నోటుకూ, జేబుకూ మధ్యనున్న బంధం లాంటిది.. పిసినారిగా కోట పరకాయ ప్రవేశం!

Haribabu maddukuri…. ✍🏼

ఎస్వీఆర్, కైకాల స్థాయి నటులు.. ఆ మహానటులిద్దర్నీ చిన్నబుచ్చడం కాదుగానీ.. ఈయన వాళ్ళకంటే ఇంకొక్క అడుగు ముందుకేసి తెలుగులో అన్ని యాసలనీ పట్టుకోవడమేగాక, వేరెవరూ ఈయనంత సమర్ధవంతంగా పట్టుకోలేరని పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు..

మా తరం చూసిన నటుల్లో తెలుగుతెరకు లభించిన గొప్ప వరం కోట శ్రీనివాసరావుగారంటే యే మాత్రం సందేహం అక్కర్లేదు..

తెర మీద చూస్తే మనింట్లో వ్యక్తి ప్రవర్తిస్తున్నట్టో లేక మనతో మాట్లాడుతున్నట్టో ఉంటుంది తప్ప నటిస్తున్నట్టుండదు..

శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో మోకాళ్ళదాకా నిక్కరేసుకుని ఊరూరా తిరిగే ఎల్ల పాపారావు ర్రే….య్.. అంటూ అదిలిస్తుంటే మనకెందుకో కితకితలు పెట్టినట్టు ఉండదా..??

యాండే…..య్ అని ఎటకారంగా పంచులేసే పెద్దమనిషిని జూస్తే అమ్మహా కంకహా ఐపోదా..??

ఈడెవండీ బాబో అంటూ నోట్లో చుట్టతో నెత్తిమీద చేతులేసుకుని విసుక్కునే శత్రువు, కళకి, కలకి తేడా చెప్పే ‘సురభి’ సుబ్రహ్మణ్యంగారు, మహేష్తో బేరాలాడే బాజిరెడ్డి, ఇడియట్ చంటిగాడి భవిష్యత్ కోసం కన్నీళ్లు పెట్టుకునే తండ్రి వెంకటస్వామి, మామగారు సినిమాలో బావమరిదితో బయటకి గెంటించుకుని అరుగు మీద సెటిలయ్యి బిచ్చగాడితో పొద్దుపుచ్చే మామగారు పోతురాజు, (కోట −‌ బాబూమోహన్‌.‌.‌.‌ ఏం కాంబి‌నే‌షనండీ! పాయా వంగడం, కోట కిక్కడం −‌ మనం ఫక్కుమనడం.‌.‌) ముఠా తగాదాలకి కారణమయ్యే గాయం గురునారాయణ్, జనాలు పెద్దగా గుర్తించని పంజరంలో విలను.. వీళ్లంతా ఎవరు బాబూ ఎవరూ..?? కోట గారే కదండే..

ఇయ్యన్నీ పక్కనబెడదామండీ..

వెంకటేష్ నటించిన గణేష్ లో ఆరోగ్యశాఖ మంత్రి సాంబశివుడు లా భయపెట్టినా
ఆడవారి మాటలకు అర్ధాలే వేరులేలో అదే గణేష్ అనబడే వెంకటేష్ కి తండ్రిలా ఏడిపించినా అది కోటగారే కదా.. సత్యంలో ఒద్దికైన అంకిత, బొమ్మరిల్లు అల్లరి హాసిని రెండూ జెన్నీయే.. ఒప్పుకుంటాం.. కాని ఇద్దరికీ బాధ్యతాయుతమైన తండ్రి కోటనే..!!

ఇక అసలు సిసలువైన డబ్బే పరమావధిగా బతికే ఆ నలుగురు కోటయ్య, కోడల్ని వేధించే పిసినారి “ఆమె” మామ శ్రీనివాసరావు, ఇక ఎవర్గ్రీన్ అహనాపెళ్ళంట పీనాసి లక్ష్మీపతి..

ఇయ్యన్నీ ఏంటి మేష్టారూ.. మిమ్మల్నే..!!

అసలు ఆ మాటకొస్తే పిసినారి పాత్రలకి, కోటగారికి ఉన్న సంబంధం నోటుకి, జేబుకి మధ్య సంబంధం లాంటిది.. రెండూ కలిస్తే ఆ పాత్ర లెవలే వేరూ..!! ఈ పాత్రల్ని కోటగారితో వేయించిన జంధ్యాల గారి తర్వాత కోడిరామకృష్ణగారు, ఈవీవీగారు వాడుకున్నట్టు ఇంకెవరూ వాడుకోలేదేమో అనిపిస్తుంది ఆ క్యారెక్టర్లని చూస్తే.. కానీ ఆయా దర్శకులు తెలుగుతెరని తొందరగా వదిలెళ్లిపోవడం కోటగారి స్టైల్లోనే చెప్పాలంటే “ఏం చేస్తాం.. బ్యాడ్ టైం..!!”

ఇన్ని కాదండే.. సినిమా ఏదైనా సీన్ ఏదైనా దర్శకుడెవరైనాగానీ.. రౌద్రం, ఆవేశం, హాస్యం, మందహాసం, మానవత్వం, పెద్దరికం, పేథాసు ఏదైనా సరే అవలీలగా పలికించేస్తారు కాబట్టే కోటలాంటి కీర్తి మాత్రం ‘కోట’గట్టుకుని కూర్చుంది..

ఒక్కముక్కలో జెప్పాలంటే..
.
.
.
.
వి…ల…క్ష…ణం అనే మాట గనుక ఇస్త్రీచొక్కా తొడుక్కుని, పంచె కట్టుకొస్తే ఎలా ఉంటుందో అదీ కోటగారు..!!

ఆఖరిగా, ఆయన ట్రేడ్ మార్క్ నవ్వుని మనకి మిగిల్చి వెళ్ళిపోయిన కోటగారికి ఘననివాళులతో.. 🙏

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles