నేటి రోజుల్లో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఏవైనా వండర్స్ చేయొచ్చు. టూడీ, త్రీడీ యానిమేషన్స్ నుంచి మొదలైన టెక్నాలజీ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో అత్యద్భుతాలను క్రియేట్ చేయగల్గే స్థాయికెదిగింది. అందుకు బాహుబలి, త్రిబుల్ ఆర్, సాలార్, హను మాన్ వంటి ఎన్నో సినిమాలను జాబితాలో చెప్పుకోవచ్చు. ఇప్పుడేకంగా కాలాలు వేరైన కథానాయకులను ఒకే కాలం కిందకు తీసుకొచ్చి ప్రేక్షకులకు చూపించే దర్శకులనూ మనం చూడగల్గుతున్నాం. అయితే, నేటి దర్శకులంత మొండి ధైర్యం చేయలేకపోయారుగానీ.. ఇలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే మన తెలుగులో విఠలాచార్య వంటివారు వండర్స్ చేశారు. అలాంటి అద్భుతమే ప్రఖ్యాత సీరియల్ రామాయణ్ నిర్మించిన రామానందసాగర్ కూడా చేశారు. ఇప్పుడంటే అవసరం లేకున్నా కథానాయకులను కూడా గాల్లోనే ఫైట్స్ చేయించే టెక్నాలజీ అందుబాటులోకొచ్చిందిగానీ.. ఆనాడు రామాయణ్ సీరియల్ తీసే సమయంలో హనుమాన్ గాల్లోకెగిరే సీన్ చిత్రీకరించేందుకు నానా అవస్థలే పడాల్సి వచ్చిదంట. అదేంటో ఓసారి తెలుసుకుందాం రండి.

రామయణం పేరు చెబితే.. లీలగానైనా రామానందసాగర్ గుర్తుకురాకపోడు. అంతగా కనెక్టయ్యాడు తన రామాయణ్ సీరియల్ తో. అప్పుడప్పుడే గ్రామీణ భారతంలోకి కాస్తోకూస్తో డబ్బులున్నవాళ్లల్లో కనిపించే టీవీల్లో ఆదివారం వచ్చిందంటే ఆ సీరియల్ వీక్షించేందుకు జనం క్యూ కట్టేవారు. టీవీ సెట్లున్న కుటుంబీకులు కూడా తమ ఇంటికి అంతమంది వచ్చి టీవీ చూడటాన్ని కాస్తా ప్రైడ్ గా ఫీలవుతూ ఎంజాయ్ చేసేవాళ్లు. అప్పుడప్పుడూ కోప్పడేవారుకూడాననుకోండి. అయితే రామాయణ్ మొట్టమొదట 1987. జనవరి 25వ తేదీన దూరదర్శన్ లో ప్రసారమైంది. 1988, జూలై 31న చివరి ఎపిసోడ్ తో ముగిసింది. అంటే సుమారు ఏడాదికిపైగా ఆ రామాయణ్ సీరియల్ ఒక ఊపులూపింది. లక్షలాది వీక్షకులతో ఇప్పటికీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్ గా కూడా రామాయణ్ గుర్తింపు ఇంకా అలాగే ఉంది.
ఆదివారం వచ్చిందంటే చాలు గంట సమయం వీధులన్నీ అప్రకటిత కర్ఫ్యూనే. రద్దీగా ఉండే రహదారులు కూడా నిశ్శబ్దమయ్యేవి. అలా దేశం మొత్తం ఆదివారం ఉదయం ఓ గంటసేపు స్తంభించిపోయేది.
నటులకు ఐకానిక్ గుర్తింపునిచ్చిన రామాయణ్!
రాముడి వేషం వేసిన అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిఖాలియాతో పాటు.. హనుమంతుడిగా వేసిన ధారాసింగ్, లక్ష్మణుడిగా వేసిన సునీల్ వంటివారు.. దేవుళ్లను కొల్చే ప్రతీ ఇంట్లో సాక్షాత్తూ దేవతలైపోయారంటే అతిశయోక్తి కాదు.
ఉమర్ గావ్ లో చిత్రీకరణ!
