ఒక్క మాట ఆకాశం నుంచి అధ:పాతాళానికి తొక్కేస్తుంది! రెహమాన్ ఎపిసోడ్ ఏం చెబుతోంది..?

మాట పదిలం…

ఈ మాట ఇప్పుడు ఏ.ఆర్. రెహమాన్ ఎపిసోడ్ తో అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. మాట విలువైనది. ఒక చిన్నమాట.. 33 ఏళ్ల తన కెరీర్ ను ఆసక్తిగా గమనిస్తూ వచ్చినవారికి, అంతకంతా ప్రేమించినవారికి… ఆయన్ని ఓ శత్రువుగా చూసేలా చేస్తోంది. ఇంతకాలం తన ప్రతిభతో ఎదుగుతున్న సమయంలో తమకు అవకాశం దొరకక.. ఇష్టం లేకున్నా లోకం దృష్టిలో తమను తాము తక్కువ చేసుకోవద్దని పొగిడేవాళ్లకూ రెహమాన్ ఓ అస్త్రాన్నందించాడు. వ్యక్తిగత శత్రుత్వాలు, పాలి పగల్లేకున్నా… కుల, మతాల రొంపిలోకి దిగి సోషల్ మీడియా వేదికగా ఒక ఇష్యూను చీల్చిచెండాడి పోస్ట్ మార్టం చేసే సమాజంలో బతుకుతున్నప్పుడు రెహమాన్ వంటివారు ఇంకా పదిలంగా ఉండాల్సిన తరుణమిది.

ఓ చిన్న మాట… తాను నిజంగానే కమ్యూనల్ భావనతోనే అన్నాడా.. లేక, ఆ సందర్భానికి తాననుకున్న విషయాన్ని సరిగ్గా కన్వే చేయలేక తప్పులో కాలేశాడా.. లేక, ఉద్ధేశపూర్వకంగానే అన్నాడా అన్నది ఆయనకు మాత్రమే తెలుసు. కానీ, కుల, మతాల ఆధారంగా లెక్కలు వేసుకునే సమాజంలో.. సెక్యులరిజాన్ని కూడా మతతత్వవాదుల కంటే ఎక్కువ దుర్వినియోగపరుస్తూ తమకనుకూలంగా మల్చుకునేవారున్న కాలంలో మతం కార్డ్ తీసి రెహమాన్ అడ్డంగా దొరికిపోయాడు. కూసింత నాల్గు వాక్యాలు రాయగల్గిన ప్రతీ వ్యక్తీ స్పందిస్తున్నాడు. రెహమాన్ ను ఏకిపారేస్తున్నారు. మరికొందరు సమర్థిస్తున్నారు. రీజాయిండర్ గా తన వివరణతో సంతృప్తి చెంది పోన్లే పాపమనుకునేవారు కొందరైతే.. రెహమాన్ వంటివాళ్ల ఇంటెన్షన్ అలాగే ఉంటుందంటూ మతం ప్రాతిపదికన రెచ్చగొట్టేవాళ్లతోనూ ఇప్పుడు రెహమాన్ ఎపిసోడ్ మీమ్స్ కు ట్రెండింగ్ గా మారిపోయింది.

సాధారణంగా రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదు. దగ్గరగా చూసిన సినిమావాళ్లకు ఆయనెలాంటివాడో తెలీదుగానీ.. ఎక్కడా సభాపూర్వకంగాగానీ, సామాజికంగాగానీ గతంలో ఎన్నడూ తన 33 ఏళ్ల కెరీర్ లో నోరు జారింది లేదు. పైగా తన సంస్కారం.. తన సంగీతాన్ని మించి తనకు ఓ గొప్ప ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. తన గురువైన ఇళయరాజా పాట ప్రతీ ఇంటిలో రెహమాన్ పాట కన్నా కూడా ఎక్కువే వినిపించినా.. రాయల్టీ విషయంలో ఇళయరాజా వివాదాల తర్వాత ఆయనపైనా గుర్రుమన్నవారున్నారు. అదే సమయంలో అప్పటివరకూ ఇళయరాజా సంగీతంతో మాత్రమే రెహమాన్ ను పోల్చుకున్నవారు.. వ్యక్తిగత జీవన విధానంలోనూ ఇద్దరినీ సరిపోల్చుకుని మాట్లాడుకున్న సందర్భాలూ చూశాం. అలాంటి ఇమేజ్ కల్గిన ఏ.ఆర్. రెహమాన్.. ఒకే ఒక్క మాటతో తను గూడు కట్టుకున్న ఇమేజ్ నంతా పోగొట్టుకుని ఇప్పుడెవ్వరైనా తనపై ఓ రాయి రువ్వితే చూస్తూ కూర్చుండిపోవాల్సిన స్థితికి దిగజారిపోయాడు.

అయితే, రెహమాన్ వ్యక్తిగతంగా తాను అనుభవించిన కొన్ని సంఘటనలతో తన నోటి నుంచి ఆ వ్యాఖ్యలు వచ్చి ఉండొచ్చు. ఇంతకాలం ఎప్పుడూ బయటకు విప్పని.. చెప్పని ఓ పెయిన్ ఓ ఇంటర్వ్యూలో బట్టబయలు కావొచ్చు. కమ్యూనల్ కార్డ్ వాడటంతో అది మరింత పోలరైజ్ అయి పెద్ద విస్ఫోటనానికే దారి తీసి ఉండొచ్చు. ఇవన్నింటికీ మూలం మాట. అందుకే ఎవరితో మాట్లాడినా ఆచిచూచి మాట్లాడాల్సిన రోజులివి. సామాన్యుడి నుంచి సైలబ్రిటీ వరకూ ఎవ్వరికైనా వర్తించే, ఎవ్వరికి వారు అన్వయించుకుని అర్థం చేసుకుని మెదలాలని నేర్పే ఓ గుణపాఠం రెహమాన్ ఎపిసోడ్.

రెహమాన్ మాటలతో ఇంకొంత కాలం ఆయనపై కచ్చితంగా ట్రోలింగ్ జరగడం ఖాయం. అందులో ఎలాంటి సందేహమూ లేదు. మాట జారేటప్పుడే ఆలోచించుకోవాల్సిందే తప్ప… జారాక రెహమాన్ కాదుగదా ఎవ్వరైనా ఇలాంటి అనుభవాల్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది. తన వ్యాఖ్యల వల్ల తను కంపోజ్ చేసిన పాటలపై ప్రభావం ఉంటుందనీ చెప్పలేం. అసలే ఉండదనీ చెప్పలేం. కానీ, ఇప్పటివరకూ ప్రభంజనంలా ఉన్న తన కెరీర్ కు తన మాటలే రివర్స్ గేర్ అయి తనని వెనక్కి నెట్టేస్తాయా అన్నది భవిష్యత్ తేల్చనుంది. ఆయన సంగీతం అందిస్తున్న రామాయణ్ వంటి సినిమాలో ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ అందిస్తే ఇప్పుడున్న దుమారంలో కొంత మాయం కావచ్చు. కాకనూపోవచ్చు. కానీ, మీడియా ముందుగానీ, సోషల్ మీడియా వేదికగాగానీ, ఫోన్ లో మాట్లాడేటప్పుడుగానీ ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే.. ముఖ్యంగా నాలుక కర్చుకుంటే మాత్రం రెహమాన్ లా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మాట విలువ తెలుసుకోవాలి. దాన్ని పదిలంగా వాడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles