Enugurthi Sathyam… ✍🏼
…………………………………………………………
ఉత్త ముచ్చట్లు
దేశం ఉలిక్కిపడింది… కశ్మీర్ లో 28 మంది పర్యాటకులను… ఉగ్రవాదులు చంపారు. అందులో 26 మంది భారతీయులు, ఇద్దరు విదేశీ పర్యాటకులు. చంపిన వాళ్లు ఏం సందేశం ఇవ్వదల్చారో స్పష్టంగా అర్థమవుతోంది…? ఎవరు చేశారో తెలుస్తోంది…? ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఆధ్వర్యంలో పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని స్పష్టమైంది. కాబట్టి… ఇది ముమ్మాటికీ పాకిస్థాన్ కేంద్రంగా పథక రచన జరిగిన దాడి అనేది సుస్పష్టం. అంటే… భారతదేశంపై పాకిస్థాన్ దాడి చేసింది. దాడి చేసిన వాళ్లలో ఒకడు… పాకిస్థాన్ మాజీ సైనికుడు అని పలు కథనాలు వస్తున్నాయి.
ఇది దేశానికి చాలా క్లిష్టమైన సమయం. ఇప్పుడు భారతీయులంతా… ఐక్యంగా, సంయమనంతో ఆలోచించాల్సిన సందర్భం. ఎవరూ కూడా ఇందులో రాజకీయ కోణంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. విమర్శించే ఓ టాపిక్ దొరికిందని… కొందరు కేంద్ర ప్రభుత్వంపై, మరికొందరు కేంద్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఎవరికైనా… బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించాలని అనిపిస్తే…. దేశీయ అంశాలపై విమర్శించండి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం, కార్పొరేట్లకు బ్యాంకు రుణాల మాఫీ… వంటి అంశాలు చూసుకోండి. మీ వ్యతిరేకతకు చాటుకోవడానికి అంతర్జాతీయ అంశాలను, ఉగ్రదాడులను విమర్శనాత్మక అంశాలుగా చేసుకోవద్దు. కేంద్రంలో…. బీజేపీ అధికారంలో ఉన్నా…. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా…. అంతర్జాతీయ అంశాల పట్ల… ప్రభుత్వ స్పందన కోసం ప్రజలు నిరీక్షించాలి.

భారతదేశాన్ని నేరుగా ఎదుర్కొనే శక్తి లేని పాకిస్థాన్… ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది… ప్రేరేపిస్తోంది…. ప్రయోగిస్తోంది. మనం సోషల్ మీడియాలో ఏదైనా రాస్తాం. కానీ… అక్కడ సైన్యం ఎంత మథనపడుతున్నదో మనకేం తెలుసు…? ఎప్పటికప్పుడు పహారా కాస్తున్నా… ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు…? ఎవరు ఆశ్రయం ఇచ్చారు…? ఎక్కడ లోపం జరిగింది…? అనే కోణాల్లో వాళ్లు సమీక్షలు చేసుకుంటారు కదా…! నిజంగా సైన్యం మనకోసం…. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద, -20 డిగ్రీల సెల్సియస్ శీతోష్ణస్థితుల్లో కాపలా కాస్తోంది. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే…. సోషల్ మీడియాలో ఏదో రాస్తున్నామంటే…. సైన్యం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండడమే కారణం. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పాలిస్తున్నా… సైన్యం చేసే పనిలో నిబద్ధత అలాగే ఉంటుంది. కాకపోతే… ప్రభుత్వాల పనితీరు, అంతర్జాతీయ ఎజెండా… సైనిక వ్యూహాలు ఒక్కోసారి స్వల్పంగా మారవచ్చు. అయితే సైన్యం ఎంత అలెర్ట్ గా ఉన్నా కూడా….. దాడి జరిగిందీ అంటే… కొత్త సవాళ్లకు తగ్గట్టుగా సైన్యం ఇంకా ఏవో కొత్త జాగ్రత్తలు తీసుకుంటది. ఈ లోపు… మనమేదేదో అనేయడం…. తీర్పులు ఇచ్చేయడం…. ఎందుకు…? అది సరిహద్దుకు దగ్గర ఉన్న ప్రాంతం కావడం, స్థానికంగా కొందరి మద్దతు ఉండడం… దాడికి కారణమని అర్థమవుతోంది.
ఇది…. సరిహద్దులో జరిగిన చిన్న అలజడి కాదు. ఉగ్రవాదుల కదలికలు అసలే కాదు. మన దేశంలోకి వచ్చి, మనమీద దాడి చేసి పోగలరని…. ముష్కరులు ఓ సందేశం ఇచ్చారు. దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉంటుంది. పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నదని… అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ సైన్యమే… సరిహద్దులో ముష్కరులను భారతదేశంలోకి పంపుతున్నది. కానీ… మనం యుద్ధం కంటే శాంతికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం. పాకిస్థాన్ ఎంత కవ్విస్తున్నా…. సంయమనంతో వ్యవహరిస్తున్నాం. ఇది.. బీజేపీ విధానంలోనో, కాంగ్రెస్ పాలసీలోనో భాగం కాదు… ఈ దేశం విధానం. మన సైన్యానికి… పాకిస్థాన్ సైన్యం ఎదురుగా నిలిస్తే…. పాకిస్థాన్ సంగతి అర్థమవుతుంది. మన సైన్యం అంతా కలిసి…. ఒక్క రౌండ్ ఫైరింగ్ చేస్తే…. పాకిస్థాన్ సైన్యం కాదు కదా… అసలు పాకిస్థానే ఉండదు.
దాడిలో మతం కోణం లేదా అంటే… కచ్చితంగా ఉంది. నీది ఏ మతం…? ఐడీ కార్డు చూపించూ… అంటూ… ప్యాంట్లు విప్పి చూసి మరీ చంపితే… మతం కోణాన్ని ఎలా కొట్టి పారేయగలం…! అయితే… పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఇటీవల మాట్లాడుతూ…. మత ప్రసంగం చేశాడు. పాకిస్థాన్ ఇస్లామిక్ దేశం. అది సెక్యులర్ దేశం కాదు. అందుకే… ఆ ఆర్మీ చీఫ్ అలా మాట్లాడాడు. అదొక అనాగరిక దేశం. అతి త్వరలో అఫ్గానిస్థాన్ తరహాలో… తాలిబాన్ పాలన వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆ దేశంలో తయారు చేయబడుతున్నది…. ఇస్లామిక్ టెర్రరిజమే. ఉగ్రవాదం…. కోసం వాళ్లు మతాన్ని ఆయుధంగా వాడుతున్నారు. అందుకే…. చొరబడ్డవాళ్లు మతం అడిగి చంపారు.
ఇన్నాళ్లు… ఉగ్రవాదానికి మతం ఉండదని… భారతీయులను మూకుమ్మడిగా చంపడమే ఉగ్రవాదుల టార్గెట్ అని కొందరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు.. ఒక మతం వారిని తప్ప…. అందరినీ చంపుతాం అనే కొత్త ఎత్తుగడలతో వచ్చారు. ఇందులో ఏదో మర్మం దాగి ఉంటుంది. దీన్ని… మన సైన్యం, కేంద్ర ప్రభుత్వం హ్యాండిల్ చేస్తాయని… నమ్మకంతో ఉందాం. ఉగ్రవాదుల టార్గెట్ నాన్ ముస్లింలు అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ దాడిలోని… మృతుల్లో… ఇద్దరు విదేశీయులైన క్రైస్తవులు ఉన్నారు. హంతకుల మతానికే చెందిన ఓ ముస్లిం టూరిస్ట్ ఉన్నాడు. ఉగ్రవాదులతో పోరాడి చనిపోయిన స్థానిక ముస్లిం ఉన్నాడు. తాను ముస్లిం కాబట్టి… తనను చంపకుండా వదిలేసే అవకాశం ఉన్నా… ఓ ముస్లిం యువకుడు… ఇతరులను కాపాడే ప్రయత్నంలో చనిపోయాడు. ఉగ్రవాదానికి మతం ఉంది… కానీ… మానవత్వానికి మతం లేదు. అతడు… మానవీయతకు, భారతీయతకు నిదర్శనం.
