నిచ్చెనెక్కినంత వేగంగా.. పాములు మింగిన వైకుంఠపాళీ.. ఆయన వ్యాపారజీవితం!

సుబ్రతా రాయ్… గుర్తున్నాడుగా…? భారత్ ఎప్పటికీ మర్చిపోని వ్యాపారవేత్త.. అంతకుమించి సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ చర్యలతో.. తాను పెంచి పోషించిన సహారా పతనమై.. రెండేళ్లపాటు తీహార్ జైలు ఊచలు కూడా లెక్కబెట్టి ఆ తర్వాత పెరోల్ పై బయటకొచ్చిన వ్యాపార దిగ్గజం.. కేవలం 2 వేల రూపాయలతో తన వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి.. ఏ రంగాన్నీ వదిలేదే లేదన్నట్టు అన్ని రంగాలు, ఇండస్ట్రీల్లో కాలుమోపిన బిజినెస్ టైకూన్. చివరకు తన 75 ఏళ్ల వయస్సులో 2023లో తుదిశ్వాస విడిచిన ఆయన వ్యాపార రహస్యమేంటి…? వడివడిగా ఎదిగిన ఆయన నిచ్చెనమెట్ల వ్యాపారం వైకుంఠపాళీ ఆటలో పాములు మింగినట్టు ఎలా పతనమైంది..? అన్ని సవాళ్ల మధ్య… ఆయనతో విడదీయలేని.. ఆయన లక్కీగా ఫీలైన ఆ టూ వీలర్ కథేంటి..?

బీహార్ అరారియాలో జూన్ 10న పుట్టిన సహారా ఇండియా వ్యవస్థపాకుడు సుబ్రతా రాయ్ జీవితంలో ఎన్నో విశేషాలు. జీరో నుంచి ఎంత వేగంగా పైకెదిగాడో.. అంతే వేగంగా పతనమైన సామ్రాజ్య స్థాపకుడు. అన్ని సవాళ్ల మధ్య కూడా.. రాయ్ అనే మెకానికల్ ఇంజనీర్ తన వ్యాపార రహస్యమైన లాంబ్రెట్టా వెస్పాను మాత్రం వదలకపోవడం కాస్త ఇంట్రెస్టింగ్.

రాయ్ ఎదుగుదలలో లాంబ్రెట్టాది కీలకపాత్ర. మొట్టమొదట తాను చిన్నగా డబ్బు సంపాదన కోసం బయల్దేరినప్పుడు.. తన చిట్ ఫండ్స్ లో డిపాజిట్ చేయమని ఊరూరా తిరిగేవాడు. రోజుకొక రూపాయి అయినా పొదుపు చేసి తన పథకంలో పెట్టుబడి పెట్టుమంటూ పేదలను కలిసేవాడు. ఇక దినసరి కూలీలు, ఇతర రైతులు గట్రా అలాంటి వారందరినీ కలిసి వారానికి కనీసం 10 రూపాయలు.. లేదా, నెలకో వంద రూపాయలైనా పొదుపు చేసి తన పోంజీ స్కీమ్స్ లో పెడితే.. అంతకుమించి వడ్డీనిచ్చేవాడు. అలాగే మొదట సుబ్రతోరాయ్ వ్యాపార సామ్రాజ్యానిక అడుగుుల పడ్డాయి.

అదే సమయంలో కొందరు డిపాజిటర్స్ ఆయన నుంచి సకాలంలో తమకు తిరిగి తమ డబ్బులు రాలేదనే కంప్లైంట్స్ చేసినప్పటికీ.. చాలామందికి మాత్రం తామిచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు మిత్తీతో సహా అందుతుండటంతో హ్యాపీగా ఫీలయ్యేవారు. అలా కొత్త డిపాజిట్ దారులు కూడా తన పథకంలో డిపాజిట్ చేయడానికి ఆకర్షితులయ్యే బిజినెస్ ట్యాక్టిజమ్ సుబ్రతా రాయ్ తన తెలివితేటలతో సృష్టించుకున్న ప్రత్యేకత.

