స్వామి వివేకానంద పేరు వినగానే భారతీయులకు మొట్టమొదట స్ఫురించేది ఆయన షికాగో పర్యటన. మతతత్వం, మతోన్మాదం, దాన్నుంచి పుట్టుకొచ్చిన భయంకరమైన వారసత్వమే లేకుంటే.. ఈ పుడమి ఇంకా మరెంతో అందంగా ఉండేదంటూ చెప్పిన మాటలు నాటి సభను ఆలోచింపజేశాయి. హింసతో రక్తసిక్తమైన భూమి.. నాగరికతను ఎలా ధ్వంసం చేస్తుంది.. ఆ హింస, రక్తపాతానికి తావు లేకుంటే.. ఈ ప్రపంచం అభివృద్ధి నమూనా మరోలా ఉండేదనే విషయాన్నీ.. నరేంద్రుడు చెప్పిన విధానం ఆ సభను మరింత ప్రభావితం చేసింది. అందుకు 1893 సెప్టెంబర్ 11న షికాగో లోని ఆర్ట్ ఇనిస్టిట్యూట్ వేదికైన విషయం తెలిసిందే. ప్రపంచ యవనికపై భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన సభ అది. అయితే, ఆ వివేకానందుడి షికాగో యాత్రకు స్ఫూర్తెవరూ.. అసలా పర్యటనకు స్పాన్సరెవరూ..?
వివేకానందుండి పుట్టినరోజున ఓసారి చెప్పుకోవాల్సిన ముచ్చట ఇది!

ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప బంధం స్నేహబంధమేనంటారు. భార్య, భర్త, తల్లి, పిల్లలు, ఇతర బంధువులతో కూడా చెప్పుకోలేనివి స్నేహితులతో పంచుకున్నప్పుడు కాసింత ఆసరా, లేదంటే కనీసం ఊరటైనా లభిస్తుంటుంది. అలాంటి ఓ ఫ్రెండే వివేకానందుడి షికాగో పర్యటన వెనకున్నారు. ఆయనే రాజా అజిత్ సింగ్ బహదూర్.
రాజస్థాన్ లో జుంజుని జిల్లాలోని ఖేత్రీ సంస్థాన పాలకుడు అజిత్ సింగ్ బహదూర్. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వివేకానందుడి షికాగో చారిత్రాత్మక ప్రసంగం వెనుక.. అజిత్ సింగ్ బహదూర్, ఆయన పాలించిన ఖేత్రీ రాజభవన సంస్థానం పోషించిన పాత్ర ఎనలేనిదనేది బహు కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం.
సుమారు 20 ఏళ్ల పాటు షెకావత్ రాజవంశాన్నీ, ఖేత్రీ సంస్థానాన్ని పాలించిన అజిత్ సింగ్ బహదూర్… 1888లో మౌంట్ అబూలో వివేకానందుణ్ని కలిసిన తర్వాత ప్రభావితుడయ్యాడు. వారిద్దరి మధ్యా స్నేహం చిగురించింది. వారిద్దరి మధ్యా ఆధ్యాత్మిక అంశాలు, యోగా, ప్రపంచశాంతికి అవసరమయ్యే సార్వత్రిక అంశాలు చర్చకొచ్చాయి. అవే.. వారిద్దరినీ ప్రాణస్నేహితులుగా మార్చేశాయి.
అసలు తలపాగా లేకుండా ఊహించుకోలేని వివేకానందుడి పాగా వెనుకాల కూడా రాజా అజిత్ సింగ్ బహదూరే ప్రేరణ. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో దుమ్మూ, ధూళి నుంచి కేశాలను రక్షించుకునేందుకు.. బహదూరే వివేకానందుడికి ఆ తలపాగా ఇచ్చారు. అది ఆ తర్వాత కాలమంతా వివేకానందుడి సంప్రదాయ వస్త్రధారణలో ఓ భాగమైపోయింది. ఇవన్నీ చతుర్వేది బద్రీనాథ్ తాను రాసిన ‘లివింగ్ వేదాంత’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు. అసలు నరేంద్రుడి పేరు వివేకానందుడిగా మార్చింది కూడా రాజా అజిత్ సింగ్ బహదూరేననీ ఆ పుస్తకమే పేర్కొంది.
ఓ మాంక్, ఒక మహారాజ్ మధ్య ఏర్పడ్డ ఆ మైత్రీబంధం.. వారిని ప్రాణ స్నేహితులుగా మార్చడం విశేషం. ఖేత్రీ సంస్థానంలో ఒక నాల్గు నెలల పాటు వివేకానందుడు ఉండటంతో.. వారి స్నేహం మరింత పరిమళించింది. తర్వాత వారు కలిసిందీ తక్కువే అయినప్పటికీ.. వారి మధ్య విడదీయరాని ఆత్మీయ స్నేహబంధం లేఖల రూపంలో సాగింది.
మీరే నా జీవితంలో నన్ను అత్యంత ప్రభావితం చేసిన ఏకైక స్నేహితుడంటూ అజిత్ సింగ్ బహదూర్ రాసిన లేఖలు వారి మైత్రిని తెలియబర్చేవి. మీ దోస్తానా నేనెప్పటికీ మరవలేనిదంటూ స్వామి వివేకానంద కూడా అజిత్ సింగ్ బహదూర్ కు స్వీయ దస్తూరితో లేఖలు రాశాడు. ఇప్పటికీ పశ్చిమబెంగాల్ బేలూర్ లోని రామకృష్ణ మిషన్ తో పాటు.. ఖేత్రీలో ఏర్పాటు చేసిన మ్యూజియంలోనూ ఆ లేఖలు దర్శనమిస్తుంటాయి. షికాగో పర్యటననంతరం భరతజాతి ఖ్యాతిని దిగంతాలకు చాటిన వివేకానందుడి ప్రసంగాన్ని కొనియాడుతూ అజిత్ సింగ్ బహదూర్ లేఖ రాశారు. అందుకు కృతజ్ఞతగా తానక్కడికి వెళ్లేందుకు అజిత్ సింగ్ బహదూరే కారణమని.. ఆయన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ వివేకానందుడూ ప్రతి రాసిన లేఖలు రాశారు. ఆనాటి ఆ లేఖలు వారి దోస్తానాకు ప్రతీకలు.
1898 సెప్టెంబర్, అక్టోబర్ మధ్య వివేకానందుడి ఆరోగ్యం దెబ్బ తింది. ఆ సమయంలో అజిత్ సింగ్ ఉభయకుశలోపరి అంటూ వివేకానందుడి ఆరోగ్యాన్ని ఆరా తీస్తూ రాసిన లేఖలు.. వారిద్దరి మధ్య వ్యక్తిగత స్నేహాన్ని రుజువు చేసేవి. తనకు అమెరికాలో స్నేహితులున్నారు.. వారూ తానడిగితే సాయం చేయడానికీ సిద్ధంగా ఉంటారు.. కానీ, నేను వారినడగడానికి సిగ్గుపడతాను.. కానీ, మిమ్మల్ని అడగ్గలనంటూ తను అనారోగ్యంపాలైన రోజుల్లో వివేకానందుడు రాజా అజిత్ సింగ్ కు రాసిన లేఖ వారి మధ్య ఉన్న స్నేహబంధంలోని విశ్వాసాన్ని చూపెట్టేది.
అనారోగ్యం వల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేనేవరినైనా అడుక్కోవాల్సి వస్తే… అది మీరేనంటూ అజిత్ సింగ్ కు వివేకానందుడు రాసిన లేఖతో చలించిపోయిన రాజు.. వెంటనే అప్పట్లో 500 రూపాయల మనియార్డర్ చేశారట. అంతేకాదు వివేకానందుడి తల్లి ఆరోగ్యం క్షీణిస్తే కూడా రాజా అజిత్ సింగ్ బహదూరే.. నెలకు వంద రూపాయల స్టైఫండ్ పంపించారట. అలా మాంక్ వివేకానంద, కింగ్ అజిత్ సింగ్ బహదూర్ నాటి దోస్తానా.. హిస్టరీలో స్ఫూర్తిదాయకంగా నిల్చిన ఓ పేజీ!