కానీ… అదే కశ్మీర్ లో… ఉగ్రవాదులు రెచ్చిపోవడం ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే… అక్కడ ఆశ్రయం కల్పిస్తున్న వాళ్లు ఉన్నారు. స్థానికులే కొందరు ఉగ్రవాదులుగా మారుతున్నారు. అంతెందుకు… హైదరాబాద్ లో ఆశ్రయం పొందినవాళ్లు లేరా..? అప్పుడప్పుడు ఎన్ఐఏ వచ్చి… పట్టుకపోతలేదా…? హైదరాబాద్ లోనే… కొందరు… ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు పెట్టుకున్న వాళ్లు లేరా..? ఇండియా మీద పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే… సంబరాలు చేసుకున్నోళ్లు లేరా…? ఉగ్రవాదులకు… పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ లో… కొందరి మద్దతు ఉంది. ఈ దేశంలో పుట్టిన భత్కల్ అనేటోడు… ఉగ్రవాదిగా మారలేదా…? దిల్షుఖ్ నగర్ దాడి చేసింది వాడే కదా. అలాంటి వాళ్లు…. ఓ అమానవీయమైన ఐడియాలజీకి ప్రభావితం అయినవాళ్లు. వాళ్లను నిజమైన ముస్లింలు ఎవరూ… తమ వారు అని చెప్పుకోరు.
భారతదేశంపై పాకిస్థాన్ ప్రయోగిస్తోంది…. ముమ్మాటికీ ఇస్లామిక్ టెర్రరిజమే. కానీ… ఇస్లాం పాటించే ప్రతీ ఒక్కరినీ టెర్రరిస్టుగా చూసే విద్వేషం మంచి పద్ధతి కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇస్లాం ఉంది. అందులో పాకిస్థాన్ చిన్న భూభాగం. ఇప్పుడు చేసిన దాడిలో… ముస్లిమేతరులను వెతికి మరీ చంపి… ముస్లింలను వదిలేసి… భారతదేశంలోని ముస్లింలను…. తమవారిగా చెప్పుకునేందుకు ఉగ్రవాదులు కుట్ర చేశారని అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో అంతర్గతంగా అలజడి సృష్టించే కుట్ర కూడా ఉగ్రవాదుల వ్యూహం అయ్యుంటుంది. కశ్మీర్ లో కొందరిని చంపీ… ఈ దేశంలోని ముస్లింలను తామేమీ చేయలేదని… 140 కోట్ల మందిలో ఓ విభజన రేఖ గీసే ప్రయత్నం చేసి పోయారు. ప్రజలు కలిసిమెలిసి బతకకుండా… అభివృద్ధి చెందకుండా… భారతదేశానికి బలమైన భిన్నత్వంలో ఏకత్వంపై అగ్గిరాజేసి పోయారు. ఆ కుట్రలో… ఆ ఉచ్చులో పడి… ఇప్పుడు మనదేశంలో మనం ఐక్యత కోల్పోతే….. ఉగ్రవాదుల వ్యూహం ఫలిస్తుంది. అలా జరగనివ్వొద్దు. మన భారత దేశీయంగా ప్రజల మధ్య పరస్పర విద్వేషం రెచ్చగొట్టుకునేలా వ్యవహరించకూడదు.
కచ్చితంగా పాకిస్థాన్ ను… అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టాల్సిందే. భారతదేశం ఐక్యతకు విఘాతం కలిగించే అంతర్జాతీయ కుట్రలపై కేంద్రం తగిన రీతిలో స్పందిస్తుందని ఆశిద్దాం. సరిహద్దు వెంబడి… పాకిస్థాన్ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిబిరాలను కూకటివేళ్లతో పెకిలించి… నామరూపాలు లేకుండా చేస్తే….. పాకిస్థాన్ కు గట్టి సమాధానం చెప్పినట్టు అవుతుంది. పనిలో పనిగా… ఈ దేశంలో ఉంటూ…. ఉగ్రవాదులకు ఆశ్రమిచ్చిన వాళ్లను… సహకరించినవాళ్లను.. ఏమేం చేయొచ్చో… చేయాలి..! ఈ దుఃఖంలో. సంమయనం కోల్పోవద్దు. మనుషులను మతాలుగా విభజించే వారి కుట్రలకు బలికావొద్దు. మనమంతా భారతీయులం.. ఈ బాధను కలిసి పంచుకుందాం… సంక్షోభాన్ని కలిసే ఎదురుకొందాం. మనుషులుగా.. భారతీయులుగా ఒక్కటిగా నిలబడుదాం. జై హింద్.