అలా మెల్లిగా తన ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్ వ్యాపారం పెరిగి పెద్దదయ్యాక.. రాయ్ ఇతర వ్యాపారాల్లోకి విస్తరించడం ప్రారంభించాడు. తానెదుగుతున్న సమయంలో ఎక్కడా చెడ్డ మాట రాకుండా.. మీడియాలో బద్నామ్ అయ్యే పరిస్థితులకు ఏమాత్రం తావివ్వకుండా.. చాలా జాగ్రత్తగా డీల్ చేసేవాడు. మొత్తానికి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. అలా భారీగా భూముల కొనుగోళ్లు చేశాడు. అంటే, అప్పటికే తన వద్ద పెట్టుబడి పెట్టిన వారికి మిత్తీతో సహా డబ్బులు చెల్లించాలంటే… అంతకు పెద్ద మొత్తంలో తిరిగి ఆదాయం రావాలి. అప్పుడే అది సాధ్యపడుతుందన్న ఉద్ధేశ్యంతో.. స్టాక్ మార్కెట్ వైపు, కార్పోరేట్లకు రుణాలివ్వడం వైపు, తాను కొన్న భూములను అంతకంటే ఎక్కువ మార్కెట్ రేట్లకు విక్రయించడం వైపు రాయి దృష్టి మరలింది.

ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా వంటి వ్యాపార రంగాల చుట్టూ తిరుగుతూ.. వాటిని కార్పోరేట్ స్థాయిలో నిర్వహించడంపై సుబ్రతా రాయ్ సక్సెస్ అయినా.. ఆయనేనాడూ తయారీ రంగం వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఎందుకంటే తయారీ రంగం అనుకున్నంత సులువైంది కాదని రాయ్ కు తెలుసు. పెట్టుబడులు భారీగా పెట్టినా.. మార్కెటింగ్ జరిగి ఆదాయాలు రావాలంటే పడే శ్రమపై ఆయనలో ఓ స్పష్టత ఉండేది. అందుకే డబ్బును తిప్పగల్గే.. నగదు బదిలీ వ్యాపారాల్లోనే ఆయనెక్కువగా ఫోకస్ పెట్టారు.

అలా, కేవలం 2 వేల రూపాయలతో సహారా ఇండియా సంస్థను ప్రారంభించిన సుబ్రతా రాయ్.. ఒకటేంటి ఎయిర్ లైన్స్, ఫార్మూలావన్ టీమ్, ఐపీఎల్ జట్టు.. లండన్, న్యూయార్క్ నగరాల్లో హోటళ్లు.. ఇలా ఒక వటవృక్షమై వ్యాపించాడు. భారత్ లో రైల్వే తర్వాత అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా కూడా సహారా ఇండియా రికార్డుకెక్కింది. సహరా ఇండియా సైట్ ప్రకారమే ఆ సంస్థకు 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, వినియోగదారులుండగా.. 2 లక్షల 59 వేల కోట్ల ఆస్తులు ఆ సంస్థ సొంతం. వేల క్యాంపసులు, సుమారు 31 వేల ఎకరాల భూములుండేవి. అయితే సహారా సంస్థ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కోసం మధ్య, ఎగువ మధ్య తరగతి, బడా బాబుల నుంచి 24 వేల కోట్ల రూపాయలను సమీకరించడంపై సుబ్రతా రాయ్ సంస్థపై కేసులు మొదలయ్యాయి.

సెలబ్రిటీ కోషెంట్ ను నమ్ముకున్న రాయ్!

