మన పాస్ పోర్ట్ పూర్తిగా పనికిరానిదేనా… ? ఓ హైదరాబాదీ వ్యాపారవేత్త ఎందుకంత మాటన్నాడు..?
మన పాస్ పోర్ట్ ఏ మాత్రం పనికిరానిది. వీసా కోసం రోజులకొద్దీ వేచి చూడాలి… లేదంటే, వందలకొద్దీ పేజీల డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఎక్కడికైనా సులభంగా వెళ్లలేమంటూ హైదరాబాద్ వ్యాపారి జితేంద్ర ఎమ్మాని చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే ఊపందుకుంది.
CozyFarms.in వ్యవస్థాపకుడైన జితేంద్ర ఎమ్మాని భారత్ పాస్ పోర్టుతో అంతర్జాతీయంగా ప్రయాణించడంలో ఎదురయ్యే తిప్పలపై X ఖాతాలో తన అభిప్రాయాన్ని ఎలాంటి భేషాజాల్లేకుండా కుండబద్ధలు కొట్టాడు. our passport is absolutely useless అంటూ ఆయన చేసిన పోస్టింగ్ పెద్ద వైరల్ గా మారింది.
భారతీయ పాస్ పోర్టుతో వివిధ దేశాలు చుట్టిరావాలంటే ముందుగా వీసా తీసుకోవాల్సి ఉంటుందని… అందుకోసం, పెద్దమొత్తంలో డాక్యుమెంటేషన్, రోజులు, నెలల కొద్దీ వేచి చూడాల్సి రావడాన్ని ఆయన విమర్శించారు.
అమెరికా వీసా ఉంటేనే ఎందుకు..?
ఎక్కడైనా చెల్లుబాటున్న అమెరికా, షెంగెన్ వీసా ఉంటేనే… భారత పాస్ పోర్టుతో కొన్ని దేశాల్లోకి వెళ్లగలమనీ జితేంద్ర పేర్కొన్నారు. అలా అని అమెరికా వీసా పొందడమూ ఈరోజుల్లో ఓ బ్రహ్మపదార్థంలా మారిందంటాడు జితేంద్ర.
పైగా చాలామంది భారతీయులకు వ్యాలీడ్ యూఎస్ వీసా అనేది ఒక షార్ట్ కట్ లా మారిందని… ఒక భారతీయుడి పాస్ పోర్టును మరొక దేశంలోకి అనుమతించడానికి అమెరికా వీసా ముద్ర సపోర్ట్ ఏముందన్నది జితేంద్ర ప్రశ్న..? అంటే, భారత పాస్ పోర్ట్ ఉన్న వ్యక్తికి మరో దేశంలో ప్రవేశం కల్పించేందుకు… అమెరికా, షెంగెన్ వంటి మరో మూడో దేశం ఇచ్చిన వీసా ఎందుకు అదనపు విశ్వాస సూచిక కావాలన్న ఆయన ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చకే తెరలేపింది.

భారతీయులు ఇతర దేశాల పాస్ పోర్టుల కోసం ఎందుకు ఎదురు చూస్తుంటారు..?
అంతర్జాతీయ ప్రయాణంలో ఎదురయ్యే పలు సమస్యలే… కొందరు భారతీయులు ఇతర దేశాల పౌరసత్వం, పాస్ పోర్టుల వైపుకు చూడటానికి ఓ కారణమంటున్నారు జితేంద్ర. no wonders, so many indians are chasing other passports అని తన సోషల్ మీడియా వేదికగా భారతీయ పాస్ పోర్టును తూర్పారబట్టారు.
తను ప్రతీ ఏటా ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నుల రూపంలో 75 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు చెల్లిస్తున్నా… దేశంలోనూ, అంతర్జాతీయంగానూ ప్రయాణించే విషయంలో ఇప్పటికీ తనకేం పెద్దగా చెప్పుకోదగ్గ ప్రయోజనం కనిపించడం లేదంటున్నాడు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గతాన్ని తవ్వుతూ, నిందిస్తూ కూర్చోకుండా దేశ పరిస్థితులను మెరుగుపర్చే విధంగా, ఆ దిశలో చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తన పోస్ట్ ద్వారా గట్టిగా చెప్పాడు జితేంద్ర.
జితేంద్ర పోస్టుపై భిన్న స్పందనలు!
చాలామంది జితేంద్ర పోస్టును సమర్థించారు. భారతీయులు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ అంతర్జాతీయ ప్రయాణంలో వీసా ప్రక్రియ చాలా సంక్లిష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. మరికొందరు విభేదిస్తూ పాస్ పోర్ట్ బలాన్ని కేవలం వీసా రహిత ప్రయాణాల సంఖ్యతో మాత్రమే ముడిపెట్టలేమన్నారు. అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి ప్రతీ దేశానికీ సొంత వీసా విధానాలు, భద్రతా ప్రమాణాలూ ఉంటాయని గుర్తు చేస్తూ కౌంటర్ అటాక్స్ కూడా చేశారు.
మొత్తంగా జితేంద్ర తన X ఖాతాలో చేసిన ఒక్క పోస్ట్… ఇప్పుడు పాస్ పోర్ట్ శక్తి, అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛ, వీసా విధానాలు, పౌరసత్వం వంటి పలు అంశాలపైకి చర్చను మళ్లించింది.
అమెరికా, షెంగన్ వీసాలుంటేనే ప్రయాణాలు సులభంగా ఎలా చేయొచ్చనే విషయాన్ని నా అన్వేషణ ట్రావెలర్, ఇన్ఫ్లుయెన్సర్ కూడా సోషల్ మీడియాలో చెప్పాడు. తాజాగా తన అర్జెంటీనా పర్యటన సందర్భంగా తన కష్టాలను ఏకరువు పెడుతూ పోస్ట్ చేశాడు.


