మిగిలిన సమాజానికి ఓ పాఠం.. ఈ ఊరి కథ!

రోజుకు మూడుసార్లు ఊడ్చే గ్రామం.. చెత్త వేస్తే జరిమానా!

ఒక్కసారి తమ ఇల్లు తాము ఊడ్చుకోవడమే గగన గండమనుకునే సోమరులున్న ఇదే లోకంలో… తమ గ్రామాన్ని ఇంటికంటే పదిలంగా శుభ్రంగా ఉంచుకుంటున్న ఓ ఊరు గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే, పరిశుభ్రత వాళ్ల ప్రచారాస్త్రం కాదు… జీవన విధానం. అందుకు మనం ఓసారి ఒడిశా వెళ్లిరావాల్సి ఉంటుంది.

మన ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఎవరిది బాధ్యత..? మనదే కదా..? మరి మన ఊరు బాగుండాలంటే ఎవరిది బాధ్యత..? మున్సిపాలిటీదో, గ్రామపంచాయితీదో అనిపిస్తే… ఆ ఊరు గురించి ఇప్పుడు మనం చెప్పుకోకపోయేవాళ్లం. వాళ్లకు వాళ్ల ఊరు ఊరంతా తమ ఇంటిలాంటి వాకిలే. అందుకే అక్కడ పరిశుభ్రత ఓ సామాజిక బాధ్యత. ఓ అలవాటు..

ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో ఉన్న బబోజోలా అనే గిరిజన గ్రామం స్ఫూర్తి కథ ఇది. ఇక్కడి వీధులను రోజుకు మూడుసార్లు శుభ్రం చేస్తారు. ప్లాస్టిక్ కు ఈ ఊరు ఆమడ దూరం. చెత్తను వేరు చేసి వర్మీకంపోస్టుగా మారుస్తారు. ఎవరైనా తప్పిపోయి రోడ్డు మీద చెత్త వేసినా.. జరిమానా తప్పనిసరి. నిబంధనలు గ్రామస్థులకే కాదు… బయట నుంచి వచ్చినవారికీ వర్తిస్తాయి. అందుకే ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ పడేయడం అలవాటైనవాళ్లు… రోడ్లపైన గుట్కా, అంబర్ ఊంచుతూ చూపరులను అసహ్యం కల్గించేవాళ్లు అక్కడికెళ్లితే ఒళ్లు దగ్గర పెట్టుకుని పోవాలి. లేదంటే ఫైన్ కట్టాలి.

స్వచ్ఛభారత్ పేరిట ఏ ఏడాదికొకసారో, నెలకోసారో, లేక ప్రభుత్వాలకు, అధికారగణానికి గుర్తుకొచ్చినప్పుడో చేపట్టే కార్యక్రమం కాదిక్కడ. పదిహేనేళ్లకు పైగా నిత్యం స్వచ్ఛభారత్ కు ఓ ఉదాహరణలా చూసుకుంటున్న గ్రామమిది. ఇక్కడ పరిశుభ్రత వీరి రోజూవారీ జీవితంలో ఒక భాగం.

ఊరిని మార్చిన ఉపాధ్యాయుడు!

పదిహేనేళ్ల క్రితం స్థానిక పాఠశాలకు ఓ ఉపాధ్యాయుడు వచ్చాడు. అంతకుముందూ వచ్చారు, ఆయన తర్వాత ఎందరో వచ్చారు. కానీ, ఆ ఉపాధ్యాయుడు మాత్రం బబోజోలా అనే గిరిజన గ్రామం తనను గుర్తుంచుకునేలా చేశాడు. దేశమంతా తనను గుర్తించే సంతకం చేసి వెళ్లాడు. ఆయనే మధుసూదన్ మారాండీ. తను పనిచేస్తున్న గ్రామంపై ఒక మమకారంతో… బబోజోలా అనే ట్రైబల్ విలేజ్ ను ఒక మాడల్ గా మార్చాలనుకున్నాడు. ఆయన వేసిన మొదటి అడుగుజాడల్లో గ్రామస్థులంతా మెల్లిమెల్లిగా అడుగులేయడం ఆరంభించారు. అలా బబోజోలా గ్రామ పరిశుభ్రత… ఉమ్మడి సామాజిక బాధ్యతగా మారింది.

