ఆ ప్రధాని సంశయాలను పటాపంచలు చేసి.. ప్రశంసలందుకున్న సీఎం ఆయన!

చెమిక‌ల రాజ‌శేఖ‌ర్..✍️

వైఎస్సార్ 2004లో మొద‌టిసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. సీఎంగా రెండు నెల‌లు అయ్యాయి.ఆయ‌న పీఏ త‌న‌కు ఫ‌లానా ప్ర‌భుత్వ‌ క్వార్ట‌ర్ కావాల‌ని ఆయ‌న‌ ను అభ్య‌ర్థించ‌డం, అందుకాయ‌న ఆ ప‌ని చూడ‌మ‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌య ఇంఛార్జి ఐఏఎస్ కు పుర‌మాయించ‌డం వెంట‌నే జ‌రిగిపోయింది. రోజులు గ‌డుస్తున్నాయి, ఐనా వైఎస్సార్ పీఏకు ప్ర‌భుత్వ క్వార్ట‌ర్ కేటాయింపు జ‌ర‌గ‌లేదు. ఆ విష‌యం తెలియ‌గానే, ఆల‌స్యం ఎందుకో క‌నుక్కుందామ‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ మోహ‌న్ కందాకు ముఖ్య‌మంత్రి వైఎస్సార్ ఫోన్ చేశారు. (మోహ‌న్ కందా మునుప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో చీఫ్ సెక్ర‌ట‌రీగా నియ‌మితుల‌య్యారు. ప్ర‌భుత్వం మార‌గానే సీఎంలు త‌మకు అనుకూల‌మైన‌ చీఫ్ సెక్ర‌ట‌రీల‌ను మారుస్తారు. వైఎస్సార్ ఆ ప‌ని చేయ‌లేదు) వైఎస్సార్ పీఏ కోరుకున్న ప్ర‌భుత్వ క్వార్ట‌ర్ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు పీఏకు కేటాయించామ‌ని, ఆయ‌న్ను ఖాళీ చేయించి ఇప్పిస్తాన‌ని మోహ‌న్ కందా బదులిచ్చారు. దానికి వైఎస్సార్ ఒప్పుకోలేదు. మ‌న‌కు అధికారం వుంది క‌దా అని, ముందు ద‌ర‌ఖాస్తు చేసుకొని కేటాయింపు పొందిన వ్య‌క్తినుంచి ఆ కేటాయింపును వెన‌క్కి తీసుకోవ‌డం మంచిది కాదు అని చీఫ్ సెక్ర‌ట‌రీ మోహ‌న్ కందాతో చెప్పారు.

మ‌నం అధికారంలో వున్నాం, ప్ర‌భుత్వ‌ క్వార్ట‌ర్ల కేటాయింపులో ముందు మ‌న‌కే ప్రాధాన్య‌త ద‌క్కాల‌ని వైఎస్సార్ పీఏ త‌న అభిప్రాయం చెప్ప‌గానే అత‌నికి వైఎస్సార్ ఫిట్టింగ్ రిప్ల‌యి ఇచ్చారు. అలా చేస్తే రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల కింద‌కు వ‌స్తుంది. ఈ రోజు మ‌నం అధికారంలో వుంటాం. రేపు వాళ్లు వుంటారు. అధికారం శాశ్వ‌తం కాదు. ఎన్నిక‌లైపోయిన త‌ర్వాత అధికార‌పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీలు క‌లిసి ప్ర‌జ‌ల‌కోసం ప‌ని చేయాలి, అంతే త‌ప్ప వ్య‌క్తిగ‌త భేష‌జాలు, క‌క్ష సాధింపుల‌కు కాదు అని హిత‌వు చెప్పారు. ఆ విష‌యం అప్ప‌ట్లో ఐఏఎస్ ల మ‌ధ్య‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాబోయే రోజుల్లో వైఎస్సార్ ప్ర‌భుత్వ తీరును చెప్ప‌క‌నే చెప్పింద‌ని ఉన్న‌తాధికారులు భావించిన‌ట్టు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఈ మ‌ధ్య‌నే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

ఐదు సంవ‌త్స‌రాల , 3 నెల‌ల‌పాటుమాత్ర‌మే పాల‌న చేసిన వైఎస్సార్ త‌న ప‌రిపాల‌న జీవితంలో అనేక విప్ల‌వాత్మ‌క ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. వాటిలో కొన్ని ఇత‌ర రాష్ట్రాల‌కు, కేంద్ర‌ప్ర‌భుత్వానికి ఆద‌ర్శ‌మ‌య్యాయి. ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి. వైఎస్సార్ త‌న మొద‌టి ఓటు కమ్యూనిస్టుల‌కు వేశార‌ని క‌మ్యూనిస్టు సీనియ‌ర్ నేత కూనంనేని సాంబ‌శివరావు అన్నారు. ఆయ‌న తన పాల‌న‌లో క‌మ్యూనిస్టు పార్టీల కార్యాల‌యాల‌కోసం ప‌లు న‌గ‌రాలు, ప‌ట్టణాల్లో విలువైన స్థ‌లాల‌ను కేటాయించార‌ని, పేద‌ప్ర‌జ‌ల‌కోసం ఆయ‌న పెట్టిన ప‌థ‌కాలు, అమ‌లు చేసిన విధానాలు అద్భుత‌మ‌ని కూనంనేని సాంబ‌శివ‌రావు గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. అధికారాన్ని త‌ల‌కెక్కించుకోని ప్ర‌జ‌ల ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి.

అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ కు ఎక్క‌డో వైఎస్సార్ ప‌థ‌కాల‌ప‌ట్ల సంశ‌యం, వ్య‌తిరేక‌త వుండేవి. ప‌రిస్థితుల ప్ర‌భావంవ‌ల్ల, ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు తీసుకున్న‌ చాక‌చ‌క్య నిర్ణ‌యంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు మ‌న్మోహ‌న్ సింగ్‌. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ గా, ఆర్ధిక మంత్రిగా మ‌న్మోహ‌న్ సింగ్‌లోని ఆర్ధిక‌రంగ నిపుణుడు సంక్షేమ ప‌థాక‌ల‌ప‌ట్ల సంశ‌యంగానే వుంటూ వుండేవారు. అలాంటి మ‌న్మోహ‌న్ సింగ్ కాల‌క్ర‌మంలో మ‌న‌సు మార్చుకొని వైఎస్సార్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను ప్ర‌శంసించ‌డమే కాకుండా వైఎస్సార్ లాంటి నాయ‌కులు మ‌రో నలుగురైదుగురు వుంటే దేశంలో పేద‌రికం తొల‌గిపోతుంద‌ని ఓ స‌భ‌లో ప్ర‌శంసించారు. సాధార‌ణంగా ఎవ‌రినీ ప్రశంసించ‌ని మ‌న్మోహ‌న్ సింగ్ చేత‌ , సంక్షేమ ప‌థకాల‌కార‌ణంగా ఖ‌జానా స‌మ‌తుల్యత దెబ్బ‌తింటుంద‌నే ఆర్థిక రంగ దిగ్గ‌జం మ‌న్మోహ‌న్ సింగ్ చేత శెభాష్ అనిపించుకోవ‌డం వైఎస్సార్ సాధించిన ఒక గొప్ప విజ‌యం.

చిత్త‌శుద్ధితో రాజ‌కీయాల్లో వుండాల‌నుకునేవారు, ప‌దికాలాల‌పాటు రాజ‌కీయాల్లో కొన‌సాగాల‌నుకునేవారు, ప్ర‌జ‌ల‌చేత శెభాష్ అనిపించుకోవాల‌నుకునేవారు చ‌ద‌వాల్సిన విలువైన‌ పాఠ్య‌పుస్త‌కం వైఎస్సార్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles