ఇద్దరూ ఇద్దరే. ఎవరికి వారు గొప్పవారే. ఇద్దరూ యూనిక్. కానీ, ఇద్దరు సమకాలీనుల్లో ఎవరి ప్లస్ ఏంటి.. ఎవరి మైనసేంటనే చర్చ సర్వసాధారణం. పోలికలూ తప్పవు.
సుమారు రెండు దశాబ్దాలుగా ఫుట్ బాల్ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రశ్నపైన వాదనలు నడుస్తున్నాయి. లియోనెల్ మెస్సీ గొప్పా… లేక, క్రిస్టియానో రోనాల్డోనా..?
ఆధునిక ఫుట్ బాల్ చరిత్రలో ఇద్దరూ హీరోలే! అందులో ఎలాంటి సందేహం లేదు. అసాధారణమైన నాయకత్వం, సృజనాత్మకత, బంతిపై నియంత్రణ, అవసరమైన ప్రదర్శన కంటే సమర్థవంతమైన ఆటకు ప్రాధాన్యమిస్తూ మెస్సీ కనిపిస్తే… రోనాల్డో, అసాధారణమైన శారీరక దృఢత్వం, వేగం, గాల్లో హెడ్డింగ్ తోనే గోల్స్ చేయగల నేర్పరితనం, కఠినమైన శ్రమ, క్రమశిక్షణకు కేరాఫ్ లా కనిపిస్తాడు.
గోల్స్ మొదలు డీ ఓర్ అవార్డులు, సాధించిన ట్రోఫీల సంఖ్య, పెద్ద పెద్ద మ్యాచుల్లో ప్రదర్శలు.. ఇలా అన్ని కోణాల్లోనూ ఈ పోలిక కొనసాగుతూనే ఉంది. వీరిద్దరూ ఇద్దరే. గణాంకాల్లో కూడా దాదాపు సరిసమానులే. కానీ, ఫుట్ బాల్ జట్టు సమిష్ఠి ఆట. ఆ వ్యత్యాసం మాత్రం ఈ ఇద్దరి జట్లల్లో కనిపిస్తూ వస్తోంది.
ఆ వ్యత్యాసం డ్రెస్సింగ్ రూమ్ మొదలు మైదానంలో అమలుపర్చే వ్యూహాలు, ఎగ్జిక్యూషన్ వరకూ ప్రదర్శితమవుతూనే ఉందన్న వాదన విశ్లేషకుల నుంచి వినిపించేది.

ప్లేయర్ ను గౌరవించే తీరులో అర్జెంటీనాది గొప్ప సంస్కృతి!
అర్జెంటీనా గెల్చినప్పుడు ఆ సంబరాలు కేవలం విజయానికే పరిమితమై ఉండవు. ఆటగాళ్లు తమ కీలక ఆటగాణ్ని, నాయకుణ్ని భుజాలపై ఎత్తుకుని అతగాడి పేరిట నినాదాలు చేస్తారు. అది అంబరాన్నంటే సంబరం. ఈజిప్ట్ పై గెలిచి, ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ కు చేరాక ఈ దృశ్యం మైదానంలో ఆవిష్కృతమైంది. ఇది ఈ మ్యాచులోనే కనిపించిన దృశ్యం కాదు.. ఎప్పుడు ట్రోఫీలు గెల్చినా, మైల్ స్టోన్స్ సాధించినా, సర్వసాధారణ మ్యాచులు గెల్చినా ఇవే దృశ్యాలు అర్జెంటీనా జట్టులో కనిపిస్తాయి. ఆ సమయంలో ప్రతీ కెమెరా కన్నూ రోడ్రిగో డి పాల్ మెస్సీనే వెతుకుతుంటుంది.
ఇది ప్రతిభావంతుడైన తన టీం స్టార్ ప్లేయర్, నాయకుణ్ని కేవలం గౌరవించుకోవడం మాత్రమే కాదు.. అంతకంటే లోతైన భావోద్వేగ బంధం. అర్జెంటీనా ఇప్పుడు మెస్సీని తమ జట్టులో ఆడే ఒక సూపర్ స్టార్ గా, కెప్టెన్ గా మాత్రమే చూడటం లేదు. నాయకుడంటే ఇలా ఉండాలనే ఒకింత గర్వం, ఆత్మవిశ్వాసం ఆ జట్టు మొత్తంలో కనిపిస్తోంది. ప్రతీ మ్యాచ్ ముగింపు తర్వాత వారి ప్రవర్తన అదే మనకు చెబుతోంది.
