కులీ ప్రేమనగర్ లో భాగమతీ కురుల మధ్య పాపిట.. ఆ హుస్సేన్ సాగర్!

#ట్యాంక్‌బండ్‌

– యాసీన్‌… ✍️

ప్రేమమూర్తి శ్రీమతి భాగమతీ దేవి కురులు దువ్వుకుంటూ పాపిట తీస్తే… ఓ పాయ హైదరాబాద్‌ అయితే… మరోపాయ సికిందరాబాద్‌. అలా మధ్యనున్న పాపిటదారే… ట్యాంక్‌బండ్‌.

సుల్తాన్‌ కులీ… భాగమతుల మతులు పోగొట్టే ప్రేమకథ ఎవరికి తెలియదూ?!… అందుకేనేమో… కులీ హైదరాబాద్‌ ఏర్పాటుతో మొదట తన లీల చూపాక… ఆ తర్వాతెప్పుడో మల్కిభరామ్‌… అదే ఇబ్రహీం కుతుబ్‌షా వచ్చి నిర్మించాడో సరస్సు. అదే హుస్సేన్‌సాగర్‌.

అసలే కులీగారి ప్రేమనగరం. ఆ ప్రేమ ప్రభావం సరస్సుమీదా పడకుండా పోతుందా?! అందుకే ఒక ఫొటోగ్రాఫర్‌ అంటాడూ… తీరా సరస్సు తవ్వాక… పై నుంచి ఏరియల్‌ వ్యూలో చూస్తే… ఇంచుమించూ ప్రేమికుల ప్రేమ గుర్తు ‘హార్ట్‌ షేప్‌’లో కనిపిస్తుందట సరస్సు. ఆ గుండె పక్కన దండుబాటగా రూపొందిందే ట్యాంక్‌బండ్‌.

ఇక్కడ ఎవరి గుండే చెరువు కాలేదు. ఆ చెరువే గుండెషేప్‌లో రూపొందిదిక్కడ!!

* * * * *

ఇబ్రహీం కుతుబ్‌షా రాజ్యానికి వచ్చాక 1563 నాటి ఓ మంచి రోజ్జూసి తన ఇంజనీర్‌ హజరత్‌ హుసేన్‌ షా వలీని పిలిపించాట్ట. తన నగరానికి తాగునీరందించేలా ఓ అద్భుత సరస్సును నిర్మించమని కోరాట్ట. అంతే… దాదాపు 24 చదరపు కిలోమీటర్ల విశాలమైన వైశాల్యంతో 32 అడుగుల లోతుతో రూపొందిందా సరస్సు. దాని చుట్టూ ఉన్న గట్టు పేరే ట్యాంక్‌బండ్‌. సంకల్పించిన నవాబు పేరిట కాకుండా… నిర్మించిన హుసేన్‌ గారి పేరిట ప్రఖ్యాతి పొందింది.

పాపం… సంకల్పమేమో తనది. కానీ పేరొచ్చింది ఇంజనీరుగారికి.

ఇబ్రాహీం గారు తన పేరు పెట్టుకుందామంటే… ఇంజనీరుగారికి ఆ ప్రశస్తి దక్కడంతో మళ్లీ అక్కడెక్కడో తన పేరిట నిర్మితమైన ఊరైన ఇబ్రహీంపట్నంలోని చెరువుకు తన పేరు పెట్టుకుని ముచ్చటపడ్డారు ఇబ్రహీం నవాబు గారు. అదీ ట్యాంక్‌బండ్‌ రూపొందడానికి అసలు కారణమైన సరస్సు హుసేన్‌సాగర్‌ కథ.

* * * * *

రండి బండెక్కుదాం. ఏ బండి అంటారా…? బండికాదు… బండ్‌… బండ్‌… ట్యాంక్‌బండ్‌ రోడ్డు మీదికెళ్దాం. ట్యాంక్‌బండూ… దాని వైభవం చూడాలంటే రాత్రివేళే. చిరుసంజెవేళ నుంచి మర్నాడు పొద్దున్న ఉదయసంజె వేళ వరకు చూడాలీ… దాని కళాకాంతులు.. అబ్బ మాటల్లేవ్‌!

ఏదో ఓ అట్టహాసపు వేడుక నాడు, మందహాసపు నగవుతో మహిళ తన ముఖంమీద అలదుకోవాల్సిన మెరుపు–మెరుపుల మిస్సీ, జిలుగు–జిగేళ్ల జిగ్గీల్లా తన పాపిటలో అలదుకున్నట్టు రేణువు రేణువూ మిలమిలలాడినట్టే… మెరుస్తుంటాయి ఆ గట్టు మీది వాహనాల లైట్ల కాంతులు!!

ఈ వాహనాల మిలమిల మిరిమిట్ల కాంతులెలా ఉన్నా… అసలు హైదరాబాద్‌ ఎలక్ట్రిక్‌ కిరణానికి తొలి బీజం పడిందిక్కడే!! దక్షిణ భారతదేశంలోనే తొట్టతొలి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టింది ఈ ఒడ్డునే. అలా అప్పటి ఆ మెరుపులు ట్యాంక్‌బండ్‌కే పరిమితం కాకుండా… మొత్తం నగరాన్నే దేదీప్యమానం చేశాయి.

* * * * *

ఇక హైదరాబాద్‌ అప్పటి ఆంధప్రదేశ్‌లో ఉన్నరోజుల్లో ఎన్టీఆర్‌ ట్యాంక్‌బండ్‌ ఒడ్డున తెలుగు వైతాళికులైన కొందరి విగ్రహాలు వెలిశాయి. దీనికి దీటుగా సరస్సు నడిమధ్యన బుద్ధుడి విగ్రహం. అది రాయగిరి నుంచి తెచ్చిన రాయితో రూపొంది జిబ్రాల్టర్‌ రాక్‌ మీద నెలవైన ఆ విగ్రహం… అందరినీ ఆశీర్వదిస్తున్న తీరులో… ఎందరినో దీవిస్తున్నట్టుగా కొలువైంది.

ఆ ఒడ్డున ఉన్న గట్టు రాళ్లు కూడా పేర్చినట్టు కాకుండా ఏదో అల్లకాన్ని అల్లినట్లుగా… రాళ్లను సాగదీసి అల్లడం ఇక్కడ ట్యాంక్‌బండ్‌ ఒడ్డునా… అక్కడ సుదూరంగా గోల్కొండలో కనిపిస్తుంది.

* * * * *

మొదట రూపొందిన ట్యాంక్‌బండ్‌కు హైదరాబాద్, సికిందరాబాద్‌… ఈ రెండు నగరాల్ని కలుపుతున్నట్లు ఒకే ఒక దారి అప్పట్లో ఉంది. ఒక్క నగనే ఎంతకాలమని పెట్టుకుంటాం. అప్పటి పాపిట బిళ్లకు తోడు ఇప్పుడు మెడ గొలుసూ రూపొందింది. అదీ సరస్సు చుట్టూ కంఠహారంలా! దానికి ‘నెక్లెస్‌రోడ్‌’ అంటూ నగ పేరు పెట్టారు. నగలో అక్కడక్కడ పొదిగిన వజ్రాలూ, ముత్యాల వంటి రత్నాల్లా… ఒడ్డునంతా రకరకాల ప్రదేశాలు!

* * * * *

సరస్సు మధ్యన గౌతముడున్నందున… ఆ ఒడ్డునే ఉన్న ఓ స్థలం ఆయన జన్మస్థానం పేరు పెట్టుకుని లుంబినీవనముంది. ఆ మరో పక్కన అమరవీరుల స్మృతి చిహ్నంగా ఫ్లిక్కరింగ్‌ కాగడాను నిర్మాణంలో ప్రతిక్షేపించేలా కట్టిన ఓ అపురూప కట్టడం.

ఆ మరో ఒడ్డున అత్యంత సమున్నతంగా చేతిలో పుస్తకం పట్టుకుని, చదువుకుని జ్ఞానవంతులు కండని చెబుతున్నట్లుగానూ, అలా జ్ఞానవంతులై దేశాన్ని ముందుకు నడిపించండన్నట్లుగా చూపుడువేలితో దిశానిర్దేశం చేస్తూ డాక్టర్‌ బీ. ఆర్‌. అబేంద్కర్‌.

ఆ కింద ఆ పక్కనే అప్పట్లో ట్యాంక్‌బండ్‌కు సొబగులద్దిన ఎన్టీఆర్‌ పార్క్‌. ఇంకాస్త ముందుకొస్తే అదే పక్క కాస్త లోపలికి ప్రసాద్‌ ఐమాక్స్‌… ఇక దూరం పోకుండా మళ్లీ నెక్లెస్‌ రోడ్డు కొస్తే… సభలూ, సమావేశాలూ, వేడుకప్రదేశాల కోసం ప్రదర్శనశాలాప్రాంగణంగా పేరొందిన పీపుల్స్‌ ప్లాజా. ఇంకాస్త ముందుకెళ్తే వాటర్‌ఫ్రంట్‌… మరికాస్త ముందుకెళ్తే… నీళ్లతో పిల్లలూ పెద్దలూ ఆడుకునేందుకు ఏర్పాటైన జలవిహార్‌… కాస్తంత దూరాన ప్రధానిగా దేశాన్నేలిన తెలంగాణబిడ్డ పీవీ నరసింహారావు ఘాట్‌. ఇంకాస్త దూరంలో ఎప్పటినుంచో విశాల విఖ్యాత పార్క్‌గా పేరొందిన సంజీవయ్య పార్క్‌. ఈ ఒడ్డున ఈ పార్కుతో… అటువైపొడ్డున ఇందిరా పార్క్‌తో చుట్టూరా హరితకాంతులీనుతుండే ఈ రోడ్డు…

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ గుండె చుట్టూతా ఉన్న ఈ ప్రదేశాలన్నింటినీ…

చేతులతో గాక… కాలినడక అనే నయనప్రార్థనలతో కళ్లకద్దుకోవాల్సిన చోట్లివి!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles