరిసరాలకే ఆమడ దూరముంటాం. ఇక పాముకాటుకు గురైతే… అది కాటు వేసిందన్న భయమే మనిషిని సగం చంపేస్తుంది. కానీ, ఓ మనిషిని ఒక నెలలో ఆరుసార్లు పాములు కాటు వేసినా.. ఇంకా అతను మృత్యుంజయుడుగా బతికి బట్ట కట్టడమే విశేషం.
ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ దూబే అనే వ్యక్తి… గత నెల జూన్ 2 నుంచి ఈనెల జూలై 6 వరకు సరిగ్గా 35 రోజుల్లో ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 6 సార్లు పాము కాట్లకు గురయ్యాడు. అయితే, దూబేపై పాములు కాటు వేసిన ప్రతీసారీ సరిగ్గా సమయంలోపే ఆసుపత్రికి చేరుకోవం.. సరైన చికిత్స అందడంతో అతడు ఆరుసార్లూ కోలుకున్నాడు.
ఫతేపూర్ జిల్లా సౌరా గ్రామానికి చెందిన 24 ఏళ్ల వికాస్… మొట్టమొదట గత నెల జూన్ 2వ తేదీన తన ఇంట్లోనే పాముకాటుకు గురయ్యాడు. మంచంపై పడుకున్న దూబే లేస్తున్న క్రమంలో కిందే ఉన్న పాము వికాస్ కాలుపై కాటేసింది.
ఎలాగోలా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. వికాస్ ప్రాణాలతో బతికి బట్టకట్టాడు. కానీ, ఆ ఒక్కసారితో పాము కాట్లు ఆగిపోలేదు. అలా వరుసగా పాము కాట్లకు గురవుతూనే ఉన్నాడు. మొత్తంగా నాల్గుసార్లు పాములు కాటేయడం.. వికాస్ దూబేను హుటాహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లడం.. రక్షించుకోవడం ఇదంతా ఏం మాయ జరుగుతుందో కుటుంబీకులకుగానీ, అటు స్థానికులకుగానీ అర్థంగాని ఓ స్థితి ఏర్పడింది. నాల్గోసారి పాముకాటుతో కొంత సీరియస్ పరిస్థితేర్పడింది. దాంతో గత మూడు పర్యాయాలు దూబేను బతికించిన డాక్టర్ జవహర్ లాల్ బృందమే.. మళ్లీ వికాస్ ను బతికించింది. అది తన జీవితంలో చూసిన ఓ అరుదైన, వింత ఘటన అని చెప్పుకొచ్చారు డాక్టర్ లాల్.
దాంతో ఊళ్లల్లో ఉండే కొందరు తాంత్రికులు ఆ ఇల్లు నీకు అచ్చి రావడం లేదు… నాగదోషముంది.. ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకెక్కడికైనా వెళ్లమని చెప్పారు కాటు వేస్తున్న పాములన్నీ నాగుపాములేనో, కాదో కూడా తెలియకుండానే. అలాగే, వికాస్ దూబేకు అప్పటికే నాల్గుసార్లు వైద్యమందించి బతికించిన వైద్యుడు జవహర్ లాల్ కూడా మూడుసార్లు పాముకాటుకు గురయ్యాక.. ఇక్కడుండకండి.. కొంతకాలం ఎక్కడికైనా వెళ్లి ఉండండనే సలహా ఇచ్చారట. దాంతో తన ప్రాణాలను రక్షించుకునేందుకు ఇక చేసేది లేక ఇల్లు ఖాళీ చేసి.. రాధానగర్ లోని తన అత్తగారింటి బాట పట్టాడు.
అయినా, పాములు మాత్రం దూబే వెంట పడుతూనే ఉన్నాయి. మరి పామును అంతకుముందు వికాస్ దూబే ఏమైనా అన్నాడా అంటే.. అదీ లేదు. కానీ, పాము కాట్లు మాత్రం పునరావృతమవుతూనే ఉన్నాయి. అత్తగారింటికొచ్చినా పాములు వదల్లేదు. అలా ఐదోసారీ తన అత్తగారింటికొచ్చాక కూడా వికాస్ ను పాము కాటేసింది.
ఇక ఎక్కడైనా పాములు తమ కొడుకును వదిలిపెట్టడం లేదనుకుని.. వికాస్ తల్లిదండ్రులు తిరిగి అతణ్ని ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ మరో పాము ఆరోసారి కాటు వేసింది. కానీ, మళ్లీ సమయంమీద ఆసుపత్రికి వెళ్లడం వల్ల దూబే బతికిపోయాడు. అయితే, తాను పాముకాటుకు గురయ్యే ముందు తనకు తెలిసిపోతోందని.. ఆ రోజంతా ఓ పీడకలలా మారుతోందంటున్నాడు వికాస్ దూబే. పైగా శని, ఆదివారాల్లోనే ఇప్పటివరకూ ప్రతీసారీ దూబే పాముకాటుకు గురవ్వడంతో… శుక్రవారం గడిచి శనివారం వస్తోందంటేనే అమన్ తో పాటు.. ఆ కుటుంబం ఇప్పుడు బెంబేలెత్తిపోతోంది.
అయితే, ప్రతీసారీ పాముకాటుకు గురవుతున్నా మృత్యుంజయుడిగా బయటపడుతుండటం వికాస్ దూబే, వారి కుటుంబీకులతో పాటు అందిరనీ ఆశ్చర్యపరుస్తుండగా… మళ్లీ పామెప్పుడు కాటు వేస్తుందో… ఇలా ఇంకెంతకాలం జీవశ్ఛవంలా జీవితాన్ని గడపడమనే ఒక కల్లోలమైన ఆందోళన దూబేతో సహా, ఆ కుటుంబీకుల్ని ఇప్పుడు వేధిస్తోంది.