పోర్చుగల్ లో కొరవడిన స్ఫూర్తి!
అర్జెంటీనాతో పోలిస్తే పోర్చుగల్ టీం స్పిరిట్ కాస్త భిన్నం. రోనాల్డోను సహచరులు గౌరవించరని కాదు. అతడి క్రమశిక్షణ, తనకు తాను ప్రమాణాలను నిర్ధేశించుకుని ఆడే తీరుపైన మాజీలతో పాటు, ప్రస్తుత ఆటగాళ్లు కూడా ప్రశంసిస్తూనే ఉన్నారు. అయితే, జాతీయ జట్టు స్పిరిట్ విషయానికొచ్చేసరికి.. అర్జెంటీనా స్ఫూర్తి పోర్చుగల్ లో కొరవడిందన్నదే చర్చ. పోర్చుగల్ లో నూతన తరంలో ఈ ఆలోచనా సరళి కొరవడిందో.. లేక, వారి ఆలోచనలు రోనాల్డో స్థాయిని మించే ఉన్నాయోగానీ.. అర్జెంటీనా స్పోర్టివ్ స్పిరిట్ ను పోర్చుగల్ చూపించలేకపోతున్నదన్నదే విశ్లేషకుల వాదన.
మెస్సీ విషయంలో ఇలాంటి చర్చలు కనిపించవు. అర్జెంటీనా ఇప్పుడు మెస్సీ స్థానంలో మరొకరిని సిద్ధం చేయడానికి అంత ఆలోచించకపోవచ్చు. డ్రెస్సింగ్ రూంలో ఆ చర్చలుంటాయా లేవా చెప్పలేం. కానీ, పోర్చుగల్ చుట్టూ అలాంటి వాతావరణమైతే ఉందంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. అర్జెంటీనాకు మాత్రం ఆ పరిస్థితి లేకపోవడం ప్లస్.
గత తప్పిదాల నుంచి అర్జెంటీనా ఏం నేర్చుకుంది..?
భావోద్వేగ బంధాలు ఒక్క రోజులో ఏర్పడేవి కావు. అవి మైదానంలోనే ఆరంభమైనా వాటి వయస్సు పరిగణనలోకి తీసుకోబడేదే. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా చాలా ఏళ్ల పాటు ఒకే ఒక్క పెద్ద తప్పు చేస్తూ వస్తోంది. బంతిని మాత్రమే మెస్సీకి ఇచ్చి… మిగతా సమస్యలన్నింటినీ అతడి ప్రతిభే పరిష్కరిస్తుందని ఆశించిది. గతంలో చాలా ఫైనల్స్ కు చేరింది. కానీ, గెలవలేకపోయింది. ఒకే ఒక్క ఆటగాడి ప్రతిభపైనే భారం వేయడమే అందుకు కారణం. ఫలితంగా మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా బాగా ఆడి ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రం అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేది. లేదంటే విఫలమైతే కుప్పకూలేది.
మారాల్సింది మెస్సీనా.. అర్జెంటీనానా..? ఈ ప్రశ్నే అర్జెంటీనా ఆటను మార్చేసింది!
ముమ్మాటికీ మారాల్సింది మెస్సీ కాదు. మెస్సీకి తన వ్యక్తిగత ప్రతిభకు తగ్గ పేరు, ప్రఖ్యాతులు ఆల్రెడీ సంపాదించుకున్నాడు. కానీ, అర్జెంటీనా జట్టే ఒక దశలో మారాల్సిన సమయం ఆసన్నమైంది. అదే రక్షకుడిపైనే ఆధారపడకుండా వ్యవస్థను నిర్మించడం. ఆ మార్పు లియోనెల్ స్కలోనీ మేనేజర్ గా, ఆ తర్వాత కోచ్ గా వచ్చాక ఆరంభమైంది. మెస్సీ ఆట ఒక్కసారిగా ఏం మారిపోలేదు. ముప్పై ఏళ్లు దాటిన ఆటగాడు ఒక్కసారిగా కొత్త వేగాన్ని సంపాదించుకోడు కూడా. కానీ లియోనెల్ స్కలోనీ పాత్రతో మెస్సీ చుట్టూ ఉన్న వ్యవస్థ.. అదే, మిగిలిన టీం కూడా మారింది.
అర్జెంటీనా 2022 ఫిఫా వరల్డ్ కప్ గెల్చింది అంటే కేవలం మెస్సీ వల్లే సాధ్యం కాలేదు.. మెస్సీతో పాటే బలమైన సమన్వయం అర్జెంటీనాలో చేకూరిందని అంతర్జాతీయ మీడియా కూడా కథనాలు రాశాయి. కోచ్ స్కలోని సాధించిన అతి పెద్ద విజయమది. మెస్సీ ఒక్కడే అన్నీ చేయాలనే ఆశ లేకుండా… అతడిపైనే మొత్తం భారం వేయకుండా స్కలోని మిగతా టీమ్ నూ తీర్చిదిద్దాడు.
రోడ్రిగో డి పాల్.. మెస్సీ పరుగెత్తాల్సిన అవసరం లేకుండా మైదానమంతా కవర్ చేయగలడు. ఎంజో ఫెర్నాండెజ్ మిడ్ ఫీల్డ్ ను కంట్రోల్ చేయగలడు. మెస్సీ బంతి కోసం వెనక్కి రావాల్సిన అవసరం పడకుండా.. స్వేచ్ఛంగా ఆడేలా ఫెర్నాండెండ్ మేనేజ్ చేయగలడు. అలెక్సిక్ మాక్ అలిస్టర్ మధ్య వరుసలను సమన్వయం చేయగల్గుతాడు. ఇలా ఆటగాళ్లంతా మంచి తర్ఫీదు పొందటంతో అర్జెంటీనా ఒక బలమైన జట్టుగా కొత్త రూపు సంతరించుకుంది.
జట్టంటేనే భాగస్వామ్యం!
అర్జెంటీనాలో ఇదేదో ఒక్కరోజులో జరిగింది కాదు. యాదృచ్ఛికమని అంతకన్నా అనలేం. ప్రతీ ఆటగాడి పాత్రా మెస్సీకి తోడ్పాటందించే విధంగా ఉంది. 20 నిమిషాలు మెస్సీ బంతిని కనీసం టచ్ చేయకపోయినా జట్టు కుప్పకూలిపోదు. అతడు వెనక్కి వచ్చి డిఫెండ్ చేయకపోయినా మిగతావారు సిద్ధంగా ఉంటారు. జట్టు సమిష్ఠి ఆటకు.. మెస్సీ మెరుపులు తోడై తన ముద్ర వేస్తాయంతే.
ఇప్పుడు అర్జెంటీనా మెస్సీకోసం ఆడటం లేదు. మెస్సీతో కలిసి ఆడుతోంది.
పోర్చుగల్ కు అస్తిత్వ సంక్షోభం!
పోర్చుగల్ కథ మాత్రం భిన్నం. ప్రతిభ లేక కాదు. నిజానికి బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వా, విటిన్హా, రఫయెల్ లియావో, నునో మెండెస్ తో ఈ తరం పోర్చుగల్ బృందం ఆ టీం చరిత్రలోనే అత్యంత పటిష్ఠంగా ఉంది. వీరంతా అంతటి ప్రతిభావంతులు. కానీ, ప్రాథమిక ప్రశ్నలకు మాత్రం పోర్చుగల్ వద్ద సమాధానాలు లేవు.
అదింకా రోనాల్డో జట్టేనా..? లేక, నూతన తరంతో కూడిన జట్టా…? రోనాల్డో కేవలం స్పిరిట్ నింపే ఆటగాడు మాత్రమేనా.. ? మెస్సీని అర్జెంటీనా గుర్తించిన రీతిలో.. రోనాల్డోను పోర్చుగల్ గుర్తించడం లేదా..? ఈ గందరగోళ ప్రాథమిక ప్రశ్నలెన్నో ఈ జట్టు గురించి ఉన్నాయి.
రోనాల్డో కదలికలు వేగవంతంగా కనిపించినా.. మైదానంలో ఒక రిథమ్ అనేది మాత్రం అర్జెంటీనాతో పోలిస్తే ఆటగాళ్ల మధ్య లేదనేది పోర్చుగల్ ను గమనించినవారి అభిప్రాయం. పాజ్ లతో ఆడటం వంటివన్నీ పోర్చుగల్ లో కొత్తతరం చేతుల్లోకి వెళ్లిపోయాయి.
అర్జెంటీనా మెస్సీతో కలిసి ఆడినట్టుగా… పోర్చుగల్ టీమ్ అంతా రోనాల్డోతో కలిసి ఆడాలా…? లేక కొత్తతరం దూకుడుతో కొత్త భవిష్యత్తువైపు అడుగులనుకోవాలా అనే సందిగ్ధం ఇప్పుడు పోర్చుగల్ లో కనిపిస్తోంది.
2026 వరల్డ్ కప్పే రోనాల్డోకు చివరిదయ్యే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. ఫుట్ బాల్ చరిత్రలో తమ గొప్ప ఆటగాడితో పాటే.. అత్యంత ప్రతిభావంతమైన జట్టు కూర్పునెలా చేసుకోవాలన్న ప్రశ్నకు పోర్చుగల్ వద్ద ఇప్పటికీ సమాధానం కనిపించడం లేదన్నది స్పోర్ట్స్ అనలిస్టుల విశ్లేషణ. ఇదే వారికి తర్వాత్తర్వాత పశ్చాత్తాపాన్ని మిగల్చవచ్చనేదీ వారి వాదన.
ప్రతిభకు లోటు లేదు.. ఆడాలన్న కాంక్ష రగులుతూనే ఉంది.. కానీ, లోటొక్కటే. అదే అర్జెంటీనా తరహాలో… పోర్చుగల్ కూడా రోనాల్డోను ఉపయోగించుకుంటూనే కొత్తతరంతో జట్టు సమన్వయం, కూర్పు జరిగుంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అదే అర్జెంటీనా సక్సెస్ మంత్ర!
2014లో స్కలోని కోచ్ గా వచ్చాక మెస్సీని తిరిగి ఏం కొత్తగా తయారు చేయలేదు. తన ముందున్న మెస్సీని అంగీకరిస్తూనే అతడి పరిమితులను గుర్తించాడు. అలాగే, ఇతర క్రీడాకారుల బలబలాలను అంచనా వేసి వారిని తీర్చిదిద్దాడు. తద్వారా జట్టును సమిష్ఠిగా మరింత బలంగా మార్చాడు. జట్టు వ్యూహాల్లోనే కాదు.. ఆ జట్టు సంస్కృతిలోనే ఆ సమన్వయాన్ని ఇంజెక్ట్ చేయడంలో స్కలోని సక్సెస్ అయ్యాడు.
అర్జెంటీనా మెస్సీని ఎలాంటి అనుమానం లేకుండా నాయకుడిగా స్వీకరించింది. అతణ్ని భుజాలపై మోసింది. అతడి పేరును గర్వంగా నినదించింది. ఎవరి వెంట నడుస్తున్నామో, ఎవరి కోసం ఆడుతున్నామో పక్కాగా తెలిసిన టీం స్పిరిట్ అర్జెంటీనాది.
పోర్చుగల్ కు రోనాల్డోతో ఉన్న బంధం మాత్రం ఎప్పుడూ సంక్లిష్టమే. అతడు ఇంకా ఆడాలా.. జట్టు ముందుకు వెళ్లాలా.. రోనాల్డోకు మద్దతిచ్చేవారు.. వ్యతిరేకించేవారు.. ఇలాంటి అంతులేని చర్చలన్నీ ఆ జట్టు ఫుట్ బాల్ ఆటకంటే పెద్దగా తయారయ్యాయి.
సింపుల్.. అర్జెంటీనా మెస్సీ వెనుక ఒక్కటై నిల్చింది. పోర్చుగల్ మాత్రం రోనాల్డోతో తమ బంధాన్ని ఇప్పటికీ ఇంకా నిర్వచించుకునే ప్రయత్నంలోనే ఉంది.
అర్జెంటీనా మెస్సీకి ఇచ్చిన గొప్ప బహుమానం వరల్డ్ కప్ కానే కాదు.. అతడిని పూర్తిగా అర్థం చేసుకోవడమే ఆ కానుక.
పోర్చుగల్ వద్ద అపారమైన ప్రతిభ ఉన్నా.. రోనాల్డోతో ఇప్పటికీ పూర్తిగా క్లోజ్ గా కలవలేకపోవడమే మైనస్.
రెండు జట్ల మధ్య ఈ రెండు అంశాలే ఇప్పుడు ప్రపంచ స్థాయి ఫుట్ బాల్ అభిమానుల్లోనూ, విశ్లేషకుల్లోనూ చర్చలకు తెరలేపుతోంది.



