సుబ్రహ్మణ్యం వల్లూరి.. ✍️
ఈ రోజుల్లో దంతధావనం కోసం, నోటిబ్రష్ల కోసం సూపర్ మార్కెట్టుకు వెళితే వివిధరకాల బ్రష్ లు దర్శనమిస్తాయి. ఒక్కోటీ చూస్తుంటే వాటి వాణిజ్య ప్రకటనలు గుర్తుకొస్తాయి. ఒకో బ్రష్కు ఒకో ప్రత్యేకత, ఒక బ్రష్ చాలా మృదువుగా ఉంటుంది అంటారు, ఇంకొ బ్రష్ కేమో బ్రష్ మెడ ఎలా కావాలంటే అలా వంగుతుంది అంటారు ప్రకటనలలో , ఈ మధ్యన తిరిగి ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వైర్ లెస్ ఛార్జింగ్ , బ్లూ టూత్ కు అనుసంధానం చేసుకునే వెసులుబాటుతో పునఃప్రవేశ పెట్టారు. యువత ఎప్పుడూ విపణిలోకి ప్రవేశించిన కొత్త టెక్నాలజీ కోసం వెంపర్లాడుతారు, సహజంగానే ఈ కొత్త బ్రష్ బోల్డు డబ్బులు తగలేసి కొంటారు.
ఒకప్పుడు దేశస్థులందరికి
దంతధావనం
చేసుకునే బ్రష్ ప్రకృతిలో సహజసిద్ధంగా ఫ్రీగా దొరికేది వాడేవారు. లేత, ముదురు, కానీ వేపకొమ్మ నుంచి పుల్ల విరిచి, యుగాలుగా వాడారు రోజూ ఉదయాన్నే మన వాళ్ళు.

మన సంస్కృతిలో వేపచెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది , వేప చెట్టును పవిత్రంగా భావించేవారు. కారణం దేవతలు వేపచెట్టుకు అమృతంను చిలకరించి సృష్టించారు అని పురాణాల్లో ఉంది, మానవులకు బహుమతిగా ప్రసాదించారు అన్నది అనాదిగా మనవాళ్ళు వేపచెట్టును పవిత్రంగా చూడడానికి కారణమే కాకుండా, వేప చెట్టులోని ప్రతి భాగం మనకు ఉపయోగ పడుతుంది. అందులోని ఒక చిన్న భాగం ఈ వేప పుల్ల.
తాత్విక ప్రాముఖ్యత ఒక్కటే కాకుండా, వేపపుల్లలు వాడడానికి శాస్త్రీయ కోణంతో మన పూర్వీకులు వాడడం ప్రారంభించారు.
వేపపుల్ల చివర నోట్లో పెట్టుకొని చివరి భాగాన్ని నవులుతూ దంతధావనం
ప్రారంభిస్తారు. ఈ నవలడం వల్ల నోట్లోకి లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంధులు ఉత్తేజితులై ,లాలాజలం ఎంజైములు విడుదల అవుతాయి. ఈ ఎంజైములు వేపపుల్లల నుంచి వచ్చే రసానికి తోడై నోటిలోని దంతాలకు, పళ్లకు, చిగుళ్లకు రక్షణ కల్పిస్తాయి.
వేపపుల్ల నవలడం వల్ల పళ్ళు సమానమైన ఆకృతి ఏర్పరుచుకుంటాయి కూడా చిన్న వయసులో తరుచూ వాడకంతో. దీనితో దవడలు గట్టిపడడం, పళ్ళ ఆకృతి అందంగా సమానంగా ఏర్పడడం , దంతాలు పటిష్టంగా ఏర్పడడం జరుగుతుంది.
కొద్దిసేపు పుల్లను నమిలిన తరువాత పుల్ల చివర్లో మెత్తటి బ్రష్ లా ఏర్పడుతుంది , అప్పుడు పళ్ళను మృదువుగా తోమడానికి వీలౌతుంది.
పళ్లపొడి , పేస్ట్ వాడాలిసిన అవసరం లేదు , వేపపుల్ల నుంచి విడుదల అయ్యే రసాలలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. అవి నోటిలోని క్రిములను అంతం చెయ్యడం, పళ్ళమీద ఏర్పడే పలకలు నిర్ములించడంలో వేపపుల్ల చాలా ఉపయోగపడుతుంది.
వేపపుల్లలో వుండే ఖనిజాలు పళ్ళమీద వుండే ఎనమేల్ ను పటిష్టపరుస్తుంది. ఇందులో వుండే రోగక్రిమినాశక (జెర్మిసైడల్) గుణాలవల్ల నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. నోటినుంచి చెడు రావట్లేదు అంటే సువాసన వస్తుందని కాదు. ఊపిరి ఫ్రెష్గా ఉంటుంది.
ఎన్నో వేల సంవత్సరాలు మన భారతీయులు వేపపుల్ల వాడి తమకు దంత సమస్యలు తలెత్తకుండా చుసుకున్నారు వేపపుల్ల దొరకాకపోవడం అన్న సమస్యే ఉండేది కాదు. చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. ఒకేసారి వారానికి సరిపడే పుల్లలు ఇంట్లో ఉంచుకునేవారు. పుల్ల ఎండిపోతే అందులోని రసాలు ఎండిపోయి ఉపయోగించే లక్ష్యం దెబ్బతింటుంది, నమలడానికి కష్టం. నగరాల్లో చెట్టు అందుబాటులో లేకపోతే పదో పన్నెండో వేపపుల్లలు కట్టగా అమ్మేవారు.
ఒక నలబై ఏళ్ళ క్రితం వరకు ఏ ఊరెళ్లినా బస్ , రైలు దిగిన వెంటనే వేపపుల్లలు అమ్మేవారు దర్శనమిచ్చేవారు. అంతర్జాతీయ సంస్థల వాణిజ్య ప్రకటనలకు ఆకర్షితులై, వేపపుల్ల వల్ల ఓనగూరే ప్రయోజనాలను విస్మరించి , పళ్లపొడిని, వేపపుల్లని త్యజించారు. 1990 ప్రాంతాల్లో పల్లెటూర్లలో కూడా వీటిని వదిలేసి బ్రష్ ఉపయోగించడం ప్రారంభించారు.
ఆశ్చర్యకరంగా, భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు , ఇప్పుడు విదేశాల్లో వేపపుల్ల వాడకం పెరిగింది. ఆర్గానిక్ టూత్ బ్రష్ పేరుతో , అమెరికాలో విస్తృతంగా ప్రకటనలు గుప్పించి మళ్ళీ మన వేపపుల్లని ప్రాముఖ్యతలోకి తెస్తున్నారు. వేపపుల్ల ధర ఎక్కువైనా ఎగబడి కొంటున్నారు. కోన్నిరోజులు పోతే అంతర్జాతీయ సంస్థల వాణిజ్య ప్రకటనలు మన ఇళ్లల్లో ప్రత్యక్షమౌతాయి. మనింటి పక్కన ఉన్న వేపచెట్టు నుంచి తుంచుకుని వాడే అవకాశం ఉన్నా, ఆన్లైన్లో ఆర్డర్ పెడతారు సేల్ లో తక్కువకు ఇస్తున్నారని మనవాళ్ళు. చెట్టు మీద ఉన్నదానికన్నా ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి కొన్న పుల్లే బాగుంది అనుకునే గొప్పవాళ్ళు .
మేము వేపపుల్ల వాడుతున్నాం మీరు వాడట్లేదా అని మనల్ని దెప్పిపొడిచే రోజు దగ్గరలోనే ఉంది. శుభవార్తే కదా!!.



