మతాల గోడలు, సరిహద్దు రేఖల్ని ప్రశ్నించే మానవత్వం.. కాఫిర్!

Kaafir..మతాల గోడల్ని, సరిహద్దు విభజన రేఖల్ని బద్ధలు కొట్టే మానవత్వం!

పాలకులు, దేశాధినేతలు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు.. వాటినుంచి జనం దృష్టిని మరల్చేందుకు వాడుకునే ఆయుధాలు మతం, మతమౌఢ్యం, దేశభక్తి వంటి అంశాలే. అలాంటివాటికి చట్టాలు కూడా అండగా నిలిస్తే… అమాయకులు అన్యాయంగా బలైపోతే… కాపాడాల్సిన చట్టాలే ఆధారాలతో కాకుండా అనుమానాలతో శిక్షిస్తే బాధితులేైమైపోవాలి..? ఇవే చర్చిస్తుంది కాఫిర్.

దాయాది ప్రత్యర్థి దేశాల మధ్య సరిహద్దులంటే.. కేవలం భూభాగాన్ని మాత్రమే విడదీయవు. అనుమానాలు, ద్వేషాలు, రాజకీయ ఉద్రిక్తతలు కూడా మనుషుల మధ్య గోడలుగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషిని ముందుగా భారతీయుడు, పాకిస్థానీ, ముస్లిం, మిలిటెంట్ అనే ముద్రలతో కాకుండా.. మనిషిగా చూడగలమా? ఈ ప్రశ్ననే ముందుకు తెచ్చిన కథ కాఫిర్.

తారాగణం – సాంకేతిక బృందం!

మొదట సినిమాగా నిర్మించాలని భావించి… ఆ తర్వాత వెబ్ సీరిస్ గా తెరకెక్కించి… మళ్లీ దాన్నే సినిమాగా తెరపైకి తెచ్చిన సినిమా కాఫిర్. దియా మీర్జా, మోహిత్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ అండ్ సినిమాలకు సోనమ్ నాయర్ దర్శకత్వం వహించారు. భవాని అయ్యర్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. 2019లో ఎనిమిది ఎపిసోడ్ల వెబ్‌సిరీస్‌గా జీ5లో విడుదలైన కాఫిర్.. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించారు. ఆ తర్వాత 2025లో సినిమాగా కూడా తెరపైకొచ్చింది.

ఎవరి జీవితం ఆధారంగా ఈ కాఫిర్ తెరకెక్కింది..?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు షెహ్నాజ్ పర్వీన్ కథ ఆధారంగా ఈ సీరిస్ అండ్ సినిమా తెరకెక్కాయి. ఆమె అనుకోకుండా నియంత్రణ రేఖను దాటిన పాపానికి భారత్ లో ఎనిమిదేళ్లపాటు బందీ అయ్యారు. ఆమెను మిలిటెంట్ గా భావించి జైల్లో వేసిన ఆ వార్తా కథనం నాడు ఓ సంచలనం. అలాంటి నిజజీవిత కథనే ఆధారంగా తీసుకుని ఈ కాఫిర్ ను వెండితెరపైకి తెచ్చారు.

మరి కథలో ప్రధాన సారాంశమేంటి..?

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన మహిళ పాత్రలో లీనమైన కథానాయిక కైనాజ్ అక్తర్ గా దియా మిర్జా ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఆమె భారత వైపు సరిహద్దు దాటుతుంది. పూంచ్ సెక్టార్ లో ఓ నదీ తీరాన పడి ఉంటుంది. పిల్లలు లేరని భర్త మరో పెళ్లి చేసుకోవడాన్ని భరించలేక.. ఆత్మహత్యాయత్నం చేస్తుంది. నదిలో దూకుతుంది. కానీ, ఆమె చావకుండా సైనికులకు చిక్కడంతోనే అసలు కథ మొదలవుతుంది.

అప్పటికే అక్కడ ఇద్దరు మిలిటెంట్లను భారత సైనికులు మట్టుబెట్టిన సమయంలోనే ఆమె కూడా పట్టుబడటంతో.. తిరిగి వెళ్లే అవకాశం రాదు. ఆమెను ఉగ్రవాదిగా అనుమానించి జైలులో ఉంచుతారు. అక్కడే ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డే ఆమెకు జీవితంపై ఆశను మిగులుస్తుంది. ఆ బిడ్డ పేరు కూడా సెహర్. సెహర్ అంటే ఓ వెలుగు, వేకువజాము అని అర్థం. అలాంటి ఓ ఉదయం కోసం ఆ తల్లీబిడ్డలు ఎదురుచూడటం.. సినిమాకు ప్రతీకగా తీర్చిదిద్దింది దర్శకురాలు సోనమ్ నాయర్.

కాలం గడుస్తున్నా ప్రశ్నార్థకంగా కైనాజ్ విషాదకథ?

ఏళ్లు గడిచిపోతాయి. కైనాజ్ తన స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఎదురుచూస్తూనే ఉంటుంది. కానీ ఆమె కథ మాత్రం బయట ప్రపంచానికి తెలియదు. ఇక్కడే కథలోకి ఓ జర్నలిస్టుగా పనిచేస్తున్న ఓ న్యాయవాది వేదాంత్ రాథోడ్ ఎంటర్ అవుతాడు. చిన్నారి సెహర్ కథను తెలుసుకునే క్రమంలో.. అతడికి, ఆమె తల్లి కైనాజ్ గురించి కూడా తెలుస్తుంది. మొదట ఒక మానవీయ కథగా మొదలైన అతని అన్వేషణ.. చివరకు న్యాయం కోసం పోరాటంగా ఎలా మారుతుందన్నదే సినిమా. మతాలను, విభజన రేఖలను ప్రశ్నించే ఆసక్తకర కథ ఇది.

అవతలి దేశం మనిషి అంటే శత్రువేనా?

కాఫిర్లో ప్రధానంగా కనిపించే ప్రశ్నే ఇది..?

భారత్–పాకిస్థాన్ మధ్య రాజకీయ, భౌగోళిక, సామాజిక వైరాల్ని వ్యక్తిగత జీవితాల్లోకి తీసుకువచ్చినప్పుడు ఎంతటి విషాదం జరుగుతుందో ఈ కథ చెబుతుంది. జైలులో కూడా కైనాజ్ పాకిస్థానీ అనే విషయం తెలిసినప్పుడు.. ఆమెను మిగతా ఖైదీలు దూరంగా ఉంచడంతో.. ఈ సినిమాలో దర్శకురాలు సోనమ్ నాయర్ దాయాది దేశాల మధ్య నెలకొన్న భావనల్ని ప్రతిబింబిస్తారు.

అంటే.. సరిహద్దు దాటిన వెంటనే ఒక మనిషి గుర్తింపు మారిపోతుందా? మానవత్వమే ప్రశ్నార్థకమైతుందా..? ఈ ప్రశ్నలకు కాఫిర్ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండానే.. కథ ద్వారానే సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.

దేశభక్తి అనే నాణానికి మరో వైపు!

కశ్మీర్ నేపథ్యంగా వచ్చిన ఎన్నో కథల్లో దేశభక్తి, ఉగ్రవాదం, సైన్యం, సరిహద్దులు ప్రధాన అంశాలుగా చూశాం. కానీ కాఫిర్.. వాటి మధ్య భావోద్వేగపూరితమైన సాధారణ మనుషుల జీవితాల్ని తెరపైకి తెచ్చిన కథ.

అందుకే ఈ కథలో ఎవరు భారతీయులు, ఎవరు పాకిస్థానీలనే ప్రశ్న కంటే.. ఎవరు బాధితులు, ఎవరు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు అనేదే ఈ కథ చర్చ. మోహిత్ రైనా పోషించిన వేదాంత్ పాత్ర కూడా అందుకే కీలకం. తన గతం, తన వ్యక్తిగత నష్టాలు, తన వృత్తి అనుభవాల మధ్య ఒక అన్యురాలి కోసం పోరాడే వ్యక్తిగా మోహిత్ పాత్ర రూపుదిద్దుకుంది.

దియా మీర్జాకు బలమైన పాత్ర!

కైనాజ్ పాత్రలో దియా మీర్జా తన నటనతో కథకు భావోద్వేగ బలాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా జైలులో తన కుమార్తెతో గడిపే సన్నివేశాలు మానవీయ కోణాల్ని బలంగా స్పృశిస్తాయి. మోహిత్ రైనా వేదాంత్ పాత్ర స్థిరమైన నటనను కళ్లకు కడుతుంది. కథకు ప్రధాన బలం భవాని అయ్యర్ రచన. మానవీయ దృక్కోణం.

దేశాల మధ్య సరిహద్దులు ఉంటే. మనుషుల మధ్య కూడా తప్పదా అని అడుగుతుంది కాఫిర్. ఒకరిని ముందుగా అవతలి దేశస్థులుగా అనుమానించాలా, అనుమానాలే నిజమనుకుని బాధితుల్ని చేయాలా.. నేరం చేయని అమాయకులకూ దేశం మారినంత మాత్రాన ఉగ్రవాదులనే ట్యాగ్ వేసి శిక్షించాలా.. అమాయకులైన బాధితులు అలా శిక్షకు గురైతే బాధ్యులెవరు.. బాధ్యత కల్గిన సమాజాలకు అలా జరక్కుండా చూసే బాధ్యత లేదా.. నాగరిక సమాజంలో ఇంకా ఇలాంటి పోకడలా.. ఇలాంటి ప్రశ్నలెన్నో సమాజం ముందు ఉంచిన సినిమా కాఫిర్!

గమనిక: ఈ సీరిస్ అండ్ సినిమా రెండూ జీ5లో స్ట్రీమింగ్ లో ఉన్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles