ఓ కుక్క, ఓ బాబు మధ్య ఆసక్తికర స్నే హం: ఆటిజంపై ఓ మెసేజ్.. ది లిటిల్ డాగ్!

The Little Dog ( చిన్ని కుక్క)


…………………………………………………….

సినిమా సమీక్ష.. పూదోట శౌరీలు ✍️

ఇది చైనా సినిమా. ఆటిజం జబ్బుతో బాధపడే పిల్లలు, వారి తల్లదండ్రులు అనుభవించే వేదన, బాధ, ఆటిజంతో ఇబ్బంది పడుతున్న బాలుడి జీవితంలో కుక్కపిల్ల పోషించిన పాత్ర గురించి అద్భుతంగా తీసిన సినిమా ఇది.


నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులు ఈ జబ్బుతో బాధపడుతున్నారు. అందులో మనదేశం గూడా ఏ మాత్రం తీసిపోని రీతిలో వుంది. కాకపోతే ఇంకా కొంతమంది తల్లిదండ్రులు అసలు తమ బిడ్డలకు ఈ జబ్బు వుందని, తెలుసుకోలేని స్థితిలో వున్నారు. ఆ బిడ్డలకు తగిన వైద్యం అందటం లేదు.


ఈ సినిమా డైరెక్టర్ Tan Yizhi, సినిమాటోగ్రాఫర్ Liu A Dong ఒక గొప్ప చిత్రాన్ని ప్రపంచానికి అందించారు.


ఉరుములు మెరుపులతో జోరుగా వాన పడుతూ వుంటుంది. ఆ వానలో బస్ లో ప్రయాణిస్తున్న నిండు గర్భిణికి ప్రసవవేదన మొదలవుతుంది. భర్త, తోటి ప్రయాణికుల ఆసరాతో ఆమెను హాస్పిటల్ లో చేర్చుతారు. సిజేరియన్ తో చక్కని మగబిడ్డకు జన్మనిస్తుంది.


అదే గాలివానలో కప్పులేని మొండిగోడల్లో అతికష్టం మీద ఆరు కుక్కపిల్లలకు జన్మనిస్తుంది ఒక వీధికుక్క. కొద్ది రోజులకు ప్రొక్లెయినర్ ఆ గోడలను కూల్చి వేస్తుండగా ఒక కుక్కపిల్ల మాత్రమే ప్రాణాలతో బయటపడుతుంది.


ఆ దంపతులకు పుట్టినబిడ్డ, ఎలా ఎదుగుతున్నాడో అలాగే అతనిలోని ఆటిజం లక్షణాలు గూడా రోజురోజుకి ఎదిగిపోతున్నాయి. ఆ అబ్బాయి ప్రవర్తన ఎలా వుంటుందంటే చూస్తున్న మనమే దడుసుకుంటాము. “ఒక చక్కని బిడ్డనిమ్మంటే ఇలాంటి బిడ్డనిచ్చావేమయ్యా దేవుడా” అని కుంగిపోతూ తండ్రి, రోజురోజుకూ తాగుడికు బానిసవుతాడు. పైగా పిల్లవాణ్ణి తిడుతూ, శాపనార్థాలు పెడుతూ, అసహ్యించుకుంటాడు. తల్లి మాత్రం బిడ్డ పెట్టే బాధల్ని పంటిబిగువునా భరిస్తూ, ఐదారెళ్ళ ఆ బాబుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వుంటుంది. బాబుని స్కూల్లో చేర్పించి, పిల్లవాడితో పాటు తనూ రోజంతా స్కూల్లోనే కాలం గడుపుతూ వుంటుంది.


ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారిలో పిల్లవాని (xiaofu) ప్రవర్తన సడన్ గా విచిత్రంగా మారిపోతుంది. తనని తాను హింసించుకుంటూ, తల్లిని హింసిస్తూ, పెద్దగా కేకలు వేస్తూ వుంటాడు. చుట్టూ జనం చేరి ఆ బాధాకర సంఘటన వీడియో తీస్తూ, నవ్వుతూ వుంటారు. అప్పుడా తల్లి పరిస్ఠితి ఏమిటి..? మీరు మనుషులేనా..? సాటి మనిషి బాధలో వుంటే మీకెలా నవ్వాలనిపిస్తుంది..? అంటూ వాళ్ళమీద పిచ్చిగా, ఏడుస్తూ విరుచుకుపడుతుంది.


