సుబ్రహ్మణ్యం వల్లూరి…✍️
వారం క్రితం ఒక మిత్రుడైన డాక్టర్ ఆయన శ్రీమతి మూడు నెలల పాటు కొడుకు కొడలితో సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణం కోసం మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ కి చేరుకుని తమ టికెట్ , పాస్‌పోర్ట్ చూపించి లగ్గేజ్తో లోపలికి అడుగు పెట్టి సూట్‌కేసులు ఎయిర్‌లైన్స్ కౌంటర్ లో అప్పచెప్దామని ట్రాలీ తోసుకుంటూ వెళుతుంటే సెక్యురిటి కుక్క ఒకటి ట్రాలీ దగ్గరకు వచ్చి సూట్‌కేసు వాసన చూడసాగింది. డాక్టర్ గారు తన వస్తువుల్లో ఎటువంటి చట్టవిరుద్ధమైన వస్తువులు లేవు అని బాగా తెలుసు కనుక ట్రాలీ అపి నిశ్చింతగా నిలబడ్డారు కుక్క తన డ్యూటీ చేసుకోవడానికి సహకరిస్తూ. కుక్క ట్రాలీ చుట్టూ తిరిగి ఎదో పసిగట్టినట్టు గట్టిగా మోరిగింది.
కొన్ని దేశాల్లోని విమానాశ్రమాల్లో మనుషుల కన్నా కుక్కలే తమకు అప్పచెప్పిన బాధ్యతలు బాగా నిర్వర్తిస్తాయి. ముఖ్యంగా మాధకద్రవ్యాలు, పేలుడు పదార్థాలను పసిగట్టడంలో. స్వదేశానికి తిరుగు ప్రయాణం అయిన డాక్టర్ దంపతులకు సుశిక్షితులైన శునకాలు కొత్తేమికాదు. అందుకే చూడడానికి భీకరంగా ఉండే శునకం దగ్గరకు వచ్చి వాసన చూస్తుంటే భయం వేయలేదు.

దూరం నుంచి చూస్తున్న కుక్క హాండ్లర్ కుక్క అరుపులు విని చేత్తో ఉన్న వాకీ టాకీ లో ఎవరికో ఎదో ఆదేశాలు ఇచ్చి ఫోన్ ని హోల్డర్‌లో పెట్టి భార్యాభర్తల కేసి అనుమానంగా చూస్తూ నడుం పక్కనున్న 9MM పిస్టల్ హాస్టర్ బటన్ తీసి పిస్టల్ బయటకు తీసి చేత్తోపట్టుకుని వీళ్లిద్దరి వైపు పరిగెత్తుకు రాసాగాడు. అప్పటికి కుక్క ఇంకా ఉద్వేగంతో అరుస్తోంది , మిగతా ప్రయాణీకులు అందరూ వీళ్ళేదో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చిన అంతర్జాతీయ నేరస్థులలా చూస్తున్నారు. కొద్దిమంది భయంతో నేలమీద పడుకునేసరికి వాళ్ళను చూసి చాలా మంది నేలమీద పడుకుని తల చుట్టూ చేతులు చుట్టుకున్నారు. చెవులు, మెదడు కప్పుకున్నారు చేతులతో భయంవల్ల. కాలిస్తే తమకు ఎక్కడ తగులుతుందేమో అనే అపోహతో.
మా మిత్రుడు వృత్తిరీత్యా వైద్యులు పైగా అంతకుముందు చాలా దేశాలు తిరిగి వచ్చిన అనుభవం ఉంది. అమెరికా, యూరోప్ , ఆసియాలోని కొన్ని ప్రముఖ దేశాలు తిరిగి వచ్చారు. జరుగుతున్న పరిణామాలు చూసి ఆయన ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఇద్దరి సామాన్లు ఆయనే సర్దాడు. తన కొడుకు మిత్రుడు ఇచ్చిన ఒక ప్యాకెట్ తప్పితే వేరే ఎవరివి తమ వద్ద లేవు. ఆ ప్యాకెట్ కూడా కొడుకు మిత్రుడు తమ ముందే విప్పి చూపించి అందులో ఎమున్నాయో చూపించి తిరిగి ప్యాక్ చేసి ఇచ్చారు చేతికి. ఇంకెవరూ తమ సూట్ కేసులు ముట్టుకోలేదు.
ఈలోపు ఆఫీసర్ వాళ్ళ దగ్గరకు వచ్చి చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడమని అదేశించి పిస్టల్ వాళ్లకు గురిపెట్టాడు తన సహచరులకై ఓ కన్నేసి. ఇంకో ఇద్దరు పోలీసులు పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చారు. మొదటి అతను సూయిట్ కేసులు విడివిడిగా ట్రాలీ లోంచి తీసి కింద పెట్టి కుక్కను మళ్లీ ఒకసారి వాసన చూడమన్నాడు.
కుక్క ఐదు సూట్ కేసులు వాసన చూసి ఒకదాన్ని కాలితో బరుకుతూ దాని యజమానికేసి చూసింది. ఆ సూట్ కేసు తెరవమని మా మిత్రుడుని ఆదేశించాడు ఆ పోలీసు ఆఫీసర్. అందులో ఏ పేలే పదార్థం ఉందొ అని మిగతా ఇద్దరు ఆఫీసర్లు, ప్రయాణీకులు అందరినీ దూరంగా ఉండాలని హెచ్చరించారు.
అప్పటికే మా మిత్రుడికి భయంతో చెమటలు కారిపోతున్నాయి. పొరపాటున ఎవరైనా డ్రగ్స్ లాంటివి పెట్టారా ? మొన్ననే చూసిన ది మ్యూల్ అనే డ్రగ్స్ మీద తీసిన సినిమా గుర్తుకొచ్చింది. భారతదేశం లోలా కాకుండా ఆస్ట్రేలియా లో అతి కఠినమైన చట్టాలు ఉన్నాయి అని గుర్తుకు వచ్చి వణుకు మొదలైంది శరీరంలో. చాలా భయపడుతూ ఆ సూట్ కేసు తెరిచారు ఆయన. పోలీసులు ఆ సూట్ కేసుని కింద బోర్లించి బిగించి పట్టుకున్న కుక్కని వదిలారు.
కుక్క ఒక్క గెంతు గెంతి ఆ కింద ఉన్న సామానులోంచి ఒక పెద్ద పేకెట్ అందుకుంది వాసన చూస్తూ. ఆ ప్యాకెట్ చూసి మా మిత్రుని మొహం పాలిపోయినట్టు అయింది. కొడుకు పెంచుకుంటున్న కుక్కకి కొన్న ఎండురొయ్యల బిస్క్యూట్స్ చూసి.. తన ఇంట్లో కుక్కకోసం కొన్నవి ఆ ప్యాకెట్ లోనివి. స్వదేశంలో అలాంటి రుచి ఉండేవి దొరకవని తీసుకెళుతున్నారు .
ఆఫీసర్ కుక్క నొట్లోని పేకెట్ చూసి కోపంతో “నీకు జీతం , తిండి బాగానే ఇస్తున్నాం కదా, అయినా ఈ కక్కుర్తి ఏమిటి? ఇలా ప్రయాణీకులను నీ ఇష్టప్రకారం నిలిపేస్తే నిన్ను సస్పెండ్ చేసేస్తాను, వచ్చే నెలాఖరుకు కదా నువ్వు రిటైర్ అయ్యేది, అంతవరకు బుద్దిగా డ్యూటీ చెయ్యి.” అని ఇంకా ఏదో అరవడం వినలేదు మా మిత్రుడు కిందనుంచి సామాను మళ్లీ సూట్‌కేసులో సర్దుకోవడంలో బిజీగా ఉండడంతో.


