సుబ్రహ్మణ్యం వల్లూరి..✍️
నాకెవరైనా మిత్రులు అనవసరంగా నా మెస్సెంజర్లోకి వస్తే ఇష్టం ఉండదు. ఓ రెండేళ్ల క్రితం లేదా ఇంకొంచెం ముందో గుర్తులేదు కానీ ఒకావిడ నా గురించి తెలియక సదుద్దేశంతోనే ఉదయం “శుభోదయం” పోస్ట్ చేసేవారు.
అలాగే వాట్సాప్ లో ఎవరైనా శుభోదయం శుభరాత్రి చెప్పినా స్పందించను. ఇద్దరికి తప్పితే, వాళ్లిద్దరూ నాకు అత్యంత ఆప్తులు కనుక. అందులో ఒకావిడ నాకు శుభోదయం చెప్పడమే గౌరవంగా భావిస్తాను. రెండో వ్యక్తి యోగక్షేమాలు తెలుస్తాయని రోజూ ఉదయమే నేనే ఉదయం లేచిన తరువాత మెసేజ్ చేయమని అలవాటు చేసాను. ఇంట్లో ఆయనొక్కరే ఉంటారని. ఎప్పుడైనా ఆయన మెసేజ్ పెట్టకపోతే నేనే ఫోన్ చేస్తాను. ఒకవేళ ఆయన ఫోన్ ఎత్తకపోతే ఆయన ఇంటి తాళాలు ఉండే ఇద్దరు వ్యక్తుల ఫోన్ నంబర్లు ఉన్నాయి , వాళ్లకు ఫోన్ చేసి ఆయన ఇంటికి వెళ్లమంటే విషయం తెలుస్తుంది.

శుభోదయం, శుభరాత్రి లాంటివి నా దృష్టిలో ఒకరు విష్ చేస్తే జరిగేవి కావు. మన అదృష్టం ఎలా ఉంటుందో ఆలా జరుగుతుంది. పెద్దగా ప్రాధాన్యత ఇవ్వక్కరలేదని నా అభిప్రాయం.
ఆవిడ మీద గౌరవంతో నేను కూడా ఇష్టం లేకపోయినా జవాబిచ్చేవాడిని. అప్పుడప్పుడు జవాబిచ్చేవాడిని కాదు. అయినా ఆవిడ పట్టువదలని విక్రమార్కుడి బంధువులా నాకు మెసేజ్ చేసేవారు. ఓ రెండు నెలల తరువాత ఓ రోజు ఆవిడకు చెప్పాను “నాకు రోజూ శుభోదయం అవి చెప్పకపోయినా పరవాలేదండి” ఆవిడ ఫందా మార్చి నా వాట్సాప్ లో శుభోదయమండి అంటూ మెసేజ్ చేసేవారు. తెల్లవారగానే తప్పనిసరిగా మెసేజ్ చేసేవారావిడ. ఇహ లాభం లేదని ఒకరోజు ఆవిడకు గట్టిగానే చెప్పాను మెసేజ్ చేయకండి , మీరు చేసినా నేను జవాబు ఇవ్వను అని. పాపం పెద్దవిడ ఏమనుకున్నారో ఏమో , ఏకంగా నన్ను బ్లాక్ చేసేసారు. పోనీలే రోజూ తలనొప్పి తగ్గిందనుకున్నాను.
సాధారణంగా నాకు మెస్సెంజర్లో దేశంలోని ఎన్నో ప్రాంతల నుంచి కొన్ని వస్తువులు అమ్మేవారు మెసేజ్ లు చేస్తూవుంటారు కనుక నాకు ఇతరులు మెసేజ్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఆవిడ నన్ను బ్లాక్ చేసిన రెండుమూడు రోజుల తరువాత ఒక వస్తువు అమ్మేఅతనితో చాట్ చేస్తుండగా మా ఆవిడ స్కూల్ నుంచి ఫోన్ చేసింది.
ఒకపక్క ఒకతనితో ముఖ్యమైన విషయం మీద చాటింగ్ చేస్తుంటే మా ఆవిడ సరుకుల లిస్ట్ చదువుతోంది రాసుకోమని. మెస్సెంజర్లో ఉన్నానప్పుడు , అతని విండో మూసేసి నోటీప్యాడ్ తెరుద్దామంటే ఎందుకో అప్పుడా యాప్ పనిచేయలేదు. సరే అనుకుని వాట్సాప్ తెరిస్తే ఆవిడ చాట్ కనిపించింది. ఎలాగు ఆవిడకు కనిపించిందని అక్కడ టైప్ చేసి సెండ్ బటన్ నొక్కాను. అక్కడ నన్ను బ్లాక్ చేసినావిడకు ఎలాగూ నేను రాసేవి కనిపించవు కనుక ఆవిడ చాట్ లో సరుకుల లిస్ట్ రాసుకున్నాను అప్పటికి.
అప్పటినుంచి ఆ చాట్ నా రెండో నోట్ ప్యాడ్ అయిపోయింది. గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు , సరుకులు ఇతర విషయాలు అక్కడ రాస్తూ వచ్చాను.
రెండేళ్ల తరువాత ఆవిడ నిన్న ఎందుకో నన్ను unblock చేశారు. నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు సరే అని ఒప్పుకున్నాను. ఇవాళ ఉదయం ఆవిడ నేను రాసుకున్నవాన్ని చదివి “ఇవన్నీ ఏమిటండీ” అనడిగారు.
ఏమని జవాబివ్వాలో అర్ధం కాక ఈసారి నేనే ఆవిడను బ్లాక్ చేసాను. నాకా రెండో నోట్ ప్యాడ్ అవసరం చాలా ఉంది.



