చేతులు కాల్చుకోవడం.. ఆకులు పట్టుకోవడం… నాలుక్కర్చుకోవడం.. క్షమాపణలడగడం.. లేదంటే, బుకాయించడం మన నాయకులకలవాటే! అలాంటి పనితోనే ఇప్పుుడు వార్తల్లో వ్యక్తయ్యాడు ఒడిశాలోని పూరీ బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబిత్ పాత్ర.

భక్తులకు, బత్తాయిలకు కేరాఫ్ అన్నట్టుగా ఇప్పటికే విపరీతమైన ట్రోలింగ్ లో ఉన్న బీజేపీకి… ఈ భక్తుడి మాటలు పెద్ద తలబొప్పే కట్టించాయి. పైగా పూరి జగన్నాథస్వామి అంటే… ప్రాంతాలకతీతంగా భక్తులు ఆరాధించే దైవం. ఈ క్రమంలో ఆరో విడతలో ఒడిశాలో జరుగబోయే ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో… ఒకింత అత్యుత్సాహంతో ఓ మీడియా ఇంటర్వ్యూలో నోరు జారి నాలుక్కర్చుకుని.. ఒడిశా బీజేపీలో ఇప్పుడు మహాపాత్ర పోషిస్తున్నాడు సంబిత్ పాత్ర.
జనమంతా పూరి జగన్నాథుడి భక్తులైతే… సాక్షాత్తూ ఆ పూరి జగన్నాథుడు మోడీకి భక్తుడంటూ మోడీ పట్ల తన భక్తి ప్రపత్తులను చాటుకుని వివాదాస్పదమయ్యాడు. దీనిపై ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కూడా సీరియసయ్యారు. పూరి జగన్నాథుడంటే ఒడిశా అస్తిత్వం. అలాంటి అస్తిత్వాన్నే దెబ్బతీశేలా మాట్లాడటమేంటంటూ ఆయన చేసిన విమర్శలతో… బీజేపీ పరిస్థితిప్పుడు కుడితిలో పడ్డ ఎలుక లెక్క తయారైంది.
పూరి జగన్నాథుడు మహా ప్రభువని.. అలాంటి దేవుణ్ని… మరో మానవుడి భక్తుడంటూ అవమానించడమేంటని… ఇది ఒడిశా ప్రజానీకం ఎప్పటికీ మర్చిపోలేని మాట అంటూ నవీన్ పట్నాయక్ ఒకింత స్వరం పెంచుతూ చేసిన సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా మారడంతో… ఆరో విడత ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి తమ అభ్యర్థి చేసిన మాటలే బూమరంగయ్యాయి.
ఇదే విషయంపై అటు కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా తీవ్రంగా ఖండించాడు. అధికారం మత్తులో ఉన్న బీజేపీకి మళ్లీ ఇలాగే అధికారమిస్తే భారతదేశ ప్రజలనే కాదు… దేవుళ్లను కూడా వదలరన్న కోణంలో ఆయనా తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
అయితే, తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి.. తన గెలుపోటములు పక్కనబెడితే.. ఒడిశాలోనే బీజేపీకి ఎదురుదెబ్బలా మారిన క్రమంలో.. ఇప్పుడు సంబిత్ పాత్ర ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నాడు. తాను మాట్లాడింది తప్పేనని ఒప్పుకుంటూ సోషల్ మీడియాలో ఏకంగా తానే పోస్టులు పెడుతున్నాడు. ఎన్నో ఛానల్స్ ఇంటర్వ్యూస్ లో కూడా మోడీనే పూరీ జగన్నాథుడి భక్తుడిగా చెప్పుకొచ్చిన తాను… ఏదో సందర్భంలో నోరు జారానని… టంగ్ స్లిప్ అవ్వడం మానవ సహజమని… దాన్ని ఓ మానవ తప్పిదంగా మాత్రమే చూసి క్షమించాలని కోరుతున్నాడు. అంతేకాదు.. తాను మాట్లాడిన మాటలకు ప్రాయశ్చిత్తంగా మూడు రోజుల పాటు పూరి జగన్నాథుణ్ని శరణు వేడుకుంటూ ఉపవాస దీక్షకు సిద్ధమయ్యాడు ఈ డాక్టర్ బాబు.
నేను మహాప్రభు శ్రీ జగన్నాథ్ జీ పాదాలకు నమస్కరిస్తున్నాను. క్షమించమని వేడుకుంటున్నాను. నా తప్పును సరిదిద్దుకుంటాను. అందుకోసం మూడురోజుల పాటు ఉపావాసముంటానంటూ… పాత్ర సోషల్ మీడియాలో తన క్షమాపణలను, ప్రాయశ్చిత్తాన్నీ ప్రకటించారు. గతంలో కూడా సంబిత్ పాత్ర కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిల్చిన ఘటనలెన్నో ఉన్నాయి. అయితే, ఈ నెల మే 25వ తేదీన జరుగబోయే ఎన్నికల నేపథ్యంలో…సంబిత్ చేసిన వ్యాఖ్యలతో.. ఏ దేవుణ్ని నమ్ముకునైతే బీజేపీ రాజకీయం చేస్తుందో.. అదే దేవుడి రూపంలో రివర్సవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.



