ఇక మీరు అనాథలు కాదు.. నా పిల్లలు!
1942లో రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. జర్మన్ నాజీల దాడులతో… పోలాండ్ పతనం అంచుకు చేరుకుంది. ఆ సమయంలో వేలాది మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైపోయారు.
అదిగో అలాంటి సమయంలో వెయ్యిమంది పోలిష్ పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షితమైన చోటు కోసం వెతుకుతున్నారు. అప్పుడు వారికి అండగా నిల్చిందెవరో తెలుసా..?

ఆ అన్ సంగ్ హీరో ఎవరు..?
భారత్ కు చెందిన ఓ మహారాజు. మహారాజ దిగ్విజయ్ సింగ్ జీ రంజిత్ సింగ్ జీ జడేజా ఆయన పూర్తి పేరు. ఈయన ప్రస్తుతం గుజరాత్ లో జామ్ నగర్ గా ప్రసిద్ధి చెందిన నాటి నావానగర్ సంస్థానాధిపతి. ప్రేమగా ఈయన్ను జామ్ సాహెబ్ అని పిల్చుకునేవారు.
మరి అసలు ఆ పిల్లలు భారత్ కు ఎలా వచ్చారు..?
యుద్ధం కారణంగా భయపడి పోలాండ్ నుంచి పారిపోయిన వేలాది మంది ప్రజలు సోవియట్ యూనియన్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉండటంతో.. తల్లిదండ్రులను కోల్పోయిన 18 వేల మంది పోలిష్ పిల్లలు సురక్షిత ప్రాంతం కోసం ఎదురుచూస్తున్న గడ్డుకాలమది. వారిలో కొందరు ఇరాన్ మీదుగా భారత్ కు చేరుకోగల్గారు. వారి పరిస్థితి చూసిన జామ్ సాహెబ్ గుండె కరిగిపోయింది. చలించిన ఆయన ఆ పిల్లలకు ఏం చేయగలమో ఆలోచించమని తన పరివారానికి చెప్పాడు. వారిని మన పిల్లల్లా చూసుకోవాలని ఆదేశించాడు.
బాలాచాడిలో కొత్త ఇల్లు!
జామ్ నగర్ సమీపంలోనే బాలాచాడి ఉంటుంది. ఆ ప్రాంతంలోనే పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ నివాస కేంద్రాన్నే ఏర్పాటు చేశారు జామ్ సాహెబ్. అంతేకాదు, వారికి కావల్సిన ఆహరం, విద్య, వైద్యం, ఆటలు, వినోదం, పోలిష్ భాష, సంస్కృతి, చరిత్ర ఇలా అన్నీ వారికందేలా సమకూర్చారు జామ్ సాహెబ్. అయితే ఎన్ని చేశాడన్నది ముఖ్యం కాదు. కానీ, పిల్లలను ఆయన కలిసి చెప్పిన మాటలు మాత్రం చరిత్రలో నిల్చిపోయాయి.
మీరిక అనాథలు కాదు.. మీరిప్పుడు నావానగరవాసులు అన్నదే ఆ మహారాజ్ చెప్పిన మాట. అంతేకాదు, తనను బాపు అని పిలువొచ్చనీ చెప్పారట ఆ జామ్ సాహెబ్. ఆ రోజు నుంచి యుద్ధం తెచ్చిన మానవ విపత్తు పాపామా అని తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లలు.. దిగ్విజయ్ సింగ్ జీని కేవలం ఒక మహారాజుగానే కాదు… ఒక తండ్రిలా భావించారు.
యుద్ధం ముగిసినా బంధం మాత్రం పదిలం!
రెండో ప్రపంచ యుద్ధం ముగిసినా బంధం మాత్రం పదిలంగా అలాగే కొనసాగింది. 1945లో ఆ యుద్ధం ముగిసేవరకూ కూడా ఆ పోలాండ్ పిల్లలంతా బాలాచాడిలోనే ఉన్నారు. వారికి పోలిష్ భాష, సంస్కృతి, చరిత్రను తమ దేశంలోలాగానే నేర్పించారు. తమ దేశాన్ని, మూలాల్ని, అస్తిత్వాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని బోధించారు. యుద్ధం ముగిసిన తర్వాత బాలాచాడి ఖాళీ అయిపోయింది. ఎక్కడి పిల్లలక్కడికి వెళ్లిపోయారు. కానీ, తమని ప్రాణాలతో కాపాడటంతో పాటే.. తల్లిదండ్రుల్లేరనే లోటు లేకుండా పెంచిన బాపును మాత్రం మర్చిపోలేదు. జామ్ సాహెబ్ మరణించిన తర్వాత కూడా ఎన్నో ఏళ్లు పోలాండ్ ప్రజానీకం ఆయన సేవల్ని గుర్తుంచుకున్నారు. పోలిష్ పార్లమెంట్ ఆయన్ను గౌరవిస్తూ ఏకంగా ఓ తీర్మానాన్నే పాస్ చేసింది. వార్సాలో ఆయన పేరుతో గుడ్ మహారాజా స్క్వేర్ కూడా ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ లోని నెవాటిమ్ లో కూడా దిగ్విజయ్ సింగ్ జీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఎందరో రాజులు చరిత్రలో ఎన్నో యుద్ధాలు గెల్చారు. కానీ, జామ్ సాహెబ్ మాత్రం వేలాది మంది దేశం కాని దేశం పిల్లల మనసుల్ని గెల్చాడు. అందుకే పోలాండ్ ఇప్పటికీ దిగ్విజయ్ సింగ్ జీ అనే జామ్ సాహెబ్ ను ఇప్పటికీ ప్రేమగా గుర్తు పెట్టుకుంటోంది.
.



