చావు అంచులు చూసొచ్చింది… ఏళ్ల తరబడి వీల్ చైర్ కే పరిమితమైంది… చివరకు యూపీఎస్సీలో 483వ ర్యాంక్ సాధించింది. పట్టుదలతో ఏదైనా సాధించొచ్చని, విజయ దుందుభి మోగించిన డాక్టర్ అతిరా సుగతన్ కథ ఇది.
జీవితం కొన్నిసార్లు మనకు రెండో అవకాశమివ్వదు. మళ్లీ శూన్యం నుంచి మొదలుపెట్టాల్సిన పరిస్థితులనూ సృష్టిస్తుంది. అలాంటి సమయంలోనూ తిరిగి నిలబడటమే విజయంలో కనిపించే అసలైన కిక్కు. అలాంటి కిక్కునిచ్చే స్టోరీయే… ఈ అతిరాది.
ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్నే ఒక్కసారిగా మార్చేసింది. 28 రోజుల పాటు అతిరా వెంటిలేటర్ కే పరిమితమైంది. స్పృహలోకి వచ్చాక కూడా ఆమె కేవలం తన తల్లిని మాత్రమే గుర్తు పట్టిగల్గింది. తన పేరు కూడా తనకు గుర్తు లేని స్థితి. తండ్రి, తోబుట్టువులు, స్నేహితులు ఎవరో కూడా గుర్తు పట్టలేని ఒక మానసిక దైన్యస్థితినెదుర్కొంది. ఆ ప్రమాదం ధాటికి ఆమె బతకడమే కష్టం. ఇక జీవితంలో ఆమె నడవలేదనీ డాక్టర్లు తేల్చేశారు.
అప్పుడు ఆమె బీడీఎస్ చదువుతున్నారు. ప్రమాదం తర్వాత కోలుకుంటున్న సమయంలోనే తాను బీడీఎస్ మూడో ఏడు చదువుతున్నానన్న విషయం ఆమెకు మళ్లీ గుర్తుకొచ్చింది.

జీవితాన్ని మార్చిన పుస్తకం!
ప్రమాదం తర్వాత అతిరా పూర్తిగా వీల్ చైర్ కే పరిమితమైంది. రోజూవారీ పనులు కూడా సవాలే. క్రమంగా ఫిజియోథెరపీ చేయించుకుంటూ స్వతంత్రంగా వీల్ చైర్ ఉపయోగించే స్థాయికైతే చేరుకోగల్గింది. ఆ తర్వాత మళ్లీ పుస్తకాలు తెరిచి చదవే ప్రయత్నం మొదలుపెట్టింది. తాను గతంలో చదివిన విషయాలు కూడా అతిరాకు గుర్తు లేవు. బీడీఎస్ మొదటి సంవత్సరం నుంచి పుస్తకాలు తీసి మళ్లీ చదవడం ఆరంభించింది. ఒక్కో పేజీ తిప్పుతూ… మళ్లీ ఒక్కో విషయాన్ని కొత్తగా నేర్చుకోవడం మొదలెట్టింది. కాలేజీకి తిరిగి వెళ్లడం కూడా అంత సులభం కాదు. వీల్ చైర్ తో తరగతులకు వెళ్లడం, క్లినికల్ ట్రైనింగ్ చేయడం… ఇలా అన్నీ కొత్త సవాళ్లే. కానీ, ఆమె క్రమంగా తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.
క్లినికల్ ట్రైనింగ్ లో ఓ వృద్ధ మహిళకు దంత చికిత్స చేసింది. చికిత్స పూర్తైన తర్వాత ఆ మహిళ.. గతంలో తనకు జరిగిన చికిత్సతో పోలిస్తే ఈసారి ఎలాంటి నొప్పి లేదని చెప్పారు. ఆ మాటలు అతిరాకు మరింత ధైర్యాన్నిచ్చాయి. నేను మళ్లీ తిరిగి పుంజుకోగలను.. మంచి డెంటిస్ట్ కాగలననే నమ్మకాన్ని బలపర్చాయి. అదే పట్టుదలతో ఆమె బీడీఎస్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.
డాక్టర్ నుంచి వీల్ చైర్ మాడల్ గా ఎదిగిన అతిరా!
బీడీఎస్ లో ఫస్ట్ క్లాస్ ఫలితం సాధించిన అతిరా.. డెంటిస్ట్ గా స్థిరపడవచ్చు. కానీ, తన ప్రయాణాన్ని అక్కడితో ఆపలేదు. వీల్ చైర్ మాడలింగ్ లోకి అడుగుపెట్టింది. కేరళ ఫ్యాషన్ లీగ్ లో షో టాపర్ గా నిల్చింది. మిస్ వీల్ చైర్ ఇండియా పోటీలో ఫైనలిస్టుగా ఎంపికైంది. ఈ అనుభవం ఆమెకు మరో కొత్త ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది. తనను చూసే సమాజం సానుభూతితో కాకుండా.. ఆత్మవిశ్వాసాన్ని తనలో చూడాలన్నదే అతిరా కోరిక.
