కుక్క విశ్వాసానికి మారుపేరు. ఇది ఎప్పటికప్పుడు నిరూపితమవుతూ కనిపించే విషయమే. ది కాల్ ఆఫ్ ది వైల్డ్ కూడా అదే చూపించింది. అయితే విశ్వాసానికి మారుపేరైన కుక్క… విశ్వాసలేమికి మారుపేరైన కొన్ని మానవమృగాలకు చులకన. అందుకే కుక్కను సందర్భాన్ని బట్టి జాతీయాల్లోనూ… సామెతల్లోనూ ఇరికించి మరీ మనుషులను తిడుతుంటాం. కానీ కుక్కలను ఎప్పుడైనా తిట్టాల్సివస్తే… విశ్వాసఘాతకులైన మనుషులతో పోల్చి తిట్టడమే సరేమో అనిపిస్తుంటుంది కొందరిని చూసినప్పుడు.
కుక్కలెక్క మొరుగుతున్నాడని… కుక్క నోట్లో కట్టె పెట్టినట్టని… కనకపు సింహాసనమున శునకం కూర్చుండబెట్టినట్టని.. కుక్క చావు చస్తావని… కుక్క బుద్ధని… కుక్కకు బొక్క వేసినట్టని… కుక్క లెక్క తోకూపుకుంటూ తిరుగుతున్నాడని… కుక్క తోక వంకర అనే జాతీయాలను వాడుతూ.. అప్పుడప్పుడూ విశ్వాసానికి మారుపేరైన కుక్కను పట్టుకుని ఎవరినైనా నిందించే ముందుకూడా విశ్వాసం లేని కుక్క అనీ మనమే తిడుతుంటాం. అదీ మనకు కుక్కలపై ఉన్న అ’స్పష్టత’! అయితే ఆ విశ్వాసానికే కాదు… తన జోలికొస్తే తగిన శాస్తి చేసేందుకూ వెనుకాడని ఓ కుక్క కథే.. the call of the wild.

2020లో రిలీజై హాట్ స్టార్ లో స్ట్రీమింగవుతున్న ఈ సినిమా నిజంగా ఓ అడ్వెంచరస్ దృశ్యకావ్యం. ఎందుకంటే అలస్కా అందాలకు కనువిందైన తెరరూపమిచ్చిన సినిమాటోగ్రాఫర్ జానూజ్ క్యామిన్స్కి పనితనం ఈ సినిమాలో ఓ వండర్. స్టీవెన్ స్పీల్ బర్గ్ తో ష్లిండర్స్ లిస్ట్ వంటి సినిమాలకు పనిచేసిన అద్భుతమైన సినిమాటోగ్రాఫరైన జానూజ్ క్యామిన్స్కి పనితనం ఈ సినిమాలో మనల్ని మరోసారి కట్టిపడేస్తుంది. 1903లో జాక్ లండన్ రాసిన the call of the wild నవలకు తెరరూపమే ఈ అడ్వెంచరస్ మూవీ. హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ వంటి సినిమాలను తెరకెక్కించిన క్రిస్టోఫర్ మైఖెల్ స్యాండర్స్ దర్శకత్వంలో… మానవుల్లో ఉండే మృగాలకూ.. కుక్కవంటి జంతువుల్లో ఉండే విశ్వాసానికీ మధ్య తేడాను పట్టిచూపించే సింబాలిక్ కంపేరిటివ్ స్టోరీ నెరేషన్.. ఈ సినిమా బలం.
కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో బక్ అనే కుక్క ఓ యజమాని దగ్గర పెంపుడు జంతువుగా ఉంటుంది. ఓరోజు రాత్రి కుక్కచేష్టలపై అలిగిన యజమాని.. దాన్ని బయటనే ఉంచి లోపల డోర్ వేసుకుంటాడు. స్లెడ్ కుక్కలకు అధిక డిమాండ్ ఉన్న ఆ కాలంలో.. దాన్ని ఆ రాత్రే కొందరు కిడ్నాప్ చేస్తారు. చేసి రైల్వే వ్యాగన్లలో అలస్కాకు పంపిస్తారు. అలస్కా నుంచి మంచు ప్రాంతమైన యుకాన్ కు లెటర్స్ పంపిణీ కోసం కుక్కలు లాగే బండీలే.. అక్కడ సరఫరా మార్గాలు. అలా మొదటినుంచీ శాంటాకార్లాలో తన యజమాని దగ్గరుండి ఎక్కడో తెలియని ప్రదేశానికి చేరుకున్న ఆ కుక్క హోమ్ సిక్ అయి బాధ పడుతుంటుంది. అలా లెటర్స్ సప్లైయర్స్ దగ్గరకు చేరే క్రమంలో ఓ వ్యక్తి చేతిలో దెబ్బలు తింటుంది. కానీ మెయిల్ సప్లయర్ దగ్గరికెళ్లాక ఆ బక్.. ఇతర సహచర కుక్కలతో ఎలా నడుచుకుంటుంది… అప్పటికే లీడ్ చేస్తున్న స్పిట్జ్ అనే మరో కుక్క ఆధిపత్యాన్ని చూస్తూ ఎలా సహనం వహిస్తుంది… చివరకొకానొక దశలో స్పిట్జ్ కు బుద్ధి చెప్పి తానే ఎలా లీడర్ గా మారుతుందన్నది తెరకెక్కించిన తీరు ఇంట్రెస్టింగ్.
బక్ మెయిల్ సప్లైయింగ్ యజమాని దగ్గరకు చేరే మధ్యలో థామ్టన్ అనే వ్యక్తితో కనెక్టవుతుంది. ఆయన కింద పడేసుకున్న మౌత్ ఆర్గాన్ ని తీసుకెళ్లి అతనికందించే క్రమంలో బక్ అతడికేసీ చూసే చూపుల్లో అతను తనకు కావల్సినవాడేమోనన్నఆంతర్యం కనిపిస్తుంటుంది. ఆ తర్వాత మెయిల్ సప్లైయర్ పెరాల్ట్, తన అసిస్టెంటైన ఫ్రాంకోయిన్ వెంట మిగిలిన సహచర కుక్కల గుంపుతో కలిసి బయల్దేరే బక్.. నిరాసక్తతతోనే ఆ మెయిల్స్ తీసుకెళ్లే బండి లాగే చోదకమైనట్టు కనిపిస్తుంది. ఒకానొక సమయంలో ఓ కుందేలును ఆ కుక్కల గుంపు వేటాడే సమయంలో.. అప్పటికే మెయిల్స్ సప్లైయర్స్ బండి లాగే కుక్కుల గుంపుకు నేతృత్వం వహిస్తున్న స్పిట్జ్ కూ, బక్ కూ మధ్య ఘర్షణ నెలకొంటుంది. దాదాపు బక్ పని అయిపోయిందా అనేంతగా గాయపరుస్తుంది కుక్కులగుంపుకు బాసైన స్పిట్జ్. కానీ తిరిగి మన తెలుగు సినిమాల్లో హీరోల్లాగే లేచి స్పిట్జ్ పనిచెప్తుంది బక్. అప్పుడు మిగిలిన కుక్కల గుంపులో వెల్లివిరిసే ఆనందం.. అప్పటివరకూ స్పిట్జ్ నేతృత్వంలో అన్యమనస్కంగా మెయిల్ బండీ లాగిన బక్ నే… ఆ లేఖలను మోసుకెళ్లే బండి లాగడానికి సారథిగా మారుతుంది. ఒకానొక సమయంలో ఆ మంచుగర్భంలోకి జారిపడి ప్రమాదంలో చిక్కుకుని పనైపోయిందనుకున్న ఫ్రాంకోయిన్ ని సాహసించి కాపాడేతీరు.. మళ్లీ అక్కడ యజమాని మనసు చూరగొనడం.. ఇలా సాగుతుంది బక్ ఆనే ఈ కుక్క కథ.
అదే సమయంలో మళ్లీ ఆ కుక్కల గుంపును విక్రయానికి పెట్టడం.. దాన్ని క్రూరమనస్తత్వం కల్గిన హాల్ కొనుగోలు చేయడం.. అక్కడే మళ్లీ అంతకుముందు బక్ కు తారసపడ్డ థామ్టన్ కనిపించడం.. బక్ ని థామ్టన్ కాపాడటం.. అది మనసులో పెట్టుకున్న హాల్ థామ్టన్ పై ప్రతిదాడి.. తనను కాపాడిన యజమానికి కృతజ్ఞతగా ఆయన్ని కాపాడుతూ బక్ హాల్ పై ప్రతిదాడి ఇలా సాగుతుంది the call of the wild.
అదే సమయంలో ఓ ఆడ తోడేలు వైపు ఆకర్షించబడ్డ బక్ ను గమనించే థామ్టన్.. దాన్ని ఆ అడవిలోకి పంపేయడమే ఆ బక్ కు తాను కల్పించే విముక్తని భావిస్తాడు. ఆ తర్వాత అప్పటికే ప్రేమలో పడ్డ ఆడ తోడేలుతో కలిసిన బక్ మరిన్ని పిల్లలకు జన్మనిచ్చి తన గమ్యస్థానం ఆ అడవేనన్న ఆనందంతో జీవించే సన్నివేశాలతో ముగుస్తుంది the call of the wild. ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు, ముఖ్యంగా కుక్క ప్రేమికులను ఆకట్టుకునే సినిమా ఇది.


