లత.. ఎన్నో ప్రేమ పాటలు పాడింది.. కేవలం ఆమె మధురమైన పాటలతోనే ప్రేమకథలను హిట్ గా మల్చింది. మరి, తన ప్రేమ పాట ఎవరితో పాడిందో తెలుసా..? అప్పట్లో, ఆమె ప్రేమ కథా ఓ సెన్సెషనల్! లత ప్రేమ బంధం లైఫ్ లాంగ్ వివాహానికైతే నోచుకోలేదుగానీ… ఆ ప్రేమికుల మధ్య స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. ఇంతకీ లతను అంతలా ఆకట్టుకున్న ఆ ప్రేమికుడెవరు..?
అతనో క్రికెటర్. అవునూ… ఒకరు సినీరంగంలో స్టార్ సింగరైతే, ఇంకొకరు క్రీడారంగంలో స్టార్. అలా లతామంగేష్కర్, రాజ్ సింగ్ దుంగార్పూర్ మధ్య చాలాకాలమే ప్రేమ నడిచింది. రాజ్ సింగ్ తో తిరగడంతో లతా మంగేష్కర్ కూ క్రికెట్ అంటే వల్లమాలిన మక్కువేర్పడింది. దాంతో తరచూ ఆమె క్రికెట్ చూడ్డానికి వెళ్లేవారు. ఆ క్రమంలో ఓసారి భారతజట్టు మొట్టమొదటి ప్రపంచకప్ గెల్చాక క్రికెటర్స్ ను సన్మానించేందుకు నాడు గడ్డు పరిస్థితులున్నప్పుడు.. లతామంగేష్కరే ఛారిటీ షో నిర్వహించి క్రికెటర్స్ సన్మానం కోసం నాటి భారత ప్రభుత్వానికి అండగా నిల్చింది. అందుకు ప్రధాన కారకుడు కూడా రాజ్ సింగ్ దుంగార్పూరే.

లతా మంగేష్కర్- రాజ్ సింగ్ దుంగార్పూర్ మధ్య ప్రేమ వ్యవహారంపై ఆరోజుల్లో పెద్ద గాసిప్సే వెలువడ్డాయి. పత్రికలూ పతాకశీర్షికలకెక్కించి కోడై కూసాయి.
రాజ్ సింగ్ దుంగార్పూర్ నేపథ్యం!
ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలోని రాజరిక వ్యవస్థైన రాజ్ పుతానాలోని దుంగార్పూర్ లో జన్మించిన రాజ్ సింగ్ దుంగార్పూర్.. రాజరిక వంశానికి చెందినవాడు. అప్పటి దుంగార్పూర్ పాలకుడైన మహారావల్ లక్ష్మణ్ సింగ్ జీ చిన్న కుమారుడు రాజ్ సింగ్. క్రికెట్ అంటే పిచ్చి. అలా క్రికెట్ లోకి అడుగుపెట్టిన రాజ్ సింగ్.. రాజస్థాన్ తరపున రంజీట్రోఫీ, సెంట్రల్ జోన్ తరపున దులీప్ ట్రోఫీల్లో 1955 నుంచి 1971 వరకూ ఆడాడు. తన ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అడ్మినిస్ట్రేటర్ గా, మేనేజర్ గా కూడా భారత టీంకు బాధ్యతలు వహించిన రాజ్ సింగ్.. 1990ల కాలంలో రెండు పర్యాయాలు బీసీసీఐ చైర్మన్ గా వ్యవహరించారు.
రాజ్ సింగ్, లత మధ్య ప్రేమ ఎలా చిగురించింది..?
లతా మంగేష్కర్ సోదరుడైన హృదయనాథ్ మంగేష్కర్ కు రాజ్ సింగ్ తో సోపతి. అలా ఆ సోపతి కాస్తా.. లతను, రాజ్ సింగ్ నూ కలిపింది. వారిద్దరి మధ్యా స్నేహం చిగురించింది. ప్రేమ చిగురించినట్టు కొన్ని పత్రికలు అప్పట్లో రాశాయి. కానీ, రాజ్ సింగ్ రాజవంశీయులు కావడంతో లతతో పెళ్లికి ఒప్పుకోలేదట. అలాగే, లత కుటుంబం కూడా మరాఠీ వరుణ్నే కోరుకుందే తప్ప రాజ్ సింగ్ ను ఒప్పుకోలేదు. రాజ్ సింగ్ కుటుంబంతో తీవ్రంగా విభేదించి ఫైట్ చేసినట్టూ అప్పట్లో వార్తలూ వెల్లువెత్తాయి. ఇరు కుటుంబాల్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే లతా, రాజ్ సింగ్ ఇద్దరూ జీవితాంతం స్నేహంగానే ఉన్నారే తప్ప వివాహం చేసుకోలేదన్నది నాటి కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల సారాంశం.
అయితే, 2004లో ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ సింగ్ తన ప్రేమ వ్యవహారం గురించి విప్పివిప్పనట్టు కొంచెం పంచుకున్నాడు. అది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారమని కొట్టిపారేస్తూనే… తామిద్దరమూ భిన్న కుటుంబాల నుంచి వచ్చినట్టు చెప్పుకొచ్చారు. అలాగే, తామిద్దరమూ తమ కుటుంబాలతో అత్యంత సన్నిహితంగా మెదిలేవారమని.. అసలది జరగదనీ మాకు తెలుసన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. దానివల్ల తమ మధ్య బంధం ఏమీ చెడలేదు.. అలా అనీ బాగా సన్నిహితంగా మెలిగే అంత పెరగలేదంటూ కూడా ఆయన వెల్లడించారు. నేను అత్యంత అభిమానించే నిధి లత.. కాబట్టి, ఇప్పటికీ నేను ఆమెతో సన్నిహితంగానే ఉన్నానంటూ ఆ సమయంలో ఆయన మిడ్ డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
లత, దుంగార్పూర్ గురించి పత్రికల్లో రావడంపై లతను కూడా చాలామందే తన ప్రేమ వ్యవహారం గురించి ఆరా తీశారు. దగ్గరి స్నేహితులు, బంధువుల నుంచీ చాలామందిలో ఆ అనుమానముండేది. ఓసారి ప్రముఖ పత్రికకు లత ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆ ప్రస్తావన తెస్తే.. కొన్ని హృదయం మాత్రమే వినేవి, తెలుసుకునేవి ఉంటాయి.. వాటిని అలా ఉండనిస్తేనే బాగుంటుందని ముక్తసరిగా కట్ చేసేసిందట లత.
బీసీసీఐ చైర్మన్ గా, భారత క్రికెట్ జట్టు సెలక్టర్ గా, మేనేజర్ గా పనిచేసిన రాజ్ సింగ్ దుంగార్పూర్ 2009లో 73 ఏళ్ల వయస్సులో కన్నుమూస్తే.. ది గ్రేట్ సింగర్, నైటింగేల్ ఆఫ్ ఇండియా లత 2022లో తన 92 ఏళ్ల వయస్సులో దివికెగిసారు.
ఇదీ లత ప్రేమకథ!



