సరిగ్గా 18 నెలల వయస్సు… తల్లిదండ్రులతో బెంగళూర్ లో ఓ కర్నాటక సంగీత కచేరీకి వెళ్లింది ఆ అమ్మాయి. సాధారణంగా ఎవరో సంగీతం మీద కాసింత అవగాహన, ఆ టింజ్ ఉన్న పరిమిత సంఖ్య మినహా… శాస్త్రీయ సంగీత కచేరీలను ఎంజాయ్ చేయడమంటే చాలామందికి అంత ఓపికుండదు. ఆ 18 నెలల పాప కూడా అందుకు అతీతమేం కాదు. అందుకే, ఓవైపు కచేరీ జరుగుతుంటే… మరోవైపు అక్కడున్న పిల్లలతో ఆడుకుంటోంది. తల్లిదండ్రులు ఓ కంట ఆమెను పరిశీలిస్తూనే… మరోవైపు, ఆ కచేరీలో మునిగి తేలుతున్నారు. ఆ కచేరీ ముగిసింది. పాపను తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు వెళ్తుంటే… ఆ 18 నెలల పాప కంఠంలోంచి ఓ ఆలాపన వినిపిస్తోంది. అది హంసధ్వని రాగం. ఇంకేం, తండ్రిని ఆశ్చర్యపర్చింది.

ఇంటికొచ్చేవరకూ కూడా తండ్రిని ఆలోచింపజేస్తున్న తన పాప లుల్లబీతో… ఇంటికొచ్చాక తనకు తెలిసిన 50కి పైగా రాగాలను తండ్రి పాడాడు. అవేరాగాలని అడిగినప్పుడల్లా… ఆ 18 నెలల పాప 40 రాగాల పేర్లను ఠకీమని చెబుతూ వస్తోంది. అప్పటివరకూ మాటలే రాని తన పాప.. హంసధ్వనిలో లుల్లబీ ఆలాపించడంపై ఏం జరిగుంటుందన్న మీమాంస, ఒకింత ఆలోచనతో ఉన్న తండ్రి.. అప్పుడిక కచ్చితంగా తన అమ్మాయి గాడ్ గిఫ్టెడ్ అనే భావనకొచ్చాడు.
ఇంకోసారి, అదే అమ్మాయికి నాల్గేళ్ల వయస్సులో మరో పరీక్షెదురైంది. ఆమె అప్పటికే కొందరు శ్రోతల ముందు సంగీత కచేరీలివ్వడం ప్రారంభించింది. తన తండ్రే కొందరు సంగీతజ్ఞుల ముందు ఆ అమ్మాయితో ఓ గంటపాటు కచేరీ ఇప్పించాడు. ఆ తర్వాత వచ్చిన ఆ సంగీత కళాకారులంతా ఒక వందరాగాలను పాడి వినిపించారు. ఆ రాగాలన్నింటినీ ఆ నాల్గేళ్ల చిన్నారి మళ్లీ ఠకీమంటూ పేర్లు చెబుతూ వస్తోంది. ఆ మొత్తం సన్నివేశం నాటి VHS వీడియో క్యాసెట్ లో కూడా రికార్డ్ చేశారు.
కట్ చేస్తే, ఆమే.. ఇంగ్లీష్ సింగర్, లిరిక్ రైటర్, వాద్యకారుడు. జాకబ్ కొల్లియర్… ప్రముఖ సితార్ ప్లేయర్ అనుష్కా శంకర్ తో కలిసి.. ఏ రాక్ సమ్ వేర్ అంటూ ఈ ఏడాదికిగాను ది బెస్ట్ గ్లోబల్ మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ కింద గ్రామీ అవార్డును కొల్లగొట్టిన బెంగళూర్ వాసి వారిజశ్రీ వేణుగోపాల్.

బాల్యం నుంచే రాగాలను పసిగట్టింది.. ఏకంగా గ్రామీ అవార్డ్ సాధించేవరకూ ప్రయాణించింది!
కర్నాటక శాస్త్రీయ సంగీతంలో ప్రవేశించి నిష్ణాతురాలైతున్నప్పటికీ… ఎందరో సంగీతకారులతో పోలిస్తే కొంత భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని కోరుకుంది వారిజశ్రీ. ఆమె తపనకు తగ్గ గుర్తింపు గ్రామీతో రావడంతో.. తనకు దక్కిన గ్రామీ అవార్డ్ కేవలం ఏ రాక్ సమ్ వేర్ పాటకు మాత్రమే పరిమితమైంది కాదనీ.. తన జీవితకాల సంగీత ప్రయాణానికే ఓ గుర్తింపంటోంది. తనకు లభించిన ఈ గుర్తింపు… సృజనత్మాక సంగీత ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఓ ప్రోత్సాహకమన్నది ఈ గాయని అభిప్రాయం.
ఆ ఇంటి గోడల్లోనూ సరిగమలు వినిపిస్తాయి!
వారిజశ్రీ తండ్రి వేణుగోపాల్… మాస్టర్ ఫ్లూటిస్ట్. తల్లి టీవీ రమ వోకల్ ఆర్టిస్ట్. వారే తన గురువులు. తండ్రి ఇంట్లో వేణువునాదాన్ని తన శిష్యులకు నేర్పిన రోజులింకా గుర్తు. నాన్న వాయించిన వేణురాగానికి మా ఇంటి గోడలు పరవశించిన జ్ఞాపకాలు ఇంకా పదిలంగానే ఉన్నాయి. దాంతోపాటే, చిన్ననాట్నుంచే తల్లీదండ్రుల వెంట సంగీత కచేరీలకు వెళ్లడంతో సంగీతంపై మొదలైన అనురక్తి… ఏదైనా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు తన అమ్మానాన్నలు పెళ్లి పనుల్లో బిజీ ఐపోతే… ఆ పెళ్లిళ్లల్లోని నాదస్వరం, డప్పు, డోలక్ వాటిముందు వెళ్లి కూర్చునే స్థాయికి చేరిపోయిందట తన సంగీతపిచ్చి.
తల్లిదండ్రులిద్దరూ సంగీతజ్ఞులు కావడంతో పాటు.. వారి స్నేహబృందమంతా అలాంటి వాతావరణమే ఉండటం కూడా సహజం. దాంతో నేర్చుకోవడానికి తనకు ఇంకెక్కువ అవకాశం లభించింది. చిన్ననాట అర్థం కాని విషయాలు.. సంగీతంలో కొద్దికొద్దిగా నైపుణ్యం సంపాదించినప్పుడు అవెంత విలువైనయో ఆ తర్వాత అర్థమైందంటోంది వారిజశ్రీ.

ప్రతిభావంతురాలైనా.. శిక్షణ తప్పనిసరని భావించారు!
అందుకే వారిజశ్రీకి గురుముఖ శిక్షణనిప్పించాలని తల్లిదండ్రులు భావించారు. నాల్గేళ్ల ప్రాయంలోనే కర్నాటక సంగీత విధూషీణిమణి హెచ్. గీత వద్ద గాత్రంలో శిక్షణ ప్రారంభించింది. మొట్టమొదటి తన పూర్తి స్థాయి కర్నాటక శాస్త్రీయ సంగీత కచేరీని కేవలం ఏడేళ్ల ప్రాయంలోనే బెంగళూరులో ఇచ్చి మన్ననలు పొందింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వసంత శ్రీనివాసన్, విద్వాన్, డి.ఎస్. శ్రీవత్సల వంటివారి వద్ద సంగీతంలో శిక్షణ పొందింది. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ 80 ఏళ్ల వయస్సులో కూడా తనకు శిక్షణనిచ్చిన గాన కళానిధి విద్వాన్ సేలం పి సుందరేశన్ ను గురువుగా పొందడం అదృష్టమనే వారిజశ్రీ… ఆయన నడిచే ఎన్ సైక్లోపీడియా అని చెబుతుంది. ఆయన దగ్గర 15 సంవత్సరాల సుదీర్ఘకాలం సంగీతంలో మెళకువలు నేర్చుకుంది.

తండ్రి వేణువాద్యకారుడు అవ్వడంతో తన శిష్యులకు నేర్పిస్తున్నప్పుడు రహస్యంగా చూసి తాను ప్రయత్నించేది వారిజశ్రీ. తన తొమ్మిది పదేళ్ల మధ్య ప్రాయంలో ఓసారి ఫ్లూట్ పై ధ్వనిని పట్టుకోవడం నేర్చుకుంది. వాస్తవంగా వెదురుతో చేసిన పిల్లనగ్రోవిపై ఒక స్వరాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అది తనకు అబ్బంది. ఓరోజు తన తండ్రిని తన ఫ్లూట్ వాద్యమెలా ఉందో చెప్పమని వినిపించింది. తండ్రి ఒక్కసారి నివ్వెరపోయాడు. ఏదో వాయిస్తుందిలే అనుకున్న వేణుగోపాల్.. కూతురు వేణునాదం చూసి ముచ్చటపడ్డాడు. తనకూ నేర్పించాడు. ఆ తర్వాత ఫ్లూటిస్ట్ గా కూడా తన తండ్రికి సహవాద్యంగా వెళ్తూ వస్తూ ఉండేది వారిజ. కొన్నాళ్లకు తానే సోలో కచేరీలు చేయడంతో పాటు, రికార్డింగ్స్ కు కూడా తానే ఉండాలనేంత ప్రముఖ వేణునాద విద్వాంసురాలైపోయింది. జస్ట్ 14 ఏళ్లకు వేణునాద కచేరీల ప్రస్థానాన్ని మొదలెట్టింది.
వారిజశ్రీ ప్రతిభకు మరింత సానబెట్టిన తల్లిదండ్రులు!
పిల్లలు పెరిగేటప్పుడు వారిపై చుట్టుపక్కల వాతావరణంతో పాటు.. ఇంట్లో కుటుంబ ప్రభావం కూడా మెండుగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై సీరియస్ గా దృష్టి సారిస్తే వారెంత స్థాయికి వెళ్లగలరో చెప్పే కథ వారిజశ్రీది. ఎందుకంటే, కేవలం ఓ కర్నాటక సంప్రదాయ సంగీత కుటుంబమైన వేణుగోపాల్, రమ దంపతులు.. వారిజశ్రీని ఆ పరిమితులకు మాత్రమే పరిమితం చేయలేదు. ఆమెకు హిందుస్థానీ, అభాంగ్, భజన్స్ వంటి ఇండియన్ మ్యూజికల్ వెరైటీస్ తో పాటు… జాన్ మెక్ లాఫ్లిన్, ఎల్. శంకర్ వంటివారి ఫ్యూజన్ మ్యూజిక్ ను వినిపించేవారు. కూతురు కోసమే అలాంటి కేసెట్స్ కొనుక్కొచ్చేవారు.

ఇంటర్నెట్ ఎరాతో ఇంటర్నేషనల్ లెవల్ కు!
ఇంటర్నెట్ తీసుకొచ్చిన విప్లవంతో.. ఆమె మరింత సెర్చింగ్ మొదలెట్టి.. సంగీతంలో ఇంప్రువైజేషన్ కు ఆస్కారమెక్కువ ఉన్న జాజ్ మ్యూజిక్ వైపు ఆసక్తి కనబర్చింది. చిక్ కొరియా, మైల్స్ డేవిస్, జాన్ కోల్ట్రేన్, బాబీ మెక్ ఫెర్రీన్ వంటి కళాకారుల జాజ్ మ్యూజిక్ కు ఆకర్షితురాలైంది వారిజశ్రీ.
కర్నాటక శాస్త్రీయ సంగీత రంగానికుండే పరిమితులను.. జాజ్ మ్యూజికల్ స్పేస్ లో ఉండే స్వేచ్ఛతో అధిగమించి… జాజ్ మ్యూజీషియన్స్, సింగర్స్ తో పోటీ పడి కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని వినిపించాలన్న తపన ఆమెను అటు దిశగా అడుగులు వేయించింది. అత్యంత సంక్లిష్ఠమైన రూపకాల్లో కర్నాటక సంగీతమొకటి కావడంతోనే.. తనకు మిగిలిన జాజ్ మ్యూజిక్, దాని అనుబంధ సంగీతాల్లో అభ్యాసం చాలా సులభమైపోయిందని తన కర్నాటక సంగీత గొప్పదనాన్నీ అదే స్థాయిలో పొగుడుతుంటుంది. అంతేకాదు, వెస్ట్రన్ జాజ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తున్నప్పుడు.. జాజ్ పోకడలతో కర్నాటక శాస్త్రీయ సంగీత స్వరాలతో అలరించే శైలి.. రసహృదయులను వీనులవిందు చేసే ఓ కొత్త ప్రయోగమంటోంది వారిజశ్రీ.
జాకబ్ కొలియర్‌తో కలిసి!
సుమారు గత పన్నెండేళ్ల నుంచి వారిజశ్రీ పాశ్చాత్య దేశాలకు చెందిన విక్టర్ వూటెన్, బాబీ మెక్‌ఫెర్రిన్‌లతో సహా.. పలు దిగ్గజ జాజ్ కళాకారులతో కలిసి పనిచేస్తోంది. వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్స్ నెట్ వర్క్ లోకి ప్రవేశించిన వారిజకు… జాకబ్ కొలియర్ తో పరిచయమేర్పడింది. అప్పటికే జాకబ్ కొలియర్ శైలిని అభిమానించే వారిజశ్రీ, జాకబ్ ఆ తర్వాత ఇన్ స్టా వేదికగా రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారు. ఒకరోజు తాను కొత్తగా రూపొందిస్తున్న Djesse అనే వాల్యూం ఫోర్ ఆల్బమ్ లో జాజ్ స్టైల్ లో కర్నాటక సంగీత రాగఛాయల్లోని వారిజ గాత్రముంటే బాగుందని భావిస్తున్నట్టు వారిజకు చెప్పాడు కొలియర్. ఆ తర్వాత ఫోన్ కాల్ ద్వారా కొలియర్ కు ఏంకావాలో తెలుసుకున్న వారిజకు.. అప్పటికే అనుష్కా శంకర్ తో ( ప్రపంచ ప్రఖ్యాత సితార్ వాద్యకారుడు దివంగత పండిత్ రవిశంకర్ కూతురు) కలిసి చేసిన మ్యూజికల్ ట్రాక్ ను పంపించాడు. అందులో అనుష్కా శంకర్ సితార్ వాద్యాన్ని విని మెస్మరైజ్ అయిన వారిజ… ఆ అవకాశాన్ని తనకో గొప్ప అదృష్టంగా భావించింది. కానీ, లిరిక్స్ లేవు. స్వరాలతోనే ఇంప్రువైజేషన్ చేసి పాడే మ్యూజికల్ థీమ్. మొత్తంగా ఓ టఫ్ టైమ్. అయినా, తన సృజనను జోడించి బెంగళూర్ లోనే జాకబ్ కోరుకున్నట్టుగా తన వెర్షన్ రికార్డ్ చేసి పంపింది.
ఈ ఏడాది వారిజశ్రీ సంగీత ప్రయాణంలో ఓ సాఫల్యమైన సంవత్సరం. గ్రామీ నామినేషన్ తో పాటు.. అక్టోబర్ లో కొలంబియాలోని బొగోటాలో జరిగిన జాజ్ అల్ పార్క్ ఫెస్ట్ లో కచేరీ ఇచ్చిన మొట్టమొదటి భారతీయ కళాకారిణిగా కూడా ఇప్పుడు వారిజ పేరు నిల్చింది. ఈ ప్రదర్శన తర్వాత ఆమెకు ఇంటర్నేషనల్ లెవల్ లో మరింత గుర్తింపు లభించింది. మహాభారతాన్ని వస్తువుగా తీసుకుని ఇటలీకి చెందిన రికార్డో నోవా ప్రదర్శించే ఓపెరాకు స్వరాన్నందించి తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది ప్రారంభంలో గ్రామీ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ మైకేల్ లీగ్ తో కలిసి ‘VARI’ అనే ఆల్బమ్ విడుదల చేసింది వారిజశ్రీ. ఈ ఆల్బమ్ కు విక్టర్ వూటెన్, హామిల్టన్ డి హోలాండా, అనాట్ కోహెన్, బేలా ఫ్లెక్ వంటి ప్రాశ్చాత్య సంగీత దిగ్గజాలంతా కలిసి పనిచేశారు.
కొత్త శబ్దాల అన్వేషణను ఇష్టపడే వారిజశ్రీ… గ్రామీ విజేత మైఖేల్ లీగ్ కలిసి చేసిన ఆల్బమ్ కు తామెంత కష్టపడింది.. తనను మైఖేల్ లీగ్ ఎంతగా ప్రోత్సహించింది.. టాప్ మోస్ట్ 40 మంది కళాకారులెలా పనిచేసింది విివరించింది. తన బెంగళూరు స్నేహితుడు ప్రమత్ కిరణ్ కూడా తన VARI ఆల్బమ్ కోసం ఎలా సహకరించింది.. ఆ జర్నీలో స్పెయిన్ లో నెలరోజులు, బెంగళూర్ లో గడిపిన రెండువారాల సమయం గురించి.. మొత్తంగా ఒక గొప్ప ఆల్బమ్ బయటకు రావడానికి తమకు ఆరేళ్ల సమయం ఎలా పట్టిందనే పలు అంశాలపై తన అభిప్రాయాలను మీడియాకు వెల్లడించింది.
ఎక్కడో హంసధ్వని రాగాఛాయలతో మొదలైన ఓ ఏడాదిన్నర బాలిక ప్రస్థానం… ఇప్పుడు భిన్న సంస్కృతుల మధ్య వారధైంది.. వైవిధ్యమైన సంగీత ప్రయాణంతో.. జాతుల మధ్య, సంగీతం మధ్య అంతరాలను చెరిపేసే స్థాయికి చేరింది. అందుకే, వారిజశ్రీ మ్యూజికల్ జర్నీ క్వైట్ ఇంట్రెస్టింగ్!



