కంటికింపుగా కనిపిస్తుందని కాలు పెడితే… కాటు తప్పదు: అదో ప్రమాదకర దీవి!

పామంటేనే భయం. ఆ భయానికి కారణం విషం. అంతకుమించి దూసుకువచ్చే దాని రూపం. కానీ, పాములను చూడాలని.. అది బుస కొడితే చూసి తరించాలనే కోరికా కొందరికుండొచ్చు. అలా అని పాములకే ప్రత్యేకమైన ఆ ఐలాండ్ కు వెళ్లామనుకోండి.. తిరిగి రావడం కల్లే అంటుంటారు. చూడటానికీ ఓ పాము రూపాన్ని పోలి ఉండే ఆ దీవి గురించి కాస్త తెలుసుకుందాం రండి!

ఆ దీవి పేరే స్నేక్ ఐల్యాండ్.

బ్రెజిల్ లోని సావో పాలో తీరానికి 93 కిలోమీటర్ల దూరంలో ఇల్హా డా క్యూమాడా గ్రాండే అనే ఓ దీవి ఉంది. దాన్నే స్నేక్ ఐల్యాండ్ అని కూడా పిలుస్తుంటారు. అట్లాంటిక్ మహాసముద్రం చుట్టూ సుందరమైన వాతావరణంలో ఉండే ఆ ద్వీపాన్ని సందర్శించాలనుకోవడం ప్రమాదంతో కూడుకుందట. అందుకే, ఆ ఐల్యాండ్ కు మార్గాన్నీ మూసేశారు. వేలాది పాములు, విషపురుగులకు కేరాఫ్ ఆ స్నేక్ ఐల్యాండ్. అందుకే దాన్ని ప్రాణాంతక ప్రదేశంగా పరిగణించి అక్కడికి సామాన్యులెవ్వరూ వెళ్లకుండా దారులన్నీ మూసేశారు.

అక్కడెలాంటి పాములుంటాయి..?

గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ పాములకు ఇది నివాస స్థలం. అత్యంత విషపూరితమైన పాము ఇది. దాని కాటుకు సరిగ్గా గంటలోపు మనిషికి మృత్యువు ఖాయం. అంతర్గత రక్తస్రావం, మూత్రపిండాల వైఫల్యం, మెదట్లో రక్తస్రావం వంటివాటితో మనిషి ఇక ఔట్.

అడుగడుగునా ఓ పాము!

నమ్మశక్యం కాని రీతిలో ఇక్కడ పాముల సాంద్రత కనిపిస్తుంది. 106 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో చదరపు మీటర్ కు ఒక పాముంటుందని ఓ అంచనా. అంటే అడవంతా వేల సంఖ్యలో పాములు తిరుగుతాయన్నట్టు. వాటిలో ఒక్కదాన్నైనా ఎదుర్కోకుండా ఆ ద్వీపాన్ని సందర్శించడం అసాధ్యం.

ఒకవేళ అక్కడికెవరైనా నిపుణులు ఒకవేళ ఏదైనా రీసెర్చ్ కు వెళ్లాలనుకున్నా.. సొంత వైద్య సామాగ్రి తప్పనిసరి. అలాగే, పాముకాట్ల విషయంలో సుశిక్షితులైన వైద్య సహాయకులవసరం అంతకంటే తప్పనిసరి. ఎందుకంటే ఆసుపత్రులు, అత్యవసర సేవలు వెంటనే అందే అవకాశముండని దీవి అది.

స్నేక్ ఐల్యాండ్ ను నిషేధించిన బ్రెజిల్!

అక్కడికెళ్లాలనుకునే మనుషుల ప్రాణాలనైనా, అంతరించిపోతున్న వివిధ రకాల పాముల జాతులనైనా రక్షించాలంటే అక్కడికి మానవ ప్రయాణాన్ని నిషేధించడమొక్కటే మార్గమని భావించిన బ్రెజిల్ ప్రభుత్వం అక్కడికి ఎవ్వరినీ వెళ్లకుండా అనుమతులను నిలిపేసింది. ఒకవేళ పాములు, ఇతర జీవజాలంపై పరిశోధించే శాస్త్రవేత్తలెవరైనా అక్కడికెళ్లి సందర్శించాలనుకుంటే వారు తప్పకుండా ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, కఠినమైన ప్రోటోకాల్ మధ్య ఆ ప్రాంతాన్ని సందర్శించేలా ఏర్పాట్లుంటాయి.

ప్రాణాంతక ద్వీపం స్నేక్ ఐల్యాండ్!

స్నేక్ ఐలాండ్ ఎంత ప్రాణాంతకమైందో ఇక్కడ గతంలో జరిగిన సంఘటనలు చెబుతాయి. లైట్ హౌజ్ వద్ద పనిచేసే ఓ కీపర్, అతడి కుటుంబీకులు అనేక పాము కాట్లకు గురై మరణించిన ఘటనతో పాటు.. పలువురు మత్స్యకారులు ఈ ద్వీపం వైపు వెళ్లి మృత్యువాత పడ్డట్టు నివేదికలు వెల్లడించాయి.

ఆతిథ్యానికి ఏమాత్రం అనువైన ప్రదేశం కాని ఐల్యాండ్ ఇది!

ముఖ్యంగా ఇక్కడున్న స్నేక్స్ సంఖ్యతో ఇక్కడికి రావాలంటేనే భయపడతారు. ఇలాంటి చోట కనీసం మంచినీటి సౌకర్యం కూడా అందుబాటులో లేదు. పైగా ఇక్కడ అడుగడుగునా కనిపించే పాములు మానవ నివాసాన్ని అసాధ్యంగా మార్చేశాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన లైట్ హౌజ్ కూడా ఇప్పుడు పూర్తిగా ఆటోమేటెడ్ గా నడుస్తుంది. ఇక రాత్రిపూటనైతే నిర్మానుష్యానికి కేరాఫ్ గా.. భయానికి పర్యాయపదంలా ఈ దీవి దర్శనమిస్తుందట.

అత్యంత విషపూరితమైన పాముల అడ్డా!

గోల్డెన్ లాన్స్ హెడ్ విషం… ఇతర పాముల కంటే ఐదు రెట్లెక్కువట. అయితే, ఈ పాములు కూడా ఇప్పుడు అంతరించిపోయే జాబితాలోకి వచ్చిపడ్డాయి. ఈ పాము కేవలం బ్రెజిల్ లోని ఈ స్నేక్ ఐల్యాండ్ లో మాత్రమే కనిపిస్తుందట. అయితే, అన్ని జంతువులకంటే మనిషి ఇంకా విషపురుగు. అందుకే, ఇక్కడి ఐల్యాండ్ లోని పాములు కూడా ఇప్పుడు దోపిడీకి గురవుతున్నాయట. ఈ అరుదైన జాతి పాములను వన్యప్రాణుల వేటగాళ్లు అక్రమ రవాణా చేస్తూ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే ఒక్కో పాముకు కనీసం పదివేల డాలర్లు పలుకుతుందంట.

వలసపక్షులకూ ఇక్కడి పాములతో ప్రాణాంతకం!

సమ్మర్ సమయంలో ముఖ్యంగా ఇక్కడి వలస వచ్చే పక్షుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వేటగాళ్లు కనిపించని ఓ నిర్మానుష్య ఒంటరి దీవి కావడంతో వచ్చే పక్షులు ఇక్కడి గోల్డెన్ లాన్స్ హెడ్ బారిన పడతాయట.

దీవి చూస్తే సౌందర్యం.. దిగి చూస్తే ప్రమాదం!

పచ్చని ఉష్ణమండల వృక్షసంపదతో, రాతి కొండలతో, కలుషితం కాని సముద్ర నీటితో ప్రకృతి అందాలకు కేరాఫ్ లా కనిపించే ఈ సౌందర్యదీవిలో అడుగుపెడితే మాత్రం ప్రమాదమే. ప్రపంచంలోనే ఓ మర్మమైన ప్రాంతంగా.. నిషేధిత సహజ సౌందర్య అద్భుతంగా మాత్రమే ఇప్పుడీదీవి మిగిలిపోయింది.

కళ్లకింపుగా చూసేందుకు ఆకట్టుకునే ఈ స్నేక్ ఐల్యాండ్ పర్యాటకులకు ఏమాత్రం సురక్షితం కాని ప్రమాద ప్రాంతం. కొన్నింటిని చూసేవరకే ఆస్వాదించాలిగానీ… ఎందుకు దగ్గరకు పోవద్దో చెప్పడానికి ఈ స్నేక్ ఐల్యాండ్ ఓ ఉదాహరణ అంటుంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles