తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ లో ఓ ప్రాజెక్ట్ వర్క్ లో పాల్గొని ఓ చరిత్ర సృష్టించబోతున్నాడు. ఏస్.. ఈ వార్త నిజమే. హార్వర్డ్ యూనివర్సిటిలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ అవకాశం ఇప్పటివరకూ కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కింది. ఇంతకీ ఏంటా వార్త..?

అమెరికా మాసాచుసెట్స్ రాష్ట్రంలోని కేంబ్రిడ్జ్ లో ఉన్న హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ క్యాంపస్ లో Leadership: 21st Century అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. జనవరి 25 నుంచి 31వ తేదీవరకు జరుగబోయే ఈ ప్రోగ్రామ్ లో ఐదు ఖండాలకు చెందిన 20 దేశాలకు పైగా అభ్యర్థులు పాల్గొనబోతున్నారు. ప్రపంచస్థాయిలో నెలకొన్న వైవిధ్యమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై చర్చించే ప్రాజెక్ట్ ఇది. అలా ఐవీ లీగ్ సంస్థలో కోర్స్ చదివే.. తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డ్ నెలకొల్పబోతున్నారు.
ఈ కోర్సులో భాగంగా రేవంత్ రెడ్డి తరగతి గదిలో బోధనా సమావేశాల్లో పాల్గొని, అసైన్ మెంట్స్ పూర్తి చేసి, హోంవర్క్ కూడా సమర్పించి, ఇతర అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేవారితో గ్రూప్ ప్రాజెక్టుల్లోనూ పాల్గొనబోతున్నారు. పరస్పర చర్చలు, సమస్యల పరిష్కారం కోసం సహకారాత్మక దృక్పథాన్ని పెంచుకోవడంపై ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫోకస్ కానుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాయకత్వ సవాళ్లపై పరస్పర అభిప్రాయాలను పంచుకునే వేదికగా ఈ కార్యక్రమం నిలవనుంది.
ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రయాన్ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా.. ప్రొఫెసర్ కెరెన్ మోరిస్సీ డైరెక్టర్ గా ఉంటారు. పాఠ్యాంశాలు, వివిధ చారిత్రక కాలాలు, ప్రపంచం నలుమూలల నుంచీ తీసుకున్న నాయకుల కేస్ స్టడీస్ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ రూపకల్పన చేశారు. పాల్గొనేవారిని గ్రూపులుగా విభజించి.. వాస్తవ జీవన పరిస్థితులను విశ్లేషించడం, పరిష్కారాలను చూపించడం వంటివి ఈ ప్రాజెక్ట్ సందర్భంగా జరిగే తరగతి చర్చల్లో ఉండబోతున్నాయి.
కోర్స్ ముగిసిన అనంతరం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కోర్స్ సర్టిఫికెట్ కూడా అందించనున్నారు. విధిలో ఉన్న ఓ భారతీయ ముఖ్యమంత్రి ఒకరు ఈ సంస్థ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం ఇదే మొదటిసారి కావడమే విశేషం.
ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థలో అవకాశాలు కోరుకునే విద్యార్థుల కోసం విదేశీ భాషా నైపుణ్య ప్రాధాన్యతను గురించి పలు సమావేశాల్లో మాట్లాడిన రేవంత్.. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునేవారి కోసం జపనీస్, కొరియన్, జర్మన్ భాషల శిక్షణకూ సదుపాయాల ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు తెలంగాణా ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు.
తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ నర్సింగ్ కళాశాల విద్యార్థినులతో జరిగిన ముఖాముఖిలో జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాల్లో నర్సులకున్న భారీ డిమాండ్ ను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు అందుకునేలా నర్సింగ్ విద్యార్థినులకు ప్రత్యేక భాషా శిక్షణా కార్యక్రమాలను రాష్ర సర్కార్ అందిస్తుందన్నారు. మొత్తంగా ఇప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఓ ముఖ్యమంత్రిగా ఓ విద్యార్థి దశలోకి మళ్లీ రేవంత్ రెడ్డి ఎంటర్ కావడమూ ఓ విశేషమే.



