భాస్వరం రగిలించాలన్నా.. శృంగారం ఒలికించాలన్నా.. ఆ స్వరం తర్వాతే ఎవరైనా!

Vamsy Krishna.. ✍🏻

జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ.

“జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా” అని వ్యాఖ్యానించాడట ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.

అదొక అద్భుతమైన కాంప్లిమెంట్. కానీ తేనే ఆమె స్వరం లో లేదు. ఆమె హృదయం లో వుంది. ఆమె హృదయం ఆమె స్వరం ద్వారా వ్యక్తం అవుతుంది.

నిజానికి ఆమె మంచి గాయని కాదు. మంచి నటీమణి. కాకపోతే ఆమె స్వరం తో నటిస్తూ, నటనలో జీవిస్తుంది. ఆమె ఎంతగా స్వరంతో నటించకపోతే ఈ సాహిత్యమూ లేకుండా లయబద్దంగా నవ్వుతూ పాటను రక్తి కట్టించడం సాధ్యమవుతుందా? నాదస్వరం తో పోటాపోటీగా స్వర కల్పన చేయగలుగుతుందా? ఆమె స్వరం తో నటించకపోతే “కదిలించు నీ కలికి హృదయం” విన్నప్పుడు మన హృదయాలు ఎందుకు కదిలిపోతాయి? సిరిమల్లె పువ్వల్లె నవ్వు .. చిన్నారి పాపల్లె నవ్వు అని బాలూ అంటే ఆ నవ్వుతోనే విన్న ప్రతి శ్రోత పెదవుల మీదా నవ్వుల పువ్వులు ఎలా పూయించగలుగుతుంది?


మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో..

రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్
పర్యుత్సుకీభవతి యత్సుఖితోపి జన్తుః
తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం
భావస్థిరాణి జననాన్తర సౌహృదాని

అంటారు.

అందమైన దృశ్యాలను, వస్తువులను చూసినప్పుడు, మధురమైన గీతాలను (సంగీతాన్ని) విన్నప్పుడు ఏ కారణం లేకుండానే సుఖంగా ఉన్న ప్రాణి మనసు ఒకానొక అలజడికి లోనవుతుంది. దేన్నో చేరుకోవాలనే తపనని అనుభవిస్తుంది. ఆ వ్యక్తి తాను ఇంతకు పూర్వం తెలుసుకొనని ఒకానొక అనుభూతికి లోనవుతాడు.బహుశా పూర్వజన్మలో అతడికి ఇతరులతో ఏర్పడిన స్నేహసంబంధమే దీనికి కారణం కావచ్చు. బహుశా అలాంటి జననాన్తర సౌహృదం ఏదో అదృష్ట వశాత్తు ఈ తెలుగుప్రజలకు ఉండి ఉంటుంది ఆ జానకమ్మ తో . అందుకే ఆమె స్వరార్ణవం లో ఆరు దశాబ్దాలుగా తలమునకలు అయివున్నారు.

జానకి గాత్రంలో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఆమె వాయిస్ రేంజ్. చిన్న పిల్లల గొంతు నుండి, నవ యవ్వనవతి వరకు, వృద్ధురాలి గొంతు వరకు ఆమె ఎంతో సహజంగా మార్చగలరు.

సప్తపది లో గోవుల్లు తెల్లన,గోపయ్య నల్లన అని ముద్దుముద్దగా చిన్నిపాపాలా పడినా,స్వాతిముత్యం లో చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య అని చిన్ని పిల్లాడిలా పాడినా, అభిలాష లో నవ్వింది మల్లెచెండు అంటే నవయౌవనవతిలా జలపాత ధ్వని తో నవ్వినా,శ్రీవారి శోభనం లో అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింకా అని నాయనమ్మ లా పాడినా ఆమెకే చెల్లింది.

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు ఎదలోన కదిలాయి ఎన్నెనో కథలు అంటూ పదహారేళ్ళ అమ్మాయి తరుణ కోమల మానసం లోని అల్లరినీ,మొహాన్నీ,వెన్నెల్లో గోదారి అందం అంటూ ఆర్ద్రంగా కరిగి నీరయ్యే ఆవేదనీ, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ అని పలికిన ప్రేమతత్వం జానకి స్వరం లో కాక మరొక స్వరం లో ఊహించను కూడా ఊహించలేము

చాలామంది పాడితే పాట వినిపిస్తుంది. కానీ జానకి పాడితే పాట ఒక అనుభవమై మనలోకి చేరి చెదరని అనుభూతిలా మిగులుతుంది. శ్వాసను నియంత్రించి స్వరాన్ని తక్కువ స్థాయి నుంచి హెచ్చు స్థాయికి తీసుకెళ్లే డైనమిక్స్ ఆమెకు తెలిసినంత గా మరొకరికి తెలియదు అంటే అతిశయోక్తి లేదేమో. జానకి హెచ్చు స్థాయి లో పాడేటప్పుడు ఆమె గొంతు ఎంత పవర్‌ఫుల్‌గా ఉండేదంటే, సౌండ్ ఇంజనీర్లు ఇబ్బంది పడేవారట. అందుకే ఆమె చాలా పాటల్లో హై నోట్స్ పలికించేటప్పుడు మైక్రోఫోన్‌కు కనీసం ఒకటి లేదా రెండు అడుగుల దూరం జరిగి నిలబడి పాడేవారు. అలా చేయడం వల్ల గొంతులోని ఆ కంపనం (Vibrato) చాలా సహజంగా, మధురంగా రికార్డ్ అయ్యేది.

ఒకే పాఠశాలలో చదువుకునే ఇద్దరు పిల్లలు. తొమ్మిది పది కంటే ఎక్కువ సంవత్సరాలు వుండవు. ఇద్దరి సామాజిక స్థాయి వేరువేరు. చిన్నపిల్లలు కదా అవేమీ తెలియదు. ఇద్దరికీ స్నేహం కలిసింది. పెద్దవాళ్లకు తెలిసింది. కులం,వర్ణం,అన్నీ ముందుకు వచ్చాయి. కానీ వీటన్నిటికీ అతీతమైనది స్నేహం అని చెప్పాలి. మాస్టారు పాడమని అడిగితే పదేళ్ల పిల్లాడు పాడాలి . సినారె పాటయితే రాశారు . మగవాళ్ళతో పాడిస్తే మరీ ముదురుగా ఉంటుంది. లేత గొంతు తో పాడాలి. ఎవరు పాడాలి ? .ఇంకెవరు జానకే పాడాలి. పాడింది. గున్నమామిడీ కొమ్మ మీద అంటూ . అప్పుడామె వయసు ముప్పైనాలుగేళ్ళు

మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత స్థానం ఆచార్యుడిదే. ఆమె సామాజిక స్పృహ పుష్కలంగా వున్న అధ్యాపకురాలు. పాఠం చెప్పడానికి క్లాసులోకి వెళ్ళింది. బోర్డు మీద స్త్రీల నగ్న చిత్రాలు.ఎదురుగా నిలబడిన ప్రతి విద్యార్ధీ ఒక కీచకుడిలా కనిపించాడు ఆమెకు. తనంత ఎత్తు ఎదిగిన పిల్లలు. కొట్టలేదు. తిట్టలేదు. మరేం చేయాలి? అప్పుడు వేటూరి రాశారొక అద్భుతమైన పాట. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకం లో . స్వరం లో భాస్వరం రగిలించాలి. స్వరం లో అమ్మతనపు ఆవేదన వినిపించాలి. స్వరం లో నిస్సహాయ స్త్రీ ఆక్రోశం కనిపించాలి. ఎవరు పాడగలరు? ఒక్క జానకి తప్ప. పాడింది నలభై ఎనిమిదేళ్ల జానకి పాడింది , మర్మస్థానం కాదది నీ జన్మ స్థానం అన్నప్పుడు ఆ స్వర కంపనానికి ఏమిస్తే మాత్రం ఋణం తీరుతుంది

భైరవ ద్వీపం సినిమా కోసం వేటూరి ఒక జావళి రాసారు. నరుడా ఏమి నీ కోరిక అంటూ . కథానాయకుడిని కవ్వించాలి.తన గాత్రం తో అతడిని తన దారికి తెచ్చుకోకాలి. అక్షరక్షరం శృంగారం వొలికించాలి. ఎవరు పాడగలరు ఆ పాట? ఆబ్వియస్ గా జానకి . ఆ పాట ఎంత హిట్టో మనకు తెలుసు. అంత శృంగారాన్ని ఒలికించిన ఆ స్వరం వయసు అప్పుడు యాభయ్ ఆరు. నిజంగా ఆమె స్వరానికి వయసు వచ్చిందా?

ఈ మూడు పాటలు ఎందుకు ఉదాహరించాను అంటే జానకి కి ఇవాళ అంటే 23-04-2026 కి ఎనభయి ఎనిమిదేళ్లు వచ్చాయి అని ఆమె పుట్టిన సంవత్సరం 1938 చెపుతోంది. నాకేమో ఆమె వయసు పది, ఇరవై అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తోంది. ఆమె శరీరానికి వయసు వస్తోంది కానీ ఆమె స్వరం చిరంజీవి

డిస్ క్లెయిమర్: అమ్మ జానకి దివికెగిసిన వేళ మళ్ళీ ఆమెను ఓసారి తల్చుకుంటూ వంశీకృష్ణగారి ఓల్డ్ పోస్టుతో ఈ నివాళి…🙏

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles