మాకింకా ఆలయ ప్రవేశం అందని ద్రాక్షే: పంచాయత్ నటుడి ఆవేదన ఇది!

కులం, మతం వద్దు మానవత్వమే ముద్దని స్పీచులు దంచుతుంటారు.. కానీ, ఆ కుల, మతాలే ఎజెండాగా సాహిత్యం, సంగీతం నుంచి సినిమాల వరకూ ఆ బురదంటించుకోనివాళ్లే అరుదు. వాటిని తప్పుబడుతోనో, ఆదరిస్తూనో, సమాజంలో ఉండొద్దనో ఏదో రకంగా కుల, మతాల చుట్టూ ఇంకా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సూపర్ హిట్ అయిన పంచాయత్ సీరిస్ నటుడు వినోద్ సూర్యవంశీ తాజా కామెంట్స్ తో ఇంకా ఆధిపత్య ధోరణులెలా ఉన్నాయో మరోసారి తెరపైకొచ్చింది.

ఇంతకీ ఏమన్నాడు వినోద్ సూర్యవంశీ…?

వినోద్ సూర్యవంశీ స్వస్థలం కర్నాటక. తమ రాష్ట్రంలో ఇంకా కులవివక్ష దారుణంగా కొనసాగుతోందంటున్నాడు ఈ యాక్టర్. తమ కుటుంబాల్ని ఇప్పటికీ ఆలయాల్లోకి రానివ్వరని ఆరోపిస్తున్నాడు. హోటల్ కు వెళ్లినా తమ కంచం తామే కడుక్కునే పరిస్థితుందని చెబుతున్నాడు. ఆధిపత్య కులాల ఇళ్లల్లోకి తమల్ని అడుగు కూడా పెట్టనివ్వరని ఫిర్యాదు చేస్తున్నాడు. ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన స్థాయి నుంచి నటుడిగా ఎదిగాడు సూర్యవంశీ. ఈ క్రమంలో తానెదుర్కొన్న సామాజిక అడ్డంకులెలా ఉండేవో పూసగుచ్చాడతను.

ఒకే ఊళ్లో ఆధిపత్య కులాలొకవైపు… వెలి వేయబడ్డట్టు దళితులకొకవైపుండే వేర్వేరు కాలనీలే మా ఊరి కథ చెబుతాయంటున్నాడు.

ఓసారి నేను 12 ఏళ్ల వయస్సులో నాన్నతో ఓ ఊరికెళ్లాను. అక్కడ ఓ హోటల్ లో భోజనం చేశాం. అందరిలాగే తిన్నందుకు డబ్బులూ చెల్లించాం. కానీ, దాంతోపాటే.. తిన్న తర్వాత ప్లేట్లూ మేమే కడిగాం. మా ఊళ్లో ఇప్పటికీ మాకు అనుమతి లభించిన ఓ ఆలయముంది. ఇంకా రెండు గ్లాసుల పద్దతి కనిపించే (అ) నాగరిక సమాజం మాది అంటాడు.

పండుగ ప్రపంచానికి సంతోషం పంచితే.. మాకు దుఖం తెచ్చేది!

మా అమ్మానాన్న ఏడవటం నేను చాలాసార్లు చూశాను. పండుగలు వస్తే నాకు బాధగా ఉండేది. దీపావళి అందరిళ్లల్లో వెలుగులు నింపితే.. నాకు మాత్రం చీకటిగా గోచరించేది. ఎందుకంటే, ఇతరుల్లా మేం పండుగలు చేసుకోలేకపోయేవాళ్లం. ఎవరైనా దయతలచి ఏదైనా ఇస్తేనే మాకు పండుగ.

అమ్మ ఇంటింటికీ తిరిగి పని చేస్తూండేది. నాన్న తాపీమేస్త్రీ. అలా అని ఇద్దరికీ ప్రతీరోజూ పని దొరికేది కాదు. పని లేని రోజుల్లో నాన్న మద్యం తాగి ఇంటికొచ్చేవాడు. అమ్మను తిట్టడం, కొట్టడం చేసేవాడు. అవన్నీ చూస్తూ నా బాల్యం గడిచింది. నాన్నపై నాకు ద్వేషమేం లేదుగానీ.. ఆయన ప్రవర్తన మాత్రం నచ్చేదిగాదు.

చిన్న చిన్న పనులు చేసి నటుడిగా ఎదిగిన వినోద్!

నటనలోకి ప్రవేశించకముందు వినోద్ సూర్యవంశీ ఎన్నో పనులు చేశాడు. మొట్టమొదట లిఫ్ట్ మ్యాన్ గా నెలకు 16 వందల జీతానికి పని చేసేవాడు. ఆ తర్వాత ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్ గా కుదిరాడు. కొంతకాలం సెక్యూరిటీ గార్డ్ గానూ పనిచేశాడు. 12 గంటలు నిలబడి డ్యూటీ చేసేవాడు. వర్షం వస్తే చెప్పులు తడిసిపోయేవి. తడిసి ముద్దైపోయిన చెప్పులతో కాళ్లకు గాయాలయ్యేవి. కొన్నిసార్లు సెక్యూరిటీ గార్డ్ గా జనం చీదరింపులు, తిట్లు ఇలా అన్నీ భరించాను. అవే నా అనుభవాలంటాడు.

ఏ పనీ చిన్నది కాదంటూ ఆత్మగౌరవంతో ముడిపెడుతూ చాలామంది చాలా చెబుతుంటారు. కానీ, ఏ మనిషినైనా అతడు చేసే పనిని బట్టే అంచనా వేస్తారు. పని పెద్దదైతే దక్కే గౌరవమూ పెద్దదేనంటున్నాడు వినోద్ సూర్యవంశీ.

వినోద్ కెరీర్!

వినోద్ సూర్యవంశీ జనావర్, తమ్మా, సత్యమేవ జయతే, జాలీ ఎల్ఎల్బీ, పంచాయత్ వంటి ప్రాజెక్టుల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని అట్టడుగు స్థాయి నుంచి ఎదిగాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles