ఆ ఆపరేషనే ఓ అబ్బురం… ఓ సినిమాగా చిత్రీకరణ మరో అద్భుతం!
ఓ అడ్వెంచరస్ సినిమా అంటే ఎలా ఉంటుంది.. అంటే… థర్టీన్ లైవ్స్ లా అని ఠకీమని చెప్పొచ్చు! అప్పటికే ఇక వాళ్ల పనైపోయినట్టేని నిర్ణయించుకునే స్థాయికొచ్చాక… అలాంటి ఆపదలో ఉన్నవారిని కాపాడాలంటే.. అదెంత రిస్క్…? ఎంత రెస్క్యూ ఆపరేషన్స్ లో నిష్ణాతులై ఉన్నా… వారిని కాపాడబోయి తామే ప్రాణాలను కోల్పోతే….? ఇదిగో ఈ ప్రశ్నే వేధిస్తే… తనకు మాలిన ధర్మముండదనేదే లోకరీతవుతుంది. కానీ, ఆ ఎక్స్పర్ట్స్ అలా చేయలేదు… ఎలాగైనా కాపాడాలనుకున్నారు. సంకల్పబలంతో… ఓ కోటగుహలో చిక్కుకున్న 13 మందిని లైవ్ గా మళ్లీ వాళ్ల తల్లిదండ్రులు, కుటుంబీకుల ముందుంచారు. 2018లో థాయ్ లాండ్ లో జరిగిన ఆ సంచలనాన్ని థర్టీన్ లైవ్స్ సినిమాగా ఘటన జరిగినంత అద్భుతంగా మల్చడం మరో విశేషం. యదార్థగాధకు కొంత నాటకీయత జోడించినప్పటికీ… దర్శకుడు రాన్ హోవర్డ్ ఆ సంఘటన జరిగిన రోజుల్ని మళ్లీ తన సినిమా ద్వారా రీక్రియేట్ చేయడం మాటలు చెప్పనంత సులభం కాదు. ఈ మధ్య మంజుమ్మల్ బాయ్స్ సినిమా హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో… ఓసారి అమెజాన్ ప్రైమ్ లో ఉన్న 13 లైవ్స్.. దాని వెనుక కథ మరోసారి చెప్పుకుందాం.

థాయ్ లాండ్ లోని థామ్ లువాంగ్ గుహలు ఎంత ప్రసిద్ధో తెలిసిందే. అయితే ఎందరో పర్యాటకుల్లాగే… వాటిని చూసేందుకు ఓ 12 మంది పిల్లలు… వాళ్ల కోచ్ తో కలిసి ఆ గుహల్లోకి వెళ్లారు. అసలా గుహల్లోకి వెళ్లడమే ఓ అడ్వెంచర్. అలా గుహల్లోకి వెళ్లిన తర్వాత భారీవర్షంతో ఒక భయానక వాతావరణం ఉత్పన్నమైంది. గుహల్లోకి నీరు వరదెత్తింది. సుమారు నాల్గున్నర కిలోమీటర్ల దూరం వెళ్లిన పిల్లలు, తమ కోచ్ తో సహా భిక్కుభిక్కుమంటూ గడుపుతుంటారు. ఓవైపు చిన్నారులు బయటకు రాలేని స్థితి… పిల్లలింటికింకా రాలేదని తల్లిదండ్రుల్లో మరోవైపు ఆందోళన… కానీ, కోచ్ తో గుహకు వెళ్లినట్టు తెలుసుకున్న పేరెంట్సంతా ఆ గుహ వద్దకు చేరుకుంటారు. సుమారు 18 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారందరినీ సజీవంగా బయటకు తీసుకువచ్చిన ఆ యదార్థ ఘటన ఆధారంగా మల్చిన సినిమాలో… ఆ 18 రోజుల రెస్క్యూను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఇక ఆపరేషన్ జరిగే తీరంతా సినిమాలో చూస్తేనే మజా!
థాయ్ గుహల రెస్క్యూ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తిచేసిన స్కూబా డైవర్స్ బృందం తీరుకు నాడు ప్రపంచమంతా సాహో అని ప్రశంసలతో ముంచెత్తింది. తనకు మాలిన ధర్మం లేదనుకుని బతికే సమాజంలో… పిల్లల తల్లిదండ్రుల ఆర్తనాదాలు చూసి చలించి వారినెలాగైనా కాపాడాలనుకుని… అత్యంత కఠినమైన పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ ను విజయవంతం చేసిన ప్రధానఘటనల్లో లువాంగ్ గుహల గాధ ఈ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. అయితే దర్శకుడు తన సినిమాతోనూ మనల్ని ఆ గుహల్లోకి తీసుకెళ్లగల్గుతున్నాడంటేనే…. కథలోకీ తీసుకెళ్లినట్టే. అలాంటి టేకింగే మనకు థర్టీన్ లైవ్స్ లో అబ్బురపరుస్తుంది. అందుకు తగ్గ ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరితే… ముమ్మాటికీ థర్టీన్ లైవ్స్ లా ప్రశంసలందుకుంటుంది.
2018 జూన్ 23 నుంచి జూలై 10వ తేదీ వరకు 18 రోజుల పాటు సాగిన ఆ ఉత్కంఠభరితమైన రెస్క్యూలో… సుమారు పదివేల మంది పాత్ర ఉంది. వందమంది స్కూబా డైవర్స్.. వంద సర్కారు ఏజెన్సీస్.. 900 మంది పోలీసులు… 2 వేల మంది సైనికులు… పది పోలీస్ హెలిక్యాప్టర్స్… ఏడు ఆంబులెన్సులు… 700కు పైగా డైవింగ్ సిలెండర్స్… ఒక బిలియన్ లీటర్ నీళ్లను ఆ కొండగుహల్లోంచి ఎత్తిపోసే మోటార్లతో కూడిన యంత్రాంగం… ఇలా ఒకటా, రెండా…? ఒక భయానకమైన రెస్క్యూ ఆపరేషన్ కు ఓ కేరాఫ్ గా నిల్చిన థాయ్ గుహల ఘటనకు… సగానికి సగం ప్రపంచమే చేయూతనందించింది. అలాంటి సినిమా ఇతివృత్తంగా ఎంచుకోవడమే ఓ సాహసమైతే… అంతే సాహసంగా దాన్ని తిరిగి తెరకెక్కించడమంటే సింపులుగా మనం చెప్పాల్సిన మాట హ్యాట్సాప్ ఒక్కటే. కేవలం వందో, రెండొందలో ఎంటర్ టైన్ మెంట్ కోసం వెచ్చించే సగటు ప్రేక్షకుడు.. ఆ సినిమా టేకింగ్ చూసి.. ఆ ఎంచుకున్న సబ్జెక్ట్ చూసి వా అనకుండా ఉండలేడు. థియేటర్ కు వెళ్లి చూసినవారైతే.. తాము పెట్టిన టిక్కెట్ డబ్బులకు తగ్గ వర్తీ సినిమా అని కూడా మురిసిపోతారు. అయితే థాయ్-మయన్మార్ బార్డర్ లో ఉన్న గుహల్లో జరిగిన ఈ వాస్తవిక ఘటనలో ఒకరు రెస్క్యూ చేస్తున్నప్పుడు మృతి చెందగా… మరొకరు ఆ తర్వాత బ్లడ్ ఇన్ ఫెక్షన్ కు గురై మరణించడం ఆ విజయంలోనూ బాధించిన విషాదం.
ఓ జీవి ప్రాణం విలువ గుర్తించగల్గడమే మానవత్వం! తమ ప్రాణాలను పణంగా పెట్టి… ఆపదలో ఉన్న తోటి మనుషుల ప్రాణాలను కాపాడటమంటే… అది నిజంగా మానుషరూపేణ దైవత్వమే!! అలాంటి దైవత్వంతో కూడిన మానవత్వపు పరిమళాలను వెదజల్లిన నాటి థాయ్ వాస్తవ సంఘటనకు ప్రతిరూపమే… థర్టీన్ లైవ్స్!
అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ సినిమా ఎప్పటికీ వర్త్ వాచ్ థ్రిల్లింగ్ సినిమానే!



