ఓవైపు శస్త్ర చికిత్స… ఇంకోవైపు పాట… ఆపరేషన్ థియేటర్లో సోను నిగమ్ సర్జరీ సందర్భంగా కనిపించిన దృశ్యమిది. ఇదిప్పుడు సోషల్ మీడియాలోనూ చర్చకు తావిస్తోంది. నరాలకు సంబంధించిన శస్త్ర చికిత్సగా ప్రచారం జరుగుతుండగా.. ఆ విషయాలేవీ ఇంకా బయటకు వెల్లడించడం లేదు.
తనకు సర్జరీ జరుగుతుండగా సోను ఏకంగా ఏడు దశాబ్దాల క్రితం విడుదలై.. ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిల్చిపోయిన మహమ్మద్ రఫీ సూపర్ హిట్ సాంగ్ ను ఎంచుకున్నారు. మహమ్మద్ రఫీని ఆరాధించే సోను.. ఎంచుకున్న పాట వెనుకా ప్రాధాన్యత ఉండటమే విశేషం.
1949లో విడుదలైన దులారీ సినిమా పాట ఇది. తన వైద్యుడు, వైద్య బృందం కోసం పాడుతూ సోను తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో షేర్ చేశాడు. డాక్టర్ నీలేష్ సత్బాయ్, ఆయన బృందం ముందు సోను నిగమ్ పాడుతున్న ఆ వీడియోను చిత్రీకరించారు.

నా ప్రియమైన డాక్టర్ నీలేష్ సత్భాయ్, ఆయన బృందం నాకు శస్త్ర చికిత్స చేస్తుంటే వారిని ఆనందింపజేసేందుకూ… నాకు నొప్పి తెలియకుండా ఉండేందుకు ఈ పాట పాడుతున్నానంటూ తను మహమ్మద్ రఫీ పాడిన సుహానీ రాత్ ఢల్ చుకీ తో నొప్పిలోనూ మెలోడీనందించాడు.
పాట ప్రత్యేకతేంటంటే..?
సోను నిగమ్ ఎంచుకున్న ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుహానీ రాత్ ఢల్ చుకీ సినీ సంగీత చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పాట. ఓ క్లాసిక్. ఏడు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఎక్కువగా వినిపించే ఒక ఓల్డ్ మెలోడీ. ముఖ్యంగా సోనుకు ఇష్టమైన రఫీ వాయిస్ లోని మెరుపులన్నీ ఈ పాటలో వినిపిస్తాయి.
https://www.instagram.com/reel/Dbzn6t6sAwZ
సాధారణంగా శస్త్రచికిత్స అంటే ఎంతటి ధైర్యవంతులైనా ఎక్కడో ఓమూల కాస్త భయముండే అవకాశం లేకపోలేదు. అలాంటి అత్యంత బలహీన సమయంలో సోను ఈ సుహానీ రాత్ ఢల్ చుకీ పాటను ఎంచుకున్నాడు.
సోషల్ మీడియాలో అభిమానుల స్పందన!
ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చిన ఈ పాట చాలామంది సోను అభిమానులను కలవరపర్చింది. వైరల్ కావడంతో ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తూనే… ఆయన అభిమానులు సోను పట్ల అభిమానాన్నీ చూపిస్తున్నారు. అద్భుతమైన ఆ గాత్రాన్ని దయచేసి జాగ్రత్తగా చూడు దేవుడా అని వేడుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా సోను స్వరాన్ని దైవస్వరంగా అభివర్ణిస్తున్నారు.