“ఇప్పుడే వస్తాను.జాగ్రత్తగా ఇంట్లోనే వుండు” అని చెప్పి తల్లి అర్జంట్ పని మీద బయటకు వెళ్తుంది. ఎప్పుడూ బట్టల బీరువాలో దాక్కుని, కూర్చునే పిల్లగాడు తల్లి అటు పోగానే, ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. రోడ్డు మీద చప్పుళ్లకు భయపడుతూ, అటు ఇటు తిరిగి, చివరకు హార్బర్ దగ్గర వుండే లైట్ హౌజ్ దగ్గరకు చేరతాడు. లైట్ హౌజ్ కింది గదిలో నక్కి కూర్చుంటాడు. అక్కడే స్థావరం ఏర్పరుచుకున్న కుక్కపిల్ల వస్తుంది. మొదట్లో ఇద్దరికీ ఒకరిని చూస్తే ఒకరికి భయం. మెల్లమెల్లగా ఇద్దరికీ స్నేహం కుదురుతుంది. ఎంతగా అంటే, ఇద్దరిదీ ఒక్క నిమిషం కూడా విడిచి వుండలేనంత ప్రేమ. ఆ కుక్కపిల్లే వాడిని తల్లిలా సాకుతుంది.

అక్కడ తల్లి.. పిల్లవాడు కనిపించక తల్లడిల్లిపోతుంది. భర్తతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే,అతడు ” పీడా వదిలిపోయింది. వాడిని మర్చిపో, దేవుడే మనకు వాడినుండి విముక్తి కలిగించాడు, మనం ఇంకో పిల్లాడిని కందాం” అంటాడు.
“నిన్ను అయినా వదిలేస్తా.. కానీ, నా బిడ్డను వదులుకోను. నేనే వెళ్లి అంతా వెదుకుతాను” అని బయలుదేరుతుంది. చేసేదేమీ లేక అతనూ బయలుదేరుతాడు. మరి వాళ్లకు ఆ పిల్లవాడు దొరుకుతాడా? ఎక్కడెక్కడో కుక్కల్ని పట్టుకెళ్లుతున్న చైనా మునిసిపాలిటీ వాళ్లకు ఆ కుక్కపిల్ల దొరుకుతుందా..? రోజూ ఈ కుక్కపిల్లకు అన్నం పెట్టే ప్రేమజంటలోని ప్రేమికుడిని ప్రమాదం నుండి ఎలా కాపాడింది? కుక్కపిల్ల స్నేహంతో పిల్లవాడిలోని ఆటిజం లక్షణాలు తగ్గాయా..? ఖాళీ సీసా మూతలతో ఆడుకునే ఆ పిల్లవానికి, కుక్క రంగురంగుల మూతలు ఎలా తెచ్చింది? సినిమా చివరిలో ఈ సినిమా డైరెక్టర్ చెప్పిన మాటలేమిటి..? ఆటిజంతో బాధపడే చిన్నారులకు ఏం చెప్పారు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడండి.

ఆటిజంతో బాధపడే బిడ్డలున్న వారికి, కుక్కల ప్రేమికులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది.

పిల్లవాడు xiaofu నటన అద్భుతం. ఆ చిన్న కుక్కపిల్ల గూడా ఎంత బాగా నటించిందో! కుక్కలంటే ఇష్టం లేనివాళ్ళు గూడా దాన్ని దగ్గరకు తీసుకోవాలనుకుంటారు.


1 గంట 35 నిమిషాలున్న ఈ సినిమా యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది.

ఈ సినిమా నాకు ఎంతగా నచ్చిందంటే ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేకపోయాను. ఈ సినిమా గురించి నేను రాసింది చాలా తక్కువ. మీరు చూడాల్సింది చాలా వుంది.

“This movie made me cry”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles