ఓ మనిషి జీవన గమనం ఎలా ప్రారంభమై.. ఎటువంటి మలుపులు తీసుకుంటుందో ఎవరూహించెదరు..? అలాంటి ఊహించని మలుపులతో ఓ చెరకు రసం అమ్మకందారు… ఇప్పుడు బహుదూరపు బాటసారై పది దేశాలను చుట్టొచ్చాడు. నెక్స్ట్ ట్రిప్ చైనాకేనంటున్న ఆ చిన్న జ్యూస్ స్టాల్ ఓనర్ కథ ఆసక్తికరం.
కేరళలోని కన్నూరు జవహర్ మున్సిపల్ స్టేడియం బయట ఉన్న చిన్న స్టాల్ వీ.పీ. హాషీంది. చిన్న జ్యూస్ స్టాల్ పెట్టుకుని బతుకుతున్న ఆ జీవనచిత్రంలో… ఆయన ఎన్నో చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను చుట్టివచ్చిన పర్యాటకుడిగా గుర్తింపు పొంది వార్తల్లోకెక్కారు. పెద్ద కలల కోసం పెద్ద సంపదే ఉండాల్సిన అవసరమూ లేదనేది ఇప్పుడు పది దేశాలు చుట్టివచ్చిన హాషీం కథ చెబుతోంది. అదెలాగో ఓసారి చదివేద్దాం.

హాషీం మూడు దశాబ్దాలుగా పప్పినిస్సేరీలో చెరకు రసం అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. కేరళ సరిహద్దులు దాటి ఆవలి ప్రపంచాన్ని చూసింది లేదు. కానీ, ఇప్పుడు 67 ఏళ్ల వయస్సుకొచ్చిన హాషీం పది దేశాలు చుట్టివచ్చి… మళ్లీ చైనా ప్రయాణానికి సిద్ధమైన బహుదూరపు బాటసారి.
చెరకు రసం అమ్ముతూ సంపాదించిన హాషీం విలాసాలకేనాడూ ఖర్చు చేయకుండా ఆ డబ్బును పొదుపు చేశాడు. తనకున్న అనుభవాన్ని రంగరించి ఆ డబ్బును పెట్టుబడులుగా మల్చి.. మరింత సంపాదించాడు. పెద్దమొత్తంలో అత్యాశకు పోకుండా డబ్బును ఎక్కడ పెడితే సేఫ్ అనేది తెలిసి.. ఉన్నంతలో బాగుండేలా తన జీవితాన్ని, కుటుంబాన్ని నడిపిస్తున్నాడు.
ఓసారి తన అన్నతో మాట్లాడినప్పుడు జీవితంలో కొత్త కొత్త ప్రాంతాలను తిరిగితే మరిన్ని కొత్త అనుభవాలు సంపాదించొచ్చనీ… ఆయా ప్రాంతాల సంస్కృతులు, సాంప్రదాయాలూ తెలుసుకోవచ్చనీ.. అక్కడి ప్రజల జీవన స్థితిగతులు తెలుసుకోవచ్చనీ చెప్పాడు. అప్పటి నుంచీ హాషీంకు ప్రయాణాలపైన మోజు ఏర్పడింది.
2012లో హాషీం పర్యటనలకు శ్రీకారం చుట్టాడు. తొలిసారి ఢిల్లీకి వెళ్లాడు. జూన్, జూలై నెలలు చెరకు రసం వ్యాపారానికి ఆఫ్-సీజన్ కావడంతో సాధారణంగా ఇంట్లోనే ఉండేవాడు. అన్నతో జరిగిన ఓ సాధారణ సంభాషణ ఆయన జీవితాన్నే మార్చేసింది. ప్రయాణం మనసు విప్పి విస్తృతం చేస్తుందని, జీవితానికి కొత్త అర్థం ఇస్తుందన్న అన్న మాటలతో ప్రభావితమైన హాషీం ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, ఈజిప్ట్, ఇరాక్, మలేషియా, థాయిలాండ్, అజర్బైజాన్, టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలన్నీ చుట్టివచ్చాడు. ఇటీవలే హాషీం వెళ్లివచ్చిన చివరి టూర్ టర్కీ ఎంతో అందంగా ఉందంటున్నాడు.
హాషీం తదుపరి గమ్యం చైనా!
హాషీం ఇక సరిపోయింది బాగానే తిరిగాం కదా అనుకుని సంతృప్తి చెందటం లేదు. రాబోయే నెలలో తన భార్య, తన అన్నతో కలిసి చైనా టూర్ కు ప్లాన్ చేశాడు. మొదటిసారి కేరళను వదిలి బయటకెళ్లినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో.. ఇప్పటికీ అదే ఉత్సాహం తనలో ఉందంటున్నాడు.
హాసీం యాత్రల్లో సహచరిణిగా భార్య!
హాషీం ఇప్పటివరకూ ప్రయాణించిన ప్రతీ పర్యాటక ప్రదేశానికీ ఏనాడూ తాను ఒంటరిగా వెళ్లలేదు. భార్య హసీనా, హాహీం వెంట ఉండాల్సిందే. అలా ప్రతీ అంతర్జాతీయ ప్రయాణంలోనూ భార్యనూ భాగస్వామిని చేసుకుని దేశాలు చుట్టివస్తున్నాడు. మధ్యప్రాచ్య నగరాల నుంచీ ఆగ్నేయాసియా దేశాల వరకూ హాషీం దంపతులు కలిసి ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు ధనికులకు మాత్రమేనని.. పేద, మధ్యతరగతికి కలలేనన్న స్టీరియోటైపిక్ ఆలోచనలను బ్రేకే చేసేశాడు హాషీం.
తన తొలి ప్రయాణం ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత హాషీం ఏనాడూ తన ప్రయాణాలను ఆపాలనుకోలేదు. భారత్ అంతటా తిరిగిన హాషీం.. ఆ తర్వాత విదేశాల బాట పట్టాడు. అదీ తన చిన్న జ్యూస్ స్టాల్ ఆదాయంతోనే. హాషీం కథలో డబ్బును పొదుపు చేస్తే.. దాన్ని తనకు పట్టున్న అంశాల్లో పెట్టుబడిగా మార్చి ఆదాయవనరుగా చేసుకుంటే.. ఎలా ఆనందంగా బతుకొచ్చో తెలుసుకోవచ్చు.
ఎందుకు ఇంటర్నెట్ ను హాషీం వీ.పీ కథ ఆకట్టుకుంది..?
అంతర్జాతీయ ప్రయాణాలు కేవలం ధనికులకు మాత్రమేనన్న భావన ఉన్న నేపథ్యంలో.. హాషీం ప్రయాణం క్రమశిక్షణ, అభిరుచి, పట్టుదల మనిషిని ఎంత దూరం తీసుకెళ్లగలవో చూపించింది. కన్నూర్ వీధుల నుంచి పది ప్రపంచ దేశాలు చుట్టివచ్చే క్రమంలో వయస్సూ ఏమాత్రం అడ్డుకాదనీ నిరూపించింది. అందుకే, హాషీం స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ లో నెటిజన్స్ అప్లాజ్ అందుకుంటోంది.


