రెండోసారీ గెలుస్తాడా..? తండ్రిని మించిన తనయుడవుతాడా..??

Vamsy Krishna.. ✍🏻

తండ్రిని మించిన తనయుడిగా స్టాలిన్ నిలుస్తారా..?

మైకు సెట్లు మూగవోయాయి. భారీ జనసందోహాలతో కూడిన మీటింగులు ఆగిపోయి మైదానాలు ఊపిరి పీల్చుకున్నాయి. రోడ్ షో లు ముగిసి రహదారులు సాంత్వన పడ్డాయి. తమిళనాట ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఎన్నికలు, మే నాలుగవతేదీన ఫలితాలు. విజయం ఎవరిని వరిస్తుంది? అన్నదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. విజయ్ ఎవరిని విజయ తీరాలకు చేర్చుతాడు? లేక తానే విజయతీరాలకు చేరతాడా? అన్నదొక మిలియన్ డాలర్లను మించిన ప్రశ్న.

234 స్థానాలున్న తమిళ అసెంబ్లీలో అధికారానికి రావాలి అంటే 118 సీట్లు కావాలి. 2021 ఎన్నికల్లో 45.3 శాతం ఓట్లతో DMK కూటమి 159 స్థానాలు సంపాదించింది.కానీ 1984 లో ఎమ్ .జి రామచంద్రన్, 2016 లో జయలలిత తప్ప వరుసగా రెండుసార్లు ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టిన చరిత్ర మరెవరికీ లేదు. కరుణానిధి కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు. ఈ సెంటిమెంట్ ను స్టాలిన్ అధిగమించి తండ్రిని మించిన తనయుడు అవుతాడా లేదా అనేది ఆసక్తి గొలిపే అంశం

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కనిపిస్తున్న చిత్రం ఇంతకుముందెన్నడూ లేనిది . రేపు, ఏప్రిల్ 23న జరగబోయే ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాయనడంలో సందేహం లేదు. . 2021లో ఘనవిజయం సాధించిన డీఎంకే కూటమిపై ఉన్న సహజమైన వ్యతిరేకత కనిపిస్తున్నా దానిని అధిగమించడానికి స్టాలిన్ చాలా ప్రయత్నాలే చేసారు. చివరలో డి లిమిటేషన్ బిల్లు, దక్షిణాదికి అన్యాయం తమిళనాడు వర్సెస్ ఢిల్లీ లాంటి అంశాలను చర్చనీయం చేయడం ద్వారా తమిళ్ ఫీలింగ్ తీసుకుని రాగలిగారు.ప్రతిపక్షాల మధ్య ఉన్న చీలిక, ముఖ్యంగా విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ఓట్ల బ్యాంకును ఎలా ప్రభావితం చేస్తుందనేది DMK ఫలితాలను నిర్దేశించే కీలకాంశం.

ఉత్తర తమిళనాడులో వన్నియార్ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉన్నందున పీఎంకే (PMK) అన్నాడీఎంకే (AIADMK) కూటమికి గట్టి పట్టు ఉంది. అయితే, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా చెన్నై పరిసర జిల్లాలో డీఎంకే (DMK) తన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలతో ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఈ ప్రాంతంలో కొత్తగా రంగంలోకి దిగిన విజయ్ టీవీకే (TVK) యువత ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తోంది, ఇది ప్రధానంగా ఎవరికి నష్టం చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

దక్షిణ తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ కుల సమీకరణాల చుట్టూనే తిరుగుతాయి. ముకుళతోర్, దేవేంద్ర, వెల్లాలర్ ఓటర్లు ఇక్కడ నిర్ణయాత్మక శక్తి. గతంలో అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో, ప్రస్తుతం టీవీకే, సీమాన్ నేతృత్వంలోని ఎన్‌టీకే (NTK) విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు భారీగా చీలవచ్చని అంచనా. డీఎంకే తన సంస్థాగత బలంతో ఇక్కడ పట్టు నిలుపుకోవాలని చూస్తుండగా, అన్నాడీఎంకే తన పాత వైభవం కోసం శ్రమిస్తోంది. ముఖ్యంగా మదురై, తిరునల్వేలి వంటి జిల్లాల్లో బహుముఖ పోటీ వల్ల విజయవకాశాలు తక్కువ మెజారిటీతో తేలే అవకాశం ఉంది.

కొంగునాడు (పశ్చిమ ప్రాంతం) ఎప్పుడూ అన్నాడీఎంకేకు కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. కోయంబత్తూర్, ఈరోడ్, సేలం వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక వేత్తలు, గౌండర్ సామాజిక వర్గం మద్దతు ఆ పార్టీకి అదనపు బలం. బీజేపీ కూడా కొంతకాలంగా తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. మోదీ ప్రచారం బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి కొంత ఊపునిచ్చినట్లు కనిపిస్తోంది. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రచారం ఆసక్తి రేపింది.

తెలుగు ఓటర్లు చెన్నైతో పాటు హోసూరు, కోయంబత్తూరు, మదురై వంటి ప్రాంతాల్లో గెలుపోటములను నిర్ణయించగల శక్తిని కలిగి ఉన్నారు. గతంలో డీఎంకే, ఏఐఏడీఎంకే రెండు పార్టీలకూ వీరు మద్దతునిచ్చిన దాఖలాలు ఉన్నాయి.

అయితే, ఈసారి రెండు ప్రధాన కూటములు తెలుగు వాళ్ళకి గణనీయంగా సీట్లు ఇచ్చాయి . అందులోనూ చంద్ర బాబుగారి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు 11 మందికి DMK కూటమి 7 గురికి AIDMK కూటమి సీట్లు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ ప్రభావం కొంతవరకు ఆయా ప్రాంతాల్లోని తెలుగు ఓటర్లను ఆలోచింపజేసేలా చేసింది. చంద్రబాబు నాయుడు ప్రచారం ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లోని తెలుగు వారికి ఒక ఉద్వేగపూరితమైన అనుబంధాన్ని గుర్తు చేసినా, తమిళ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం, అక్కడి అభివృద్ధి నమూనా పట్ల ఆసక్తి పెద్దగా ఏమీ లేదు. అందులోనూ బహిరంగ సభల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొన్ని సత్యదూరం కావడాన్ని తమిళులు బాగానే గ్రహించారు. తెలుగువారు సాధారణంగా స్థిరత్వానికి మొగ్గు చూపుతారు కాబట్టి, డీఎంకే ప్రభుత్వంపై ఉన్న సానుకూలత లేదా వ్యతిరేకతను బట్టి తమ ఓటును వేసే అవకాశం ఉంది.

ప్రధాని మోదీ పర్యటనలు, బీజేపీ కేడర్ ఉత్సాహం పట్టణ ఓటర్లలో కొంత మార్పు తెచ్చినా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అది ఓట్ల రూపంలోకి మారడం కష్టమే

విజయ్ ఎంట్రీ, ఆయన పోటీ చేస్తున్న విధానం ఈ ఎన్నికల్లో అతిపెద్ద చర్చనీయాంశం. టీవీకే సొంతంగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి, అది ప్రధానంగా అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందా లేక డీఎంకేకు నష్టం చేస్తుందా అనేది వేచి చూడాలి. ఎన్‌టీకే ఎప్పటిలాగే తనదైన శైలిలో ఓట్లను చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది.

సీట్ల అంచనాల విషయానికి వస్తే, ఏ సర్వే కూడా ఒకే పక్షానికి స్పష్టమైన క్లీన్ స్వీప్ అని చెప్పడం లేదు. డీఎంకే కూటమి 140 నుండి 155 స్థానాల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతుండగా, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 70 నుండి 85 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే సుమారు 10 నుండి 15 శాతం ఓట్లు సాధించి, 10 నుండి 20 లోపు సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈసారి ఓట్ల శాతం భారీగా చీలిపోవడం వల్ల గెలుపు గుర్రాలు ఎవరు? Dark Horse ఎవరు అనేది మే 4వ తేదీ వరకు మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోనుంది.

విజయ్ తన ఓటు బ్యాంకును 15 నుండి 20 శాతం వరకు నమోదు చేయగలిగితే, ఖచ్చితంగా హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 118 సీట్లు దాటడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీకైనా ముళ్ళబాటలాగే కనిపిస్తోంది. విజయం ఎవరిని వరిస్తుంది అనే కంటే, ఏ కూటమి లేదా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతును కూడగట్టుకోగలదు అనేదే రేపటి తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles