ఆపరేషన్ హార్డ్ బాల్… ఇప్పుడిదే హాట్ టాపిక్!
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుపై అమెరికా చర్యలకు ఉపక్రమించింది.
భారత మూలాలున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నెట్వర్క్ పై అమెరికా ఫోకస్ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్జీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ లో జైలులో ఉన్న బిష్ణోయ్, అతడి స్నేహితుడు సతీందర్ జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ ప్రమేయముందని ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
లాస్ ఏంజెల్స్ లో మంగళవారం బహిర్గతమైన ఫెడరల్ అభియోగపత్రం ప్రకారం.. 2023, జూన్ 18న కెనడాలోని బ్రిటీష్ కొలంబియా రాష్ట్రం సర్రే నగరంలో హర్జీప్ సింగ్ నిజ్జర్ ను గురుద్వారా బయట హత్య చేయాలని బిష్ణోయ్ వ్యూహరం రచించాడు.

ఆపరేషన్ హార్డ్ బాల్ అంటే ఏమిటి..?
ఆపరేషన్ హార్డ్ బాల్ పేరుతో అమెరికా, కెనడా, యూరప్ దేశాల దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో భారత్ కేంద్రంగా పనిచేస్తున్న మూడు అంతర్జాతీయ వ్యవస్థీకృత నేర ముఠాలకు సంబంధించిన 24 మందిని ఈ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. వీరిలో 11 మంది కాలిఫోర్నియాలో పట్టుబడ్డారు.
ఈ ముఠాలపై నిజ్జర్ హత్యతో పాటు.. రాకెటీరింగ్, టార్గెట్స్ మర్డర్స్, కాల్పులకు పాల్పడటం, బెదిరించి వసూళ్లు చేయడం, అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక నేరాలకు సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి.
అమెరికా, కెనడా, యూరప్, ఆసియా దేశాల దర్యాప్తు సంస్థలు కలిసి నేరముఠాలను ప్రపంచంలో ఎక్కడున్నా ఛేదించి నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాయంటూ అమెరికా ఫస్ట్ అసిస్టెంట్ అటార్నీ బిల్ ఎస్సైలీ ఈ ఛార్జ్ షీట్స్ బహిరంగపర్చే క్రమంలో చెప్పుకొచ్చారు. ఈ నేరస్థులకు ఎక్కడా సురక్షిత ఆశ్రయముండదని కుండబద్ధలు కొట్టాడంటే ఎఫ్బీఐ ఈ కేసును ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమవుతుంది.
బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురైనట్టు ప్రచారం జరుగుతున్న మృతుడు హర్జీప్ సింగ్ నిజ్జర్ ఎవరు..?
హర్జీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో నివశించే ఖలీస్థానీ నాయకుడు. భారతదేశం ఇతణ్ని వేర్పాటువాద చర్యలతో ఉగ్రవాదిగా ప్రకటించింది. కెనడాలోని కొలంబియా రాష్ట్రం సర్రెలో గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడిగా హర్జీప్ పనిచేశాడు. భారత్ నిషేధించిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సంస్థకు నాయకుడు. 2023, జూన్ 18న గురుద్వారా వెలుపల జరిగిన కాల్పుల్లో నిజ్జర్ హత్యకు గురయ్యాడు.

నిజ్జర్ హత్య తర్వాత భారత్ – కెనడా దౌత్య సంబంధాలు కూడా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ పాత్ర కూడా ఉందన్నట్టుగా ఆరోపించాడు. భారత్ ఆ ఆరోపణలను ఆధారరహితమైనవిగా కొట్టిపారేసింది. రాజీకీయ దురుద్ధేశంతో చేసినవిగా కౌంటర్ ఇస్తూ ఖండించింది.
బిష్ణోయ్ గ్యాంగుపై అమెరికా ఎందుకు ఫోకస్ చేసింది..?
భారత్ కు చెందిన అంతర్జాతీయ నేర ముఠాలపై అమెరికా ఫెడరల్ సంస్థలు ఎన్నో ఏళ్లుగా దర్యాప్తు నిర్వహిస్తున్నాయి. ఈ ముఠాలు అంతర్జాతీయ రాకెటేరింగ్, హత్యలు, కాల్పులు, బెదిరింపులు, డబ్బు వసూళ్లు, అంతర్జాతీయంగా భారీ స్థాయిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడుతుండంటతో అమెరికా ఈ నేర ముఠాలపై సీరియస్ లుక్కు వేసింది. విదేశాల్లో నివశిస్తున్న భారతీయులపై ఈ నేరాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కూడా గుర్తించింది.
రెండు రోజుల క్రితం మంగళవారం బహిర్గతం చేసిన మూడు అభియోగపత్రాల్లో 37 మందిపైన కేసులు నమోదు చేసినట్టు అమెరికా వెల్లడించింది. వీరిలో ఇద్దరు నిందితులైన లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ భారత్ జైలులో నుంచే అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నట్టు అమెరికా ఆరోపించింది.
నిందితులను ఎక్కడ అరెస్ట్ చేశారు..?
అమెరికాలోని కాలిఫోర్నియాలో 11 మంది, ఇండియానాలో ఒకర్ని, జార్జియాలో మరొకర్ని పట్టుకున్నారు. ఈ 13 మందిని ఫెడరల్ కోర్టులో హాజరుపర్చారు. ఇక కెనడాలోనూ మరో ముగ్గురితో పాటు, స్పెయిన్ లో ఒకరు అరెస్ట్ కాగా… ఇప్పటికే జైళ్లల్లో మరో ఏడుగురున్నారు.

గోల్డీ బ్రార్ పై భారీ బహుమతి ప్రకటించిన ఎఫ్బీఐ!
పరారీలో ఉన్న మరో పదిమంది కోసం దర్యాప్తు సంస్థలు వెతుకులాడుతున్నాయి. గాలింపు చేపట్టినవారిలో అమెరికా చెబుతున్నదాన్ని బట్టి మరో ఏడుగురు అమెరికాలోనూ, ఇద్దరు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఇండియాలోనూ, మరొకరు యూరప్ లోనూ ఉన్నట్టు వెల్లడించారు.
లారెన్స్ బిష్ణోయ్ భారత్ లో జైలులో ఉండగా.. తన కీలక అనుచరుడైన గోల్డీ బ్రార్ మాత్రం ఇప్పటికే పరారీలో ఉన్నాడు.
అమెరికాతో పాటు, విదేశాల్లో కూడా కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తూ, సమాజాలను దోపిడీ చేస్తూ, అమానుష హింసకు పాల్పడుతున్న అంతర్జాతీయ నేర ముఠాల గుండెకాయపై దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టు ఎఫ్బీఐ అధికారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో గోల్డీ బ్రార్ ఆచూకీ తెలియపర్చినవారికి ఏకంగా 50 వేల అమెరికన్ డాలర్లను ప్రకటించింది ఎఫ్బీఐ. అంటే ఇండియన్ కరెన్సీలో 43 లక్షల రూపాయలు.
మరి కెనడా ఏమంటోంది..?
కెనడా, అమెరికాలో హత్యలు, క్రూరమైన హింసకు పాల్పడుతూ.. బలహీనుల భయాన్నే ఆయుధంగా చేసుకుని రెచ్చిపోతున్న వ్యవస్థీకృత నేరగాళ్ల ఆట కట్టించగల్గాం. ఈ విజయాన్ని ఇక్కడితో ఆపేయం. కెనడా, అమెరికాతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు భద్రత ఇచ్చే క్రమంలో మేం నిరంతరం ఈ ఆపరేషన్ కొనసాగిస్తామంటున్నాడు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కమిషనర్ మైక్ డుహీమ్.