రాయ్ తాను చేసే ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నిర్మాణరంగ వ్యాపారాలకు.. సెలబ్రిటీ కోషెంట్ కోటింగ్ ఇచ్చాడు. వాటిని మరింత ఆకర్షణీయంగా మలవడంలో అలా కృతకృత్యుడయ్యాడు. బాలీవుడ్, హాలీవుడ్, గ్లోబల్ మ్యూజికల్ స్టార్స్, టెన్నిస్, క్రికెట్ స్టార్స్ వంటివారితో పాటు.. పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలను తన వ్యాపార రంగానికి బ్రాండ్ అంబాసిడర్స్ గా మార్చి.. తన సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాడు. తాను బిగ్ సెలబ్రిటీస్, పొల్టీషియన్స్ తో పెట్టుకున్న కనెక్షన్స్ అన్నీ జనామోదాన్ని పొంది… ఆ రోజుల్లో సుబ్రతా రాయ్ తన సక్సెస్ స్టోరీని ఓ చర్చకు పెట్టాడు.

2001 నుంచి 2013 వరకూ ఇండియన్ క్రికెట్ జట్టుకు సహారా ఇండియా స్పాన్సర్స్ గా కూడా వ్యవహరించింది. పూణే వారియర్స్ జట్టును కొనుగోలు చేసి ఐపీఎల్ లోకి ప్రవేశించింది. ఐతే, ఆ తర్వాత సహారా సంస్థ క్షీణత.. ఆ ఒప్పందాలను కూడా అదే విధంగా కాలరాశాయి.

సెబీ అటాక్… రాయ్ పతనానికి దారితీసింది!

రాయ్ ఎలా ఎలా ఎదిగాడో… ఆయన రాజకీయ, సెలబ్రిటీ సంబంధాలు అలా బలపడుతూ వచ్చాయి. ముఖ్యంగా సమాజ్ వాది పార్టీతో.. ములాయంసింగ్ యాదవ్ తో బాగా సన్నిహితంగా మెదిలిన రాయ్.. బీజేపీకి కూడా చాలాసార్లు సాయం చేశాడు. మొత్తానికి తన బిజినెస్ డీలింగ్ అండ్ వీలింగ్ లో భాగంగా.. రాయ్ పార్టీలకతీతంగా చాలామంది నేతలతో సంబంధాలు కల్గి ఉండేవాడు. ఈ క్రమంలో.. ఆయన ప్రమేయం ప్రత్యక్షంగా లేకుండానే.. మరికొందరికి ఆయన శత్రువయ్యాడు. ఆ క్రమంలోనే సెబీ వంటి సెంట్రల్ రెగ్యులేటరీ ఏజెన్సీలకు రాయ్ పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

అనుమానాస్పద రీతిలో ఓ ఫైనాన్షియల్ సంస్థ ద్వారా భారీగా డబ్బు సేకరించిన విషయంలో రాయ్ ఇరుక్కుపోయాడు. 2010లో ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి చెల్లించాలని సెబీ ఆదేశించింది. అదే సమయంలో సహారా గ్రూప్ కు చెందిన రెండు సంస్థలను బ్యాన్ చేయడంతో పాటు.. ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్.. ఐపీవోను నిలిపివేసింది.

సహారా గ్రూప్ కు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలని సెబీ ఆదేశించింది. దాంతో 127 పెద్ద ట్రక్కుల్లో మూడుకోట్ల దరఖాస్తు పత్రాలు, రెండు కోట్ల రిడంప్షన్ ఓచర్లను పంపించి సెబీనే ఆశ్చర్యపర్చాడు రాయ్. ఈ ఘటన 2013లో జరిగింది.

నిర్ణీత గడువులోపు పదివేల కోట్లు చెల్లించాల్సి ఉండగా.. అది సాధ్యపడకపోవడంతో సుబ్రతా రాయ్ జైలుపాలయ్యాడు. ఐదువేల కోట్లు నగదు రూపంలో.. మరో ఐదువేల కోట్లను బ్యాంక్ గ్యారంటీ రూపంలో ఇవ్వగల్గినట్టైతే… నాడు ఆయన విడుదల వెంటనే సాధ్యపడేది. అదే విషయాన్న కోర్ట్ తన తీర్పులో స్పష్టం చేసింది. కానీ అంత తర్వగా కోర్ట్ తీర్పును అమలు చేయలేక.. రాయ్ ఇక జైలుకెళ్లాడు. రెండేళ్ల తర్వాతగానీ పెరోల్ పై బయటకు రాలేని పరిస్థితుల్లో కటకటాలు లెక్కబెట్టాడు.

