Mani Bhushan, senior journo…✍🏼
శృంగార కావ్యాలలో రాసిన స్త్రీ సౌందర్యానికి, శరీర లావణ్యానికి సరైన కొలబద్దలా ఉండేది జ్యోతిలక్ష్మి.

జ్యోతిలక్ష్మి ఆట, ఎల్లారీశ్వరి పాట, రాజబాబు కామెడీ ఒక జమానాలో తెలుగు సినిమాని ఊపేశాయి. అప్పట్లో హండ్రెడ్ డేస్ ఆడిన ప్రతి మూడు సినిమాల్లో రెండు వీళ్ల మూలానే ఆడాయంటే నమ్మరు. అంత పాపులారిటీ సంపాదించారు.
‘పిల్లా? పిడుగా?’, ‘మొనగాడొస్తున్నాడు జాగ్రత్త!’, ‘గుండెలు తీసిన మొనగాడు’ వంటి కొన్ని కౌబాయ్, అడ్వంచరస్ చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది.
మొత్తం మీద ఇరవై చిత్రాల్లో హీరోయిన్‌గా నటించగా, తమిళంలోనే పది సినిమాలలో లీడ్ రోలు పోషించింది.
‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ వేసి… హీరోయిన్ విజయనిర్మల కంటే ఎక్కువ మార్కులే కొట్టేసింది.
‘మొనగాడొస్తున్నాడు జాగ్రత్త!’ సినిమాకి ఎల్లారీశ్వరి సింగిల్ కార్డ్ గాయని. హీరో కృష్ణ సహా మరొకరికి పాటే లేదు!
శాస్తీయ నృత్యంలో ఆరితేరిన జ్యోతిలక్ష్మి…”ఇదా లోకం?(1973)” సినిమాలో “గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు” పాటలో అటు శాస్త్రీయాన్ని, ఇటు పక్కా మాస్ స్టెప్పుల్ని వేసి ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు… ఇలా హీరోలు ఎవరైనా.. వాణిశ్రీ, కాంచన, మంజుల, భారతి వగైరా అందాల తారలు ఉన్నా… జ్యోతి లక్ష్మి ఆట-పాట ఉండాల్సిందే!
కేవలం జ్యోతిలక్ష్మి పాట కోసమే సినిమాలకు వెళ్లే జనం ఉండేవారట!
బొబ్బిలి పులి(1983) నాటికే ఈమె రిటైరయ్యింది.