బబోజోలా గ్రామస్థులంతా కలిసి ఓ క్లబ్బును ఏర్పాటు చేసుకున్నారు. ఊరి పరిశుభ్రతను పర్యవేక్షించడంతో పాటే… ఆ వ్యవస్థను కొనసాగించేందుకు కావల్సిన ఏర్పాట్లను చూసుకోవడమే ఆ క్లబ్బు బాధ్యత. కేవలం మాటలతో కోతలు కోసి, తీర్మానాలు చేసుకుని, ప్రజాప్రతినిధులు, అధికారులను పిల్చుకుని, ఫోటోలు దిగి, వీడియోలు చేసి సోషల్ మీడియా పెట్టి, మీడియాకు పబ్లిసిటీ చేసుకోవడంతోనే తమ పని అయిపోయిందని చేతులు దులుపుకోలేదు ఈ గ్రామప్రజలు. తామే స్వయంగా డబ్బులు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. చెత్త డబ్బాలు పెట్టుకున్నారు. సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆరంభంలో పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మొదలుపెట్టిన చాలా పనులు .. కాలక్రమంలో ఈ ఊళ్లో సాధారణ నియమాలుగా మారిపోయాయి.

సిగరెట్ పీక కనిపించని గ్రామం… రోడ్ల మీద ఉమ్మి వేయని ఊరు!

మన ప్రభుత్వాల్లాగానో… సినిమాల్లాగానో ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఉండవు. సినిమాల్లో ఓవైపు మద్యం మత్తులో తూగుతూ, సిగరెట్ పొగలు కక్కుతూ సీన్స్ కనిపిస్తుంటే… పైన మాత్రం మద్యపానం, ధూమపానం క్యాన్సర్ కారకాలు, హానికరమంటూ వచ్చే ప్రకటనల్లా కాదు బబోజోలా అంటే. మద్యం ద్వారానే డబ్బులు గుంజుతూ.. మద్యపానంతో తులతూగే బార్ అండ్ రెస్టారెంట్స్ కు అనుమతిలిస్తూ, పర్మిట్ రూమ్స్ ను చూసీ చూడనట్టు వదిలేస్తూ, బెల్ట్ షాపుల్లో అమ్యామ్యాలు తీసుకుంటూ వదిలేస్తూ… ఇంకోవైపు, మద్యం తాగి పట్టుబడ్డ వారిపై చర్యలు తీసుకునే మన ప్రభుత్వాల తీరు ద్వంద్వ ప్రమాణాలు కావు… ఈ ఊరంటే. ఒక నిబద్ధత. ఒక ఆదర్శం. ఒక స్ఫూర్తి… ఇలా ఎన్నో సానుకూల పదాలకు ఓ పర్యాయపదంలా కనిపిస్తుంది బబోజోలా.

అందుకే ఈ ఊళ్లో ధూమపానం మొత్తానికే నిషేధం. అంతేకాదు, రోడ్లపై ఉమ్మి వేయడం, పొగాకు నమలడానికీ అనుమతి లేదిక్కడ. ఈ నిబంధనలు స్థానికులకే కాదు, ఎవ్వరు గ్రామానికి సందర్శనకు వచ్చినా వీటికి కట్టుబడి ఉంటేనే రావొచ్చు. లేదంటే జరిమానాలు కట్టి వెళ్లాల్సిందే. మనకో రూల్, బయటవాళ్లకో రూల్ అనే రూలే లేని ఊరిది.

రోజుకు మూడుసార్లు ఊడవాల్సిందే!

బబోజోలాలో వీధులను ఎప్పుడో వారంకోసారో, రెండు, మూడురోజులకోసారో శుభ్రం చేయరు. రోజుకు మూడుసార్లు చెత్త ఊడుస్తారు. అందుకే ఇక్కడ పరిశుభ్రత అనేది చాలా గ్రామపంచాయితీల్లోలా, మున్సిపాలిటీల్లోలా ఓ తంతులాగానో, ప్రహసనంగానో కనిపించదు. ఇక్కడ వీరి అలవాటుగా మారింది ఈ దైనందిన చర్య.

రోడ్లపై ఎటు పడితే అటు ఏది పడితే అది వేయకపోవడం. ఎదురింటి వాళ్లు చూడనప్పుడు మెల్లిగా తీసుకెళ్లి మన ఇంటి చెత్తను వాళ్ల ఇంటి ముందు వేసి వచ్చే సిల్లీ ఆలోచనలు చేయకపోవడం, బహిరంగ ప్రదేశాలను కూడా తమ ఇంటిలాగే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న సామాజిక స్పృహ, చెత్తను వేరు చేయడం, బయట నుంచి వచ్చేవాళఅలు కూడా ఇవే నియమాలను పాటించేలా చూడటం.. ఇవన్నీ విడివిడిగా చూస్తే చిన్న చిన్న చర్యలే. కానీ, ఇలా ప్రతీరోజూ పాటించడం వల్ల… నిబంధనలను ఎక్కడా బ్రేక్ చేయకుండా కఠినంగా వ్యవహరిస్తుండటం వల్ల…తమ సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న సామాజిక చైతన్యం వల్ల… బబోజోలాలో స్వచ్ఛతకు ఓ చిరునామా అయ్యింది.

70 కుటుంబాలే… కానీ, సామాజిక చైతన్యానికి కేరాఫ్!

ఇక్కడి ఇళ్లల్లో చాలావరకూ పైకప్పులన్నీ గడ్డితో వేసినవే. ఏ ఇల్లు చూసినా ఈ గిరిజన గ్రామానికి ఓ ప్రతీకలా ఇళ్ల గోడలపై పూలు, ఆకులు, జంతువులు, సంస్కృతీ. సంప్రదాయాలు ప్రతిబింబించే బొమ్మలు, అందమైన చిత్రాలతో కనిపిస్తాయి.

భిత్ పొటావ్ అంటే ఏంటి..?

స్థానికంగా ఈ చిత్రాల శైలిని భిత్ పొటావ్ అంటారు. గిరిజన, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల గోడలపై వేసే అందమైన కళాకృతులు, అలంకరణను భిత్ పొటావ్ అంటారు. భిత్ అంటే గోడ. పొటావ్ అంటే పూత పూయడం, అలంకరించడమనేది స్థానికంగా ఉన్న అర్థం.

పూలు, ఆకులు, జంతువులు, పక్షులు, ప్రకృతి ఆకృతులు, జ్యామితీయ డిజైన్లు ఇలాంటివన్నీ ఇక్కడి ఇండ్లపైన గ్రామంలోని మహిళలే వేస్తారు. ఈ చిత్రాలకు ఉపయోగించే రంగులు కూడా ఆర్గానిక్ గా చుట్టుపక్కల ప్రకృతి నుంచి సేకరించేవే. నది ఒడ్డున లభించే మట్టిరాళ్లు, చెట్ల బెరడు, పూలు వంటి సహజమైన పదార్థాలతో తయారుచేసిన రంగులతో ఈ కళాకృతుల అందంగా తీర్చిదిద్దుతారు. అందుకే బబోజోలా గ్రామం పరిశుభ్రతతో మాత్రమే ప్రకృతితో అనుబంధాన్ని కల్గి లేదు… అణువణువూ అడుగడుగునా గోడలపైన కనిపించే బొమ్మలు కూడా ఈ సమాజపు ఆత్మను పట్టి చూపిస్తాయి.

నినాదం కాదు… అలవాటు!

భారతదేశంలో పరిశుభ్రత కోసం ఎన్నో ఏళ్లుగా వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పేరుకుపోతున్న ప్లాస్టిక్ భూతం, కాలుష్యం, చెత్త భవిష్యత్ భారతాన్ని వణికిస్తున్నాయి. చెత్త నిర్వహణకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నా… ఆ వ్యవస్థలను మించిన చెత్త ఈ సమాజాన్ని ఆందోళనకు గురిచేసేది. ప్రజలు తమ అలవాట్లను మార్చుకోవాలని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా అపరిశుభ్ర భారతం ఎడతెగని ఓ ధారావాహికంలా కొనసాగుతోంది. ఇక్కడే బబోజోలా మన ముందుకు పలు ప్రశ్నలను తెచ్చిపెడుతోంది.

పరిశుభ్రతను ఓ ప్రచార అస్త్రంలా కాకుండా.. ఒక సమాజపు అలవాటుగా, సర్వసాధారణ నియమంగా మార్చుకుంటే ఏమవుతుందన్నదే ఇప్పుడా ప్రశ్నల్లో ఒకటి.

పోనంటే పెద్ద క్లిష్టమైన ఫార్మూలాలూ ఏమీ లేవు. ఒక టీచర్ ఆలోచనతో మొదలైన ఒక ఊరి పారిశుధ్య ఉద్యమం… ఇప్పుడు ఊరుమ్మడి బతుకుల ఉద్యమమైంది. అదే అలవాటుగా మారి జీవన విధానమైంది.

ప్రభుత్వాలో, స్వచ్ఛంద సంస్థలో వచ్చి చెబితే ఓ నాల్గు రోజులు పాటించి వదిలేయడం కాదు… మనకేది మంచో, ఏది చెడో తెలిసి వహిస్తున్న నిర్లక్ష్యం.. కూడనివన్నీ కూడబెట్టుకుని అనుభవిస్తున్న దైన్యం మనల్ని ఎంతలా వేధిస్తున్నాయో ఓవైపు తక్కిన భారతంలో కనిపిస్తుంటే.. అందుకు భిన్నమైన చైతన్యాన్ని మనం ఈ ఒడిశా పల్లె అయిన బబోజోలాలో చూడొచ్చు.

చాలాచోట్ల క్యాంపెయినింగ్ గా మారిన స్వచ్ఛ ఉద్యమం… ఇప్పుడు బబోజోలాకు సామూహిక సంస్కృతి. అందుకే ఈ ఊరి పేరు దేశం మొత్తం నినదిస్తోంది. ఈ ఊరి గతిని మార్చిన ఉపాధ్యాయుడి పేరు ఓ ప్రత్యేక పేజీని సృష్టించుకుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles