విశీ(వి.సాయివంశీ) ✍️✍️
నటుడు నూతన్‌ప్రసాద్ ఒకసారి బెంగళూరులో షూటింగ్ చేస్తున్నారు. తర్వాత రోజు చెన్నైలో షూటింగ్ ఉంది. తప్పకుండా వెళ్లి తీరాలి. ఫ్లైట్ టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. ఇక కారులో వెళ్లక తప్పదని ఆయన అనుకున్నారు. సరిగ్గా మరో గంటలో ఫ్లైట్ ఉందనగా, ఆయనకు టికెట్ దొరికిందనే వార్త వచ్చింది. హడావిడిగా సామాన్లు తీసుకుని, ఎయిర్‌పోర్టుకు వెళ్లి విమానం ఎక్కారు.
విమానంలో ఆయన సీటు పక్కనే భార్యాభర్తలు, వారి ఒడిలో ఓ చిన్నపిల్లాడు ఉన్నారు. వాళ్లని చూడగానే నూతన్‌ప్రసాద్ గుర్తుపట్టారు. ఆయన సీనియర్ హీరో, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, ఆయన భార్య పార్వతమ్మ, వాళ్ల ఒడిలో మనవడు. వారికి నమస్కరించి, పక్కన కూర్చున్నారు నూతన్‌ప్రసాద్. కాసేపయ్యాక రాజ్‌కుమార్ ఆయనతో మాట్లాడారు. ‘బెంగళూరు నుంచి ఎవరో నటుడు చెన్నైకి వెళ్లాలని అన్నారు. అందుకే నా మనవడి కోసం బుక్ చేసిన టికెట్‌ని అడ్జెస్ట్ చేసి, వాణ్ని నా ఒడిలో కూర్చోబెట్టుకున్నాను’ అన్నారాయన. నూతన్‌ప్రసాద్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ‘నటుడిగా మరో నటుడి అవసరం నాకు తెలుసు. ఒక్క రోజు షూటింగ్ మిస్ అయితే నిర్మాత ఎంత నష్టపోతాడో కూడా తెలుసు. అందుకే ఈ సర్దుబాటు’ అని రాజ్‌కుమార్ అన్నారు. ఆ తర్వాత నూతన్‌ప్రసాద్, రాజ్‌కుమార్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.

1989లో ‘బామ్మ మాట బంగారు బాట’ సినిమా షూటింగ్‌లో కారు ప్రమాదం కారణంగా నూతన్‌ప్రసాద్ కాళ్లు పనిచేయని స్థితికి వచ్చాయి. ఆ సమయంలో ఆయన్ని చెన్నైలోని విజయా హాస్పిటల్లో ఉంచారు. అదే టైంలో రాజ్‌కుమార్ కుమారుడు, హీరో శివరాజ్‌కుమార్ కాలికి ఫ్రాక్చర్ కావడంతో ఆయనకు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన్ని చూసుకునేందుకు రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులు అక్కడికి వచ్చారు. పక్క రూమ్‌లోనే ఉన్న నూతన్‌ప్రసాద్ గురించి తెలుసుకున్న రాజ్‌కుమార్ వెళ్లి, ఆయన్ని పలకరించి ధైర్యం చెప్పారు.
ఒకరోజు సాయంత్రం రాజ్‌కుమార్ నూతన్‌ప్రసాద్ గదికి వచ్చినప్పుడు ఆయన భార్య ఆయన కాలికి తైలంతో మర్దనా చేస్తూ కనిపించారు. ‘అలా కాదమ్మా.. ఇలా’ అంటూ ఆమె చేతిలో తైలాన్ని తీసుకుని రాజ్‌కుమార్ తనే నూతన్‌ప్రసాద్ కాళ్లు పట్టుకుని తైలం రాశారు. ఆ పనికి నూతన్‌ప్రసాద్ చాలా ఇబ్బంది పడి, ‘సార్..సార్..వయసులో, అనుభవంలో మీరు చాలా పెద్దవారు. మీరు నా కాళ్లు పట్టుకోవడం ఏమిటి? బాగుండదు’ అన్నారు.
దానికి రాజ్‌కుమార్ నవ్వుతూ ‘మీరు కళాకారులు. కళాకారుల్లో పెద్దా, చిన్నా అనే తేడా ఉండదు. కళాకారుడికి సేవ చేయడం నా బాధ్యత. నాకేమీ ఇబ్బంది లేదు’ అన్నారు. ఆ తర్వాత 20 రోజుల పాటు రోజూ సాయంత్రం వచ్చి, నూతన్‌ప్రసాద్ కాళ్లకు మర్దనా చేసి వెళ్లేవారు. ఆయన మరణించేవరకూ నూతన్‌ప్రసాద్‌తో ఎంతో స్నేహంగా ఉండేవారు. నూతన్‌ప్రసాద్ మళ్లీ లేచి, నడవగలిగితే మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆలయంలో పొర్లు దండాలు పెడతానని కూడా రాజ్‌కుమార్ మొక్కుకున్నారు. కానీ అది నెరవేరలేదు.
- Source: Vendithera Vennela(Youtube Channel)