సివిల్ సర్వీస్ వైపు మనసెందుకు లాగింది..?
కోవిడ్ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసిన అనుభవం అతిరా జీవితంలో మరో కీలకమైన మార్పుకు కారణమైంది. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా చూడగల్గింది. సమస్య కేవలం శారీరక వైకల్యం మాత్రమే కాదని… అందుబాటులో లేని మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు లోపాలని… సామాజిక నిర్లక్ష్యం కూడా వారి జీవితాల్లోని చేదుకు కారణమని గుర్తించింది.
దాంతో తనకు వీలైనంత.. వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న సంకల్పం అతిరాలో ఏర్పడింది. దంత వైద్యురాలిగా ఒకరి ఆరోగ్యాన్ని మెరుగుపరచగలిగితే… సివిల్ సర్వీసెస్ ద్వారా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు ఉపయోగపడొచ్చనే ఆలోచన ఆమెకు కలిగింది.
నాల్గో ప్రయత్నంలో విజయం!
అతిరా యూపీఎస్సీ కోసం దాదాపు నాల్గేళ్లు సిద్ధమయ్యారు. ఎక్కువ పుస్తకాలు చదివేస్తే విజయం దరి చేరుతుందని మొదట్లో భావించినా… ఆ తర్వాత తన భావన మార్చుకున్నారు. పరిమితమైన సోర్సెస్ ను ఎంచుకుని వాటినే పదే పదే చదువుతూ… గతకాలపు ప్రశ్నాపత్రాలను ముందర వేసుకుని సాధన చేస్తూ… మాక్ టెస్టులు రాయడాన్ని తన సన్నద్ధతలో ముఖ్యమైన అంశాలుగా మార్చుకున్నారు. మెయిన్స్ కోసం ఆన్సర్ రైటింగ్ పై దృష్టి పెట్టారు. సమకాలీన అంశాలు, ముఖ్యమైన కమిటీల సిఫార్సులు, డయాగ్రామ్స్ వంటివాటితో మెయిన్స్ సాధించారు అతిరా. ఆ తర్వాత ఇంటర్వ్యూ కోసం తన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ ను అధ్యయనం చేసి మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రాక్టీస్ చేశారు. గతంలో ఇంటర్వ్యూ దశకు వెళ్లినా తుది జాబితాలో చోటు దక్కకపోవడానికి గల కారణాన్ని ముందు డయాగ్నసిస్ చేసిన డెంటల్ డాక్టర్ అతిరా.. తన ప్రతీ వైఫల్యాన్నీ ముగింపుగా చూడకుండా… తన ముందడుగుకు ఫీడ్ బ్యాక్ గా వాడుకున్నారు.
చివరకు 2025లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా 483వ ర్యాంక్ సాధించారు డాక్టర్ అతిరా సుగతన్.
28 రోజుల వెంటిలేటర్ పై నుంచి!
రోడ్డు ప్రమాదం తర్వాత తన పేరు తానే మర్చిపోయిన స్థితి నుంచి… కుటుంబ సభ్యులను గుర్తు పట్టలేని మానసిక దైన్యం నుంచి… నడవలేరన్న వైద్యుల అంచనాను మించి… ఏళ్ల తరబడి అతుక్కుపోయిన వీల్ చైర్ నుంచి… మళ్లీ బీడీఎస్ సాధించి… డాక్టర్ గా మారి… వీల్ చైర్ మాడల్ గా ఫ్యాషన్ పోటీల్లో నిలిచి… యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా 483వ ర్యాంక్ సాధించి… ఇది కదా విజయమంటే!
అందుకే, అతిరా కథను ఎందరిలానో కేవలం యూపీఎస్సీ విజయగాథగా చెప్పుకోవడానికే పరిమితం చేయలేం… ప్రమాదం తర్వాత అన్నీ కోల్పోయిన ఓ వ్యక్తి తన జ్ఞాపకాలను, చదువును, ఆత్మవిశ్వాసాన్ని, చివరకు తన జీవిత లక్ష్యాన్నే ఎలా నిర్మించుకుందో చెప్పే కథ.
ప్రమాదం ఒక మనిషి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేయొచ్చు. కానీ ఆ తర్వాత తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో కూడా అదే మనిషి నిర్ణయించుకోగలడని చెప్పే కథ.
ఒకప్పుడు తన పేరు కూడా గుర్తులేని స్థితి నుంచి… ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో 483వ ర్యాంక్ సాధించిన డాక్టర్ అతిరా సుగతన్ ప్రయాణం… పట్టుదల, పునఃప్రారంభం, ఆత్మవిశ్వాసం అంటే ఏమిటో చెప్పే ఓ స్ఫూర్తి పాఠం.


