ఏడాదికి 30 లక్షల ప్యాకేజ్ అందించిన రైలు ప్రయాణం! సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఓ రియల్ స్టోరీ!!
కొన్ని రియల్ స్టోరీస్ హృదయాన్ని హత్తుకుంటాయి. మరికొన్ని ఏ ఇంతేనా అనిపిస్తాయి. ఒకరికి బాగా నచ్చినవి ఇంకొందరికి మామూలుగా అనిపించొచ్చు. కానీ, నిజ జీవిత అనుభవాలకు ఏదో ఓ రకమైన స్పందనలైతే కనిపిస్తాయి. అలా సోషల్ మీడియాలో సాఫ్ట్ వేర్ టెకీ షేర్ చేసిన తన రియల్ స్టోరీ ఇప్పుడో హాట్ టాపిక్ గా మారి… ఆ పోస్ట్ కింద చాలా మంది తమ వ్యక్తిగత కథలు చెబుతుండటం Xలో కనిపించింది.
సాధారణంగా ఆర్థికంగా కాస్త మంచి స్థితిలో ఉన్నవాళ్లు రైలు ప్రయాణాల కంటే ఫ్లైట్స్ లో వెళ్లి రావడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంకా దూరాభారాలెక్కువైతే విమానమే బెటర్ అనే ఆప్షన్ లో ఉంటారు. అయితే, విమాన ప్రయాణాలు సమయాన్ని బట్టి, రద్దీని బట్టి, అకేషన్స్ బట్టి ధరలు హెచ్చుతగ్గులున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ట్రైన్స్ ను ఆశ్రయిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం రైలు ప్రయాణాలే ఎక్కువ ఇష్టపడతారు. దాన్నో మజాగా స్వీకరిస్తారు. సరదాగా మధ్యమధ్యలో వచ్చే స్టేషన్స్… కాస్సేపు సేద దీరేందుకు బెర్త్.. బోర్ కొడితే ఏ పుస్తకమో చదువుతూ కింద కూర్చునే సీటింగ్ సౌకర్యం.. వీటికి తోడు ఎక్కడెక్కడివారో రైలు ప్రయాణంలో తమ జీవితానుభవాలను పంచుకుంటూ దగ్గరవుతుండటం… అలా మొత్తంగా ట్రైన్ జర్నీ జీవితంలో సరదా అనుభూతి.
అయితే, ఓ సాఫ్ట్ వేర్ టెకీకి మాత్రం రైలు జర్నీ ఇప్పుడు ఓ మధురానుభూతి. అంతేకాదు, అక్కడే ఎన్నో నేర్చుకోగలమనే భావన. అక్కడే ఇంకేదో దొరుకుతుందేమోనన్న ఆశ. తనలాంటివారికీ తానూ ఇంత సాయపడొచ్చేమోనన్న ఆలోచన. వెరసి.. చిరాగ్ దేశ్ ముఖ్ అనే టెకీ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది.
తానెందుకు విమానాల్లో ప్రయాణాన్ని అవాయిడ్ చేస్తాడు.. మరెందుకు రైళ్లల్లోనే ప్రయాణిస్తాడో ఓ ఫన్నీ స్టోరీని చిరాగ్ తన X ఖాతాలో పోస్ట్ చేశాడు.
తను రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఓ సాఫ్ట్ వేర్ టెకీ కలిశాడట. అతడితో మాటా మాటా కలిసి ఆ ప్రయాణంలో చిరాగ్ కు అతడితో ఓ స్నేహబంధం బలపడింది. మీరు సాఫ్ట్ వేర్ జాబ్ లో ఏడాదికి 30 లక్షల ప్యాకేజీ కల్గి ఉన్నారు.. ఆర్థికంగా బాగున్న మీరు అప్పుడో ఇప్పుడో ప్రయాణాలు చేసేటప్పుడు హాయిగా విమానంలో గంట, రెండు గంటల్లో వెళ్లిపోవచ్చు కదా అన్నది చిరాగ్ ప్రశ్న..?
చదువు పూర్తై ఇబ్బందులు పడుతున్న క్రమంలో తనకు రైలు ప్రయాణమే ఉద్యోగాన్నిచ్చిందన్నది చిరాగ్ కు రైల్లో పరిచయమైన సాఫ్ట్ వేర్ టెకీ సమాధానం. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మనలాగే ఓ అపరిచిత వ్యక్తితో ఏర్పడిన స్నేహం.. తన సాఫ్ట్ వేర్ మొదటి జాబ్ కు రిఫరెన్స్ గా పనిచేసిందని చెప్పాడతను. అలా తాను ఇంతింతై ఎదిగి ఇవాళ 30 లక్షల ప్యాకేజీతో బాగానే ఉన్నాను. కానీ, నాకు ఉద్యోగం రావడానికి కారణమైన రైలు ప్రయాణం ఓ అనుభూతినిస్తుంది. ఇంకేదైనా జరుగొచ్చనే ఆశను కల్పిస్తుంది. నాలాంటివారికి ఏదైనా చేసే అవకాశాన్ని కల్పించొచ్చేమోనన్న ఆలోచనా మదిలో మెదులుతుంటుంది. మొత్తంగా రైలు ప్రయాణంలో జరిగే పరిచయాలు, చర్చలు… జీవన ప్రయాణంలో కూడా ఎక్కడో ఓచోట ఉపయోగపడుతుండటంతో.. రైలుతో ఉన్న అనుబంధాన్ని కాదనుకోలేక ట్రైన్ జర్నీస్ నే తానెక్కువ ఇష్టపడుతున్నట్టు చెప్పాడట చిరాగ్ కు పరిచయమైన మిత్రుడు.
ఎప్పుడైనా అత్యవర పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఫ్లైట్ తప్ప.. మిగిలిన సమయాల్లో కచ్చితంగా ట్రైన్ తన ఫస్ట్ ఆప్షన్ అని చెప్పాడనే స్టోరీని చిరాగ్ Xలో పోస్ట్ చేయడంతో ఈ స్టోరీ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.
చిరాగ్ పోస్ట్ వృత్తాంతంతో చాలామంది రకరకాల వారి అనుభవాలను స్టోరీస్ గా చెప్పుకొచ్చారు. తన మొదటి ఇంటర్న్ షిప్ తర్వాత ఏకంగా తన కుటుంబ సభ్యుడిలా మారిన ఓ వ్యక్తి.. అంతకుముందు తనకు రైల్లోనే పరిచయమయ్యాడని.. తన పక్కన కూర్చున్నాడని ప్రఖర్ అనే వ్యక్తి షేర్ చేశాడు. రైలులో చేసే సుదీర్ఘ ప్రయాణాల్లో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయని.. అలా 2105లో తాను ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు క్లౌడ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను ఓ వ్యక్తి ద్వారా తెలుసుకున్నానని.. ఆ టెకీ సూచనలు, సలహాలతో ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో తాను పని చేస్తున్నట్టు సౌరవ్ అనే మరో టెకీ చెప్పుకొచ్చారు.
అయితే, X ద్వారా చిరాగ్ దేశ్ ముఖ్ రియల్ స్టోరీ అంటూ చెప్పిన ఈ కథపై పలువురు సందేహాలను, కౌంటర్ మెస్సేజెస్ ను పోస్ట్ చేసినప్పటికీ.. మొత్తంగా సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్ గా వార్తల్లోకెక్కింది.