అసలు పెట్టుబడిదారులెందరు…? బినామీలెవ్వరు…?

సహారా ఇండియా సంస్థల్లో పెట్టుబడిదారులెందరు.. బినామీలెందరన్నది కనీసం సెబీ కూడా స్పష్టంగా గుర్తించలేకపోయింది. డిపాజిటర్లందరికీ తిరిగి డబ్బు చెల్లించాలని కోర్ట్ తీర్పిచ్చినప్పుడు.. తిరిగి ఇస్తానని రాయ్ కోర్టుకు హామీ ఇచ్చాడు. అయితే సహారా సంస్థల్లో చాలావరకు కూడా… బినామీ పెట్టుబడులేనని సెబీ కోర్టు ముందుంచింది. కానీ, ఆ బినామీల వెనుక ఉన్న అసలైన పెట్టుబడిదారులెవ్వరో మాత్రం సెబీ కచ్చితంగా తేల్చలేకపోయింది.

సుమారు 60 వేల కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని కోర్టు కోరినప్పుడు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బెయిల్ బాండ్‌ అంటూ.. రాయ్ కేసులో ఓ ప్రచారం కూడా జరిగింది. కానీ, వాస్తవానికి అది బెయిల్ బాండ్ కాదు. అతని ఆస్తులన్నీ స్తంభింపజేయడమే. దాంతో రాయ్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. దాన్నుంచి బయటపడటం సుబ్రతా రాయ్ మీంచి కాలేదు.

దేశంలో ఎన్నో కుంభకోణాల్లో బాహాటంగా ఉద్యోగులు, ఇన్వెస్టర్స్ రోడ్లపైకొచ్చిన ఘటనలున్నాయి. ఉదాహరణకు జెట్ ఎయిర్ వేస్ కుంభకోణంలో వేల మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. కానీ, సహారా విషయంలో అలా ఏమీ జరగలేదు. పెద్దగా ఇన్వెస్ట్ చేసిన వారు కూడా బహిరంగంగా బయటకొచ్చి నిరసలు తెలపడమో.. లేక, ఫిర్యాదులు వెల్లువెత్తడమో కూడా జరుగలేదు. కేవలం, సుబ్రతోరాయ్ ఎదుగుదల.. ఆయనకు చాలామంది రాజకీయ నాయకులతో ఉన్న సంబధాలు.. కొందరితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వచ్చిన పొరపచ్చాలు వంటివి మాత్రమే సుబ్రతా రాయ్ నిష్క్రమణ విషాదంగా ముగిసేందుకు కారణమయ్యాయి.

అయితే, రాజకీయాలతో విపరీతంగా అంటకాగుతూ అక్రమాలకు పాల్పడే అధికారులు, బిజినెస్ టైకూన్స్.. ఏదో ఒకనాడు పతనం అంచులకు చేరుతున్న దృశ్యాలను మనం ఈనాటికీ చూస్తూనే ఉన్నాం. సుబ్రతా రాయ్ లాంటి పాఠాలు గుణపాఠాలు కాకపోగా.. అవింకా రిపీట్ అవుతూనే ఉన్నాయి. అది వారి పొగరుబోతుతనమా, మొండితనమా, తమ మీద తమకుండే అతి విశ్వాసమా, లేక అమాయత్వమా, మూర్ఖత్వమా అనేది.. దగ్గర దగ్గరగా పర్యాయపదాల్లా కనిపించే ఏదైనా కావచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles