ఓ పక్క సుందరాకాండ పారాయణం, మరోపక్క హెచ్సీయూలో నెమళ్లు, లేళ్లు విలవిల్లాడుతున్న దృశ్యం.. కలుక్కుమనిపించదూ!

Rama Neelakantham… ✍️ prof.

సీత గురించి దేవర్షి నారదుడిదీ అదే మాట, రాంబంటు హనుమదీ అదేమాట –

“రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా,జనకస్య కులే జాతా ” అని వాల్మీకిమహర్షితో, నారదుడంటే , అశోక వనశోభను వృక్ష వైభవాన్ని అక్కడ ప్రకృతి రామణీయకతను ఆ చిగుళ్ళు ఆకులు కలిగిన ఆ పచ్చని చెట్లు పూసిన మనోహరమైన , మనోజ్ఞమైన పూలు , అక్కడ చేరిన పక్షుల కిలకిలలు, కొలనులో విరిసిన తామరలు ఇంత ప్రశాంతంగా ఉన్న ప్రదేశం చూసి హనుమంతుడు తప్పకుండా సీతను ఇక్కడ నేను చూడగలను అని ఊహిస్తున్నాడు . ప్రశాంతమైన ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ దేవత ఉన్నట్లే.

(గమనిక: పై పిక్చర్ ఏఐ క్రియేటెడ్ అనే ప్రచారం జరుగుతున్నా.. పరిస్థితికి అద్దం పట్టేది.)

“వనేచరాణాం సతతం నూనం స్పృహయతే పురా,

రామస్య దయితా భార్యా జనకస్య సుతా సతీ” అని ఆమెను తలుస్తున్నాడు

సరిగ్గా ఇద్దరివీ, అప్పుడు నారదుడివీ ఇప్పుడు హనుమవీ అవే పదాలు మాటలు ఆమె గురించి .

ఇంకా ఒక రెండు మాటలు నారదుడి కంటే హనుమంతుడే ఆమెను ఎప్పట్నుండో ఎరుగున్నవాడి వలెనే చెప్తున్నాడు సీత గురించి – వనచారులయిన పశుపక్ష్యాదుల పట్ల స్పృహ కలిగిన సీత ఈ వనానికి తప్పకుండా వస్తుంది ఈ వేళ, వీటిని చూడడానికా అన్నట్లు అని.

హనుమంతుడికి అమిత నమ్మకం, ఆమె స్వరూపం తెలుసు కాబట్టి. అందుకే అంతగా అక్కడ ఎదురుచూడడం.

ఈ శివమయమైన నదీ జలాల దగ్గరకి సంధ్యాకాలం కోసం ఎదురు చూసే జానకి సంధ్యోపాసనకై తప్పకుండా వస్తుంది అని తలుస్తాడు. –

“సంధ్యాకాలమనాః శ్యామా ధ్రువమేష్యతి జానకీ,

నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణినీ.”

తను సంధ్యలో సూర్య భగవానుడిని అంటే సూర్య నారాయణుని అర్చిస్తే, రాముడు సంధ్యోపాసనలో తనను అర్చిస్తాడని తెలుసామెకు. తననుపాసించే రాముణ్ణి అనుగ్రహించడానికి అమ్మ వారు ఆయన్ను వెదుక్కుంటూ తనే వస్తుందని ఎంత గట్టి నమ్మకం హనుమకు. రాముడి సంధ్యోపాసన చూసి ఉన్నాడు కదా తను. ఆమెను పోలుస్తూ ఆయన వాడిన ఆ విశేషం చూడండి – “వరవర్ణినీ ” . అంటే శ్రేష్ఠమైన వర్ణం కలిగినది – ఒకటి కాదు రెండు కాదు అయిదు వర్ణాల సమ్మిశ్రమం ఆ తల్లి. “నానాయోగి మునీంద్రహృద్యవసతీ ” కదా,ఆ మాత్రం తెలీదా ఉపాసకుడికి తోటి ఉపాసకుడి గురించీ , తమని అనుగ్రహించే దైవం గురించీ.

అయితే ఈ పై శ్లోకాలలో నాకివాళ చాలా సార్లు గుర్తుకు వచ్చిన పదం “వనేచరాణాం సతతం స్పృహయతే పురా” అన్న పదం.

జీవకోటిపై అంత స్పృహ గల్ల తల్లి, జాలి దయ కలిగిన తల్లి,తనను త్రికాలాలలో తలుస్తారు అని తెలిసి తనే ముందుగా వచ్చి ఎదురు పలికే తల్లి , రాలేదు ఎందుకో ఈ వేళ

రాగాలే మూగబోయినందుకా,అనురాగాలే కొండెక్కినందుకా .

ఈ సందర్భంలో మనం మన తెలుగు కవి ఆంధ్ర వాల్మీకి అని పేరు గాంచిన వాసుదాస స్వామి (వావిలకొలను సుబ్బారావు )గారి పద్యాలు కూడా చూద్దామా – “మున్నీ యుద్యానంబున, నున్న వనేచరుల సేమ ముల్లంబున దా

నెన్నుచు నున్నది సత్యము, సన్నుత రఘురాముదేవి జానకి యిచటన్ ” అంటూ “వనచరుల క్షేమమెంచిన జానకిని” తన తెలుగు సేత లో ఏమరలేదు. అది కదా మనం పట్టుకోవలసిన పదం. కవి హృదయస్పర్శి అయినపుడు అట్లాగే దర్శనమిస్తుంది యథాతథంగా, శ్రోతవ్యమనసూయయా అని కదా వాల్మీకి ఆదేశం, ఉపదేశం. ఒక్క పొల్లు అక్షరం కూడా లేని కావ్యం .

ఒక పక్క సుందరకాండ చదువుకుంటున్నాను . పధ్నాలుగవ సర్గలో ఉన్నా.

HCU లో నెమళ్ళు, లేళ్ళు, పక్షులు విలవిల లాడుతున్న దృశ్యం, ఆర్తనాదాలు చేస్తున్న శబ్దం వినిపిస్తోంది TV లో, news లో.

మనసు మహా కలకలమంటోంది తల్లీ.

ఎంత విధ్వంసం.. ఎంత విషాదం!

శ్రీరామ జయం గొంతెత్తి చెప్తున్నాం కానీ.. చెప్పవలసినంతగా చెప్పడంలేదేమో ……………??

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles