కల్కిపై ఖన్నా ఫైర్!

ఆహా కల్కి… ఓహో కల్కి.. అవే సమీక్షలు.. అవే పొగడ్తలు.. అంతా గొర్రెధాటి. కానీ, ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఎవరో కొందరు మాత్రం చీల్చి చెండాడేస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించినప్పుడు మిగతా సమాజంతో విభేదిస్తూ తమ నిశ్చితాభిప్రాయాలను కుండబద్ధలు కొడుతున్నారు. అలాంటి జాబితాలో సునిశిత పరిశీలనతో రాసే సీనియర్ జర్నలిస్టులు, వివిధ రంగాలకు చెందిన విశ్లేషకులతో పాటు.. నటులు కూడా చేరిపోతున్నారు. అందులో ముఖేష్ ఖన్నా ఒక్కడు.

బీఆర్ చోప్రా మహాభారతంలో భీష్ముడి పాత్రతో మెప్పించిన ముఖేష్ ఖన్నా.. ఆ తర్వాత శక్తిమాన్ ధారావాహిక సీరియల్ తో ఆబాలగోపాలనికీ సుపరిచితుడయ్యాడు. అలాంటి ఖన్నా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని కల్కిపై.. ముఖ్యంగా దర్శకుడైన నాగ్ అశ్విన్ పైనే తన సినిమాలోని అశ్వత్థామ తరహాలోనే అస్త్రాలను ఎక్కుపెట్టాడు.

అసలు మహాభారతంలో జరగని విషయాలను ఎలా చూపిస్తారన్నదే ముఖేష్ ఖన్నా ప్రధాన ప్రశ్న కాగా.. వ్యాసమహార్షి కంటే మీకు ఎక్కువ తెలుసా అన్నట్టుగా ఆయన కల్కి 2898 ADపై విరుచుకుపడుతున్నాడు. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోందంటూ ఓవర్సీస్ మార్కెట్ తో కలిసి.. రోజుకో వంద కోట్ల చొప్పున పెరుగుతున్నట్టు చూపిస్తూ ఇప్పటికే 700 కోట్లకు దగ్గరగా అంటూ.. గతంలో ఏ సినిమాకూ ఇంత రాబడులు లేవన్నట్టుగా అతిశయోక్తులు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. ఈ సమయంలో కల్కిపై ఓ విమర్శనాత్మక రివ్యూ చేయడమే ఎవరో వేళ్ల మీద లెక్కించే కొందరు తప్ప.. మెజార్టీ సమాజమంతా మెచ్చుకుంటున్న వేళ.. బాలీవుడ్ వెండి తెర, చిన్నతెర యాక్టరైన ముఖేష్ ఖన్నా రివ్యూ ఇప్పుడు కల్కి సినిమాపై మరో కోణంలో చర్చకు ఆస్కారం కల్పిస్తోంది

సినిమా నిర్మాణ విలువల పరంగా కొంత బెటర్ అనిపించినా.. అందులో ముడిపెట్టిన అంశాలు.. కథను తమకనుకూలంగా మార్చుకుంటూ పురాణేతిహాసలను మార్చేసే విధానంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించేటప్పుడు మణిని తీసివేసే సన్నివేశమెక్కడా మహాభారతంలో లేదంటూ ముఖేష్ ఖన్నా చెప్పుకొచ్చాడు. అది తప్పు దోవ పట్టించడం కాదా అనేది ఖన్నా ప్రశ్న..?

తాను చిన్నప్పటి నుంచి మహాభారతం చదువుతున్నానని… తన ఐదుగురు పిల్లలను చంపిన తర్వాత అశ్వత్థామ మణిని తొలగించమని ద్రౌపది ఆదేశిస్తుందని… కానీ, ఆ యాక్యురసీని డైరెక్టర్ మెయింటెయిన్ చేయలేకపోయాడన్నారు. చారిత్రక, పౌరణిక గాధలను ఇష్టానుసారం తారుమారు చేయడాన్ని ముఖేష్ ఖన్నా ఆక్షేపించారు.

అలాగే, అర్జునుడు, అశ్వత్థామ మధ్య జరిగిన యుద్ధంలో.. ఇద్దరి వద్దా బ్రహ్మాస్త్రాలున్నా… వాటిని ప్రయోగించే విషయంలో అర్జునుడికే ఎక్కువ స్పష్టత ఉంటుంది. దాడిని ఎలా తిప్పికొట్టాలో అర్జునుడికి తెలుసుగానీ, అశ్వత్థామకు తెలియదంటాడు. అందుకే ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని గర్భవతైన అభిమన్యుడి భార్యపైకి అశ్వత్థామ చేశాడని.. ఆమెను 9 నెలల పాటు కాపాడిన శ్రీ కృష్ణుడే.. తనను కలియుగంలో కల్కిగా పుట్టే సమయంలో కాపాడాలని అశ్వత్థామను శాపవిమోచనంలో భాగంగా ఎలా ఆజ్ఞాపిస్తాడో తనకు అర్థం కాలేదంటాడు ముఖేష్ ఖన్నా.

ఇలా పురాణేతిహాసాలను ఇతివృత్తాలుగా తీసుకుని ఇష్టానుసారంగా మార్చే విషయంలో.. ప్రభుత్వాల నుంచే ఓ కమిటీ వేసి నిర్ధారించుకున్న తర్వాతే స్క్రిప్ట్ ను తెరకెక్కించాలనే డిమాండ్ ను ఇప్పుడు ముఖేష్ ఖన్నా తన అభిప్రాయంగా ముందుకు తెచ్చారు. గతంలో విడుదలైన ఇదే ప్రభాస్ ఆదిపురుష్ కూడా అలాంటిదేనని.. పురాణేతిహాసాలను గౌరవించాల్సిన బాధ్యతతో సినిమా నిర్మాణాలు జరగాలేగానీ, వక్రీకరణకు గురి చేయద్దంటున్నాడు.

గతంలో ఆదిపురుష్ టీమ్ పై… దర్శకుడు ఓంరౌత్ పైనా ముఖేష్ ఖన్నా అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. నిలబెట్టి కాల్చేయాలంటూ ఫైరయ్యాడు. ఇప్పుడు కల్కి కూడా తనను బాధించిందంటూ మరోసారి వార్తల్లోకెక్కి తన అభిప్రాయాన్ని కుండ బద్ధలు కొట్టాడు ఖన్నా.

ఓవైపు ఇప్పటికే 700 కోట్ల క్లబ్ లో చేరి… కల్కి ప్రపంచవ్యాప్తంగా ఓవైపు దూసుకుపోతుంటే.. మరోవైపు, అక్కడక్కడా ఇలాంటి చూరకలు కూడా ముఖేష్ ఖన్నా వంటివారి రూపంలో తెరపైకొస్తున్నాయి. సృజనాత్మకత పేరుతో సాంస్కృతిక, సంప్రదాయాలకు తిలోదకాలిచ్చే విధంగా వారికున్న భావ స్వేచ్ఛను దుర్వినియోగపర్చడం సరికాదని.. సమతుల్యత పాటించాలన్నది ఖన్నా అభిప్రాయం. భవిష్యత్తులో ఇలాంటి కథలను తెరపైకెక్కించేటప్పుడైనా… దర్శకులు కచ్చితత్వాన్ని పాటించాలని కోరుతూ.. కల్కి 2898 ADని తీవ్రంగా తప్పుబట్టారు ముఖేష్ ఖన్నా.

మొత్తంగా ఏదో ఓ రకంగా కల్కి వార్తల్లో నిలుస్తూ దూసుకుపోతుండటం కొసమెరుపు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles