నచ్చావప్పా.. బీరప్పా!

నిన్నటివరకూ ఓ గొర్లకాపరి కొడుకు.. ఇప్పుడు ఆయనో సివిల్ సర్వెంట్!

రైల్వే స్టేషన్ లో ఓ కూలీ కొడుకు అదే రైల్వేస్టేషన్ కు స్టేషన్ మాస్టరయ్యాడు.. ఓ రిక్షా కార్మికుడి కొడుకు జెట్ విమానం నడిపే పైలటయ్యాడు… పొలంలో తండ్రి పడే కష్టం చూసిన ఓ రైతు కొడుకు వ్యవసాయ శాస్త్రవేత్తైనాడు… ఇదిగో ఇలాంటి ఏదో ఒక స్టోరీ మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. ఏ.. వాళ్ల కొడుకులైతే మాత్రం కాకూడదా.. వై నాట్ అనే ప్రశ్నా వినిపిస్తుంది. కానీ, దానికి సంకల్పబలం అంతే బలంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. ఆ మధ్య 12th fail అని విధూ వినోద్ చోప్రా నిర్మించిన సినిమా అలాంటివారి కథలకు ఓ ఉదాహరణగా తెరపైకెక్కింది. అలాంటి కథే మనమిప్పుడు చెప్పుకోబోతున్నాం.

వెనకటికి వర్ణవివక్షలెదుర్కొంటున్న కాలాన ఫలానావాడికేం తెలుసు మల్లెపూల వాసన అనే పడికట్టు సామెతలను తయారుచేస్తే… ఆ స్టీరియోటైపిక్ చాదస్తపు సామెతలన్నీ ఉట్టి అబద్ధాలని నిరూపించే సక్సెస్ స్టోరీస్ ని మనమీ కాలంలో చూస్తున్నాం.

అలాంటి కథే గొర్ల కాపరి కొడుకు బీరప్ప సిద్ధప్ప దోనీది. కర్నాటకలోని బెళగావి జిల్లాలోని అమేజ్ అనే విలేజ్ అంతా అమేజింగ్ అని కోడై కూసే విజయాన్ని సాధించాడు బీరప్ప. తన ఊళ్లో తనలాంటి యువత ఎందరికో తన నేపథ్యం ఇప్పుడో ప్రేరణగా నిలుస్తోంది. దృఢసంకల్పానికి కేరాఫ్ లా తన గ్రామం పేరును రెపరెపలాడించాడు బీరప్ప.

ఎందుకంటే, తనో గొర్ల కాపరి కొడుకు. గొర్లు కాసుకుంటేనేగానీ తన కుటుంబాన్ని పోషించలేడు తన తండ్రి. నాన్న ఎండననకా, వాననకా పడ్డ కష్టాన్ని చూస్తూ కడు పేదరికంలో పెరిగిన బీరప్ప సాధించిన సివిల్ సర్వీసెస్ కథ కచ్చితంగా వెంట్రుకలు నిక్కబొడిపించేదే.

బై బర్త్ ఓ గొర్ల కాపరి కొడుకై ఉండొచ్చేమోగానీ… బై ఛాయిస్ అతనో సివిల్ సర్వెంట్. కారుమబ్బుల్లోంచి బయటకు చొచ్చుకొచ్చిన ఓ సూర్యకిరణంలా అనిపించడం లేదు బీరప్ప కథ..? అందుకేగా చెప్పుకుంటున్నాం!

