ఆమె విజయానికి.. ఆకాశమే హద్దు!

బీజాపూర్ సిద్ధేశ్వర ఉత్సవాల కోసం.. కర్నాటకలోని విజయపుర జిల్లా అధికార యంత్రాంగం.. జిల్లా కేంద్రం విజయపుర నుంచి బీజాపూర్ వరకు హెలికాప్టర్ రైడ్స్ ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులతో సహా, ఆ హెలికాప్టర్ ఎక్కింది సమైరా హుల్లూర్. హెలికాప్టర్ నడిపే పైలట్ ఆటిట్యూడ్, స్టైల్ ఆమెను ఆకట్టుకున్నాయి. ఇక పిల్లప్రశ్నల వర్షం కురిపించింది. అందుకు ఆ పైలట్ కూడా అంతే సావధానంగా తన పని తాను చేస్తూనే మరింత ముచ్చటగా సమాధానాలు చెబుతున్నాడు. ఆ సీన్ మనసులో నాటుకున్న తాను.. జీవితంలో ఐతే గియితే పైలటే కావాలని నిశ్చయించుకుంది. కట్ చేస్తే ఇప్పుడు 18 ఏళ్లకే కమర్షియల్ ఏవియేషన్ లైసెన్స్ పొందిన దేశంలోని మొట్టమొదటి పైలట్.. సమైరా హుల్లూర్!

25 ఏళ్లకే కమర్షియల్ లైసెన్స్ పొందిన కుమార్ అనే పైలట్ తనకు రోల్ మాడల్ అని చెప్పే సమైరా.. ఆరు కఠినమైన పరీక్షలు పాసైంది. ఒక ఏడాదిన్నర కాలంలో 200 గంటలు రేయింబగళ్లు విమానం నడిపి ఏవియేషన్ ట్రైనర్స్ నే ఆశ్చర్యపరిచింది.

18 ఏళ్ల వయస్సులోనే ఏవియేషన్ కమర్షియల్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలు హుల్లూర్. విజయపురకు చెందిన సమైరా హుల్లూర్ తండ్రి అమీన్ హుల్లూర్ ఓ ఇంటీరియర్ డిజైనర్. ఢిల్లీలోని వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీలో తొలుత శిక్షణ తీసుకున్న సమైరా.. ఆ తర్వాత మహారాష్ట్ర బారామతిలోని కార్వర్ ఏవియేషన్ అకాడమీలో ట్రైన్ అప్ అయింది.

వినోద్ యాదవ్, తాపేష్ కుమార్ ను తన మెంటార్స్ గా చెప్పే సమైరా.. ఢిల్లీ ట్రైనింగ్ అనంతరం.. కమర్షియల్ లైసెన్స్ సంపాదించడం కోసం బారామతిలో 200 గంటల పాటు గాలిలో చక్కర్లు కొట్టిన తన అనుభవం మరపురానిదని మురిసిపోతోంది. తన తల్లిదండ్రులిచ్చిన స్వేచ్ఛ, ప్రోత్సాహం తనను ఇవాళ ఆకాశంలో నిలబెట్టిందని కన్నవారి పట్ల కృతజ్ఞత కనబరుస్తోంది.

తన ఎస్సెస్సెల్సీని 15 ఏళ్ల ప్రాయంలో, 17 ఏళ్లకు ఇంటర్ పూర్తి చేసిన సమైరా విద్యాభ్యాసం విజయపుర సైనిక్ స్కూల్, శాంతినికేతన్, శ్రీనికేతన్, కేంద్రీయ విద్యాలయలో జరిగింది. చదువుల్లో సరస్వతి అనిపించుకున్న సమైరా..18 ఏళ్లు నిండేకంటే ముందే.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్వహించే ఆరు పరీక్షలకుగాను.. ఐదింటిలో ఉత్తీర్ణురాలైంది. ఒక్క ఎగ్జామ్ మాత్రం ఆమె వయసు సరిపోక నిర్వహించలేకపోగా.. జస్ట్ అలా 18 టర్న్ అయ్యాయో, లేదో.. రేడియో ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ ఎగ్జామ్ కు కూడా అర్హత సాధించడంతో పాటు.. ఉత్తీర్ణురాలైంది. ఆ పరీక్ష పాసవ్వడమంటే మాటలు కాదు.. కానీ, సమైరా సంకల్పం.. పైలట్ కావాలన్న దీక్ష ఆమెను ఆకాశాన నిలబెట్టింది.

వివిధ రకాల విమానాలు, డబుల్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో 8 నెలల పాటు కఠోర శిక్షణ తీసుకున్న సమైరాను.. 18 ఏళ్లకే దేశంలోనే కమర్షియల్ పైలెట్ లైసెన్స్ అందుకున్న మొదటి వ్యక్తిగా తన అకాడమీ ప్రకటించడం.. ఇంటీరియర్ డిజైనర్ తండ్రి అమీన్ తో పాటు, ఉపాధ్యాయురాలైన ఆమె తల్లిని ఆశ్చర్యానికీ, ఒకింత గర్వానికీ గురిచేసేది. వెనుకబడిన ప్రాంతంగా.. స్టేట్ యావరేజ్ తో పోలిస్తే.. బాలికా విద్య వెనుకబాటుకు కేరాఫ్ గా ఉన్న ఉత్తర కర్నాటక నుంచి ఇప్పుడు.. సమైరా సాధించిన ఆకాశ విజయం మరెందరో బాలికలకు, యువతులకు ఆదర్శం.

సమైరా హుల్లూర్ సాధించిన విజయం.. మరెందరో యువత సంప్రదాయ జీవితానికి భిన్నంగా ఆమె బాటలో పయనించడానికి, ప్రయత్నించడానికి ఓ ఉత్ప్రేరకమవుతుంది. ఆమె సాధించిన గోల్ అసాధారణమైంది.. అందుకే ఆమెను అభినందిస్తూ.. మరెందరో బాలికలు హుల్లూర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నానంటున్నారు.. కర్నాటక అక్కమహాదేవి ఉమెన్స్ యూనివర్సిటీ జర్నలిజం శాఖ అధిపతి, ప్రొఫెసర్ ఓంకార్ కక్కడ్. మొత్తంగా 18 ఏళ్లకే ఏవియేషన్ కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించి.. తన కల సాకారం చేసుకున్న హుల్లూర్ ను ఇప్పుడు ఓంకార్ కక్కడ్ లాగే.. యావత్ దేశమంతా పొగుడుతోంది. ఇది కదా.. విజయమంటే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles