అట్లాంటా అర్జెంటీనాకు మరుపురాని విజయాన్నిచ్చింది. మెర్సిడెస్ బెంజ్ స్టేడియం అందుకు వేదికైంది. 2026 ఫిఫా ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ హోరాహోరీ పోరులో 24 ఏళ్ల ఇంగ్లండ్ కలకు మరోసారి బ్రేక్ వేసి, విజయం సాధించింది అర్జెంటీనా. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా… హ్యారీకేన్ నాయకకత్వంలోని ఇంగ్లాండ్ పై 2-1 తేడాతో సాధించిన విజయంతో… ఈ సెమీ ఫైనల్ కోల్పోవడంతో ఇంగ్లాండ్ సుదీర్ఘమైన కల చెదిరిపోయింది.
55వ నిమిషంలో ఆంథోనీ గోర్డన్ గోల్ చేయడంతో ఇంగ్లాండ్ దే పైచేయన్నట్టుగా సాగింది ఆట. అయితే, చివరి క్షణాల్లోనైనా మాయ చేయగల్గే అద్భుత ప్రదర్శననే ఇప్పటివరకూ అర్జెంటీనాను ముందుకు నడిపిస్తోంది. ఆ ఆత్మవిశ్వాసమే వారికి అద్భుతమైన ఆయుధమవుతోంది. ఎంజో ఫెర్నాండెజో గోల్ తో ఇరు జట్ల గోల్స్ సమం కాగా… లౌటారో మార్టినెజ్ మరో గోల్ తో విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో అర్జెంటీనా వరుసగా రెండోసారీ అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లోకి దూసుకుపోయింది.

ఈ విజయం 2026 ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాకు ఏడోది. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ లో హాట్ ఫేవరేట్ గా చర్చ జరుగుతున్నట్టుగానే… ఏడు వరుస విజయాలతో దూకుడుగా కనిపిస్తోంది అర్జెంటీనా. అంతేకాదు, ఒక ప్రపంచకప్ ఎడిషన్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఇంతకాలం బ్రెజిల్ పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు అర్జెంటీనా ఏడో విజయంతో సమం చేసింది. ఈ రికార్డ్ 2002లో బ్రెజిల్ ఆడిన ఏడు మ్యాచుల్లో వరుసగా గెల్చి తన పేరిటే ఉంచుకుంది. 24 ఏళ్ల తర్వాత అర్జెంటీనా రూపంలో అది సమమైపోయింది. 2026 ఫిఫా ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓటమెరుగని జట్టుగా కూడా అర్జెంటీనా నిల్చింది.
ఇక ఆదివారం న్యూయార్క్ వేదికగా న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫైనల్స్ పైనే ఇప్పుడందరి దృష్టి. కేప్ వెర్డేతో ఒకే ఒక్క మ్యాచ్ డ్రా మినహా.. మిగిలిన ఆరు మ్యాచుల్లోనూ విజయాలతో అర్జెంటీనాకు దీటుగా బరిలో ఉన్న స్పెయిన్ తో తలపడటమంటే ఈ మొత్తం ఆడటమొకెత్తు… ఫైనల్స్ మరో ఎత్తు.
అయితే, స్పెయిన్ పై ఫైనల్స్ కూడా అర్జెంటీనా గెలిస్తే… ఒక ప్రపంచకప్ ఎడిషన్ లో 8 మ్యాచులు వరుసగా గెల్చిన ఏకైక జట్టుగా ఇప్పటివరకూ బ్రెజిల్ పేరిట ఉన్న రికార్డును సమం చేసిన అర్జెంటీనా దాన్ని అధిగమించి చరిత్ర సృష్టించే అవకాశముంది. లేదంటే స్పెయిన్ కూడా అర్జెంటీనా, బ్రెజిల్ తో సరిసమానంగా ఏడు మ్యాచులు విజయం సాధించిన జట్టుగా నిలిచే అవకాశాన్నందుకుంటుంది.
ఈ ప్రపంచకప్ లో మస్సీ ముద్ర!
2026 ఫిఫా ప్రపంచకప్ లో అంచనాలకు తగ్గట్టే రాణించి మెస్సీ ఆడిన ఏడు మ్యాచుల్లోనూ తనదైన సంతకం చేశాడు. 39 ఏళ్ల మెస్సీ గ్రూప్ జేలో అల్జీరియాపై జరిగిన తొలి మ్యాచులో హ్యాట్రిక్ తో ఫిఫా వరల్డ్ కప్ లో తానెందుకు ప్రత్యేకమో చెబుతూ ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఆ తర్వాత ఆస్ట్రియాపైనా రెండు గోల్స్ చేశాడు. జోర్డాన్ తో చివరి గ్రూప్ మ్యాచులోనూ ప్రత్యామ్నాయ ఆటగాడిగానే బరిలోకి దిగిన మెస్సీ.. గోల్ చేసి అర్జెంటీనా గెలుపుకు, 3-1 గోల్స్ ఆధిక్యానికీ కారణమయ్యాడు.
ఇక రౌండ్ ఆఫ్ 32లో కేప్ వెర్డేపై 3-2 గోల్స్ విజయంలో మెస్సీదీ ఓ గోల్ ఉంది. రౌండ్ ఆఫ్ 16లో ఈజిప్ట్ పై గోల్ చేయడంతో పాటు.. క్రిస్టియానో రొమెరో చేసిన ఓ గోల్ కు అసిస్టెంట్ గా వ్యవహరించి గోల్ సాధనలో భాగస్వామ్యమయ్యాడు. కాన్సాస్ లో స్విట్జర్లాండ్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో అలెక్సిక్ మాక్ అలిస్టర్ తొలి గోల్ కూ మెస్సీ అసిస్టెంట్ గా వ్యవహరించాడు. సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ తోనూ సాధించిన గోల్స్ లోనూ.. ఎంజో ఫెర్నాండెజ్, లౌటారో మార్టినెజ్ చేసిన రెండు గోల్స్ లోనూ మెస్సీ పాత్ర ఉంది.
మొత్తంగా ఎనిమిది గోల్స్ సాధించి.. నాల్గుసార్లు గోల్స్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అసిస్టెంట్ గా 12 గోల్స్ కాంట్రిబ్యూషన్స్ నమోదు చేసి మెస్సీ ప్రస్తుతం 2026 ఫిఫా గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.