రామాయణ్ సీరియల్ చిత్రీకరణ కోసం రామానందసాగర్ గుజరాత్ వల్సాద్ జిల్లాలోని ఉమర్ గావ్ ను ఎంచుకున్నాడు. ముంబై నుంచి 150 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దులో ఉన్న గ్రామమది. ఉమర్ గావ్ సుందరమైన ప్రదేశం. పరుచుకున్న ఆకుపచ్చదనంతో పాటు.. సముద్రతీరం కావడం.. పక్కనే సరస్సులు, కొండలుండటంతో ఆ గ్రామాన్ని తన షూటింగ్ కు అనువైనదిగా భావించి ఉమర్ గావ్ డిసైడ్ చేశారు రామానందసాగర్. అనుకున్నట్టే పురాణాల్లో చెప్పే రామాయణాన్ని ప్రతిబింబించే సహజమైన వాతావరణం ఆ సీరియల్ లోనూ కనిపించింది.
నాటి పౌరాణిక ప్రాంతాల సృష్టి ఎలా చేశారు..?
అయోధ్య, మిథిల, కిష్కింధ, కైలాస పర్వతాల నేపథ్యాన్ని చిత్రీకరించేందుకు అద్భుతమైన సెట్టింగ్స్ వేశారు. అసలు ఉమర్ గావ్ కు వెళ్లడం వల్లే రామాయణ్ సీరియల్ నిర్మించాలనే థాట్ వచ్చిదంట. ఈ విషయాన్ని రామానందసాగర్ కుమారుడైన ప్రేమ్ సాగరే ఓసారి చెప్పుకొచ్చారు. అలా రామాయణ్ చిత్రీకరణ కోసం అందులోని ప్రధాన నటీనటులంతా సుమారు రెండేళ్లపాటు ఉమర్ గావ్ లోనే ఉండాల్సి వచ్చింది.
ఉమర్ గావ్ లో ఓ ఫిల్మ్ సిటీ ఏర్పాటు!
నాడు రామాయణ్ తో షూటింగ్స్ కు బీజం పడిన ఉమర్ గావ్ ఇప్పుడు స్వస్తిక్ భూమి అనే స్టూడియోకు కేంద్రంగా నిలుస్తోంది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టూడియోలో 56 వేల చదరపు అడుగుల్లో కైలాస్ పర్వతాలు, 37 వేల 950 చదరపు అడుగులు గ్రాండ్ ప్యాలెస్ లు, పురాతన కోటలు, అలాగే ఓ మూడు మార్కెట్లు, ఓ కోర్ట్ గది వంటి విశాలమైన సెట్స్ ఉన్నాయి.
హనుమంతుడి ఎగిరే దృశ్యాల వెనుక ఉన్న మాయాజాలమేంటి..?
హనుమంతుడి వేషంలోనున్న ధారాసింగ్ సీతను వెతుకుతూ సంద్రం దాటి లంకకు వెళ్లాల్సిన సీన్ తో పాటు.. మేఘనాథుడి దెబ్బకు పడిపోయిన లక్ష్మణున్ని బతికించేందుకు సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చే సీన్స్ నాటి రామాయణ్ సమయంలో వీక్షకులను కట్టిపడేశాయి. అయితే 1980ల కాలంలోనే ఎలాంటి టెక్నాలజీ ఇంతగా అందుబాటులో లేని సమయంలో రామానందసాగర్ అవి ఎలా చిత్రీకరించాడన్న క్యూరియాసిటీ సహజంగానే ఉంటుంది.
ఇవాళ చాలా సినిమాల యాక్షన్ సీన్స్ కోసం ఉపయోగిస్తున్నట్టే.. హనుమాన్ క్యారెక్టర్ లో ఉన్న ధారాసింగ్ ను బెల్టులు, ప్రత్యేత వైర్లతో గాల్లో ఉంచి.. ఎగిరి గాల్లో వెళ్లుతున్నట్టుగా లైటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్, భిన్నమైన కెమెరా యాంగిల్స్ తో వాటిని షూట్ చేసి వాస్తవికతను ఉట్టిపడేలా చిత్రీకరించారు రామానందసాగర్.
అందుకే, ఇప్పటికీ రామాయణ్ వంటి సీరియల్స్ గురించి తల్చుకున్నప్పుడు.. మరెన్నో పురాజ్ఞాపకాలు కూడా మనల్ని ఒకసారి నాటి రోజుల్లోకి తొంగిచూసేలా చేస్తుంటాయి.