మైదాన ప్రాంతాల్లో తండ్రి వెంట గొర్లను మేపుకుంటూ తానూ తిరిగిన బీరప్ప కలలు మాత్రం ఆ గ్రాస్ ల్యాండ్ ను మించి కన్నాడు. కనడమే కాదు.. కలాం చెప్పినట్టు సాకారం చేశాడు. బీరప్పకు తన సోదరుడే బిగ్ ఇన్స్పిరేషన్. తను ఇండియన్ మిలటరీలో పనిచేస్తున్నాడు. తనలాగే దేశానికి సేవ చేసే మంచి ఉద్యోగం సంపాదించాలనే విషయాన్ని సోదరుడికి ఎప్పటికప్పుడూ నూరిపోశాడు. చాలా తక్కువ వనరులున్న కుటుంబం. గొర్లు కాస్తేనేగానీ పూట గడవని బతుకులకు బీరప్ప సోదరుడు ఆర్మీలో పనిచేయడంతో కొద్దో గొప్పో కలిసొచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనే తమ్ముడి చదువుకూ సాయమందించాడు. కావల్సిన పుస్తకాలు స్కూల్, కాలేజ్ ఫీజులు కట్టాడు. మొత్తంగా ఎలాగోలా కష్టపడి బీరప్ప బీటెక్ కంప్లీట్ చేశాడు.

కొంత కాలం ఇండియా పోస్ట్ లో పనిచేశాడు. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నప్పటికీ అది పొట్టకూటికేగానీ… బీరప్ప దృష్టి అప్పటికే సివిల్ సర్వీసెస్ పై పడింది. అలా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ఎలా ప్రిపేర్ కావాలి.. దాని ప్రొసీజర్ ఏంటో పూర్తిగా తెలుసుకున్నాడు. రెండుసార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు. కానీ, ఫెయిల్ అయ్యాడు. Failure is a stepping stone to success అనే నినాదాన్ని నమ్ముకున్నాడు. ఎక్కడ తాను ఫెయిల్ అవుతున్నాడో తరచి తరచి చూసుకున్నాడు. మూడో అటెంప్ట్ చేశాడు. సరిగ్గా మూడురోజుల క్రితం ఏప్రిల్ 22, 2025 యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా 551వ ర్యాంక్ సాధించి.. తన కురుబ సామాజికవర్గం నుంచీ.. అలాగే, తన అమేజ్ గ్రామం నుంచి మొట్టమొదటి సివిల్ సర్వెంట్ అయ్యాడు. బీరప్ప ఇప్పుడు తనకు దక్కిన ర్యాంక్ ప్రకారం ఐపీఎస్ ఆఫీసర్ కాబోతున్నాడు.

పిల్లలు పెరిగి పెద్దైనా వారిపట్ల జాగ్రత్తలు తీసుకుంటూ వారిక్కావల్సినవన్నీ సమకూర్చే తల్లిదండ్రులున్న సమాజంలో… జస్ట్ ఒక అనాగరికుడిలా పెరిగిన బీరప్ప అన్నీ తనకు తానే తెలుసుకునే యత్నం చేశాడు. ప్రభుత్వం నుంచి అందే స్కాలర్ షిప్స్ ను అందుకుంటూ విద్యానార్జించాడు.

బీరప్ప విజయగాధలో తన గ్రామస్థుల సహకారంతో పాటు… కుటుంబీకుల తోడ్పాటూ తనను తీర్చిదిద్దింది. ఇప్పుడు బీరప్ప సివిల్ సర్వెంట్ గా తన ఊరు అమేజ్ కు తిరిగివస్తుంటే.. గ్రామం మొత్తం బ్యాండ్ బాజాతో తీన్మార్ స్టెప్పులతో ఒక ఉత్సవాన్నే నిర్వహించింది. అక్కడి సంబరం అంబరాన్నంటింది. ఇప్పుడెందరో సామాజిక, ఆర్థిక భద్రతలేక.. వివక్షనెదుర్కొనే యువతకు బీరప్ప కథ ఒక దారిదీపంలాంటింది. అలాంటివారికి ప్రభుత్వాలు చేయూతనిస్తే ఎంత శక్తివంతంగా తయారవుతారో చాటిచెప్పేది. ఎంతటి మారుమూల పల్లెలో, ఎంతటి కటిక దరిద్రంలో జన్మించినా.. పట్టుదలతో ప్రయత్నిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగపర్చుకుంటే ఎవ్వరైనా ఏదైనా సాధించొచ్చనేందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే ఇప్పుడు ఎందరో ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా బీరప్ప కథ విని ఉప్పొంగిపోతూ సోషల్ మీడియాలో తన కథను షేర్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles